బాల సాహిత్యంలో గురజాడ జాడ

Updated By ManamFri, 09/21/2018 - 00:37
gurajada

జాతి చరిత్రలో ఎక్కువ ప్రాధాన్యం ఉన్నవారు బాలలు. బాలల ఉనికి దేశానికి జీవనాడి. వారి ప్రపంచంలో బాధలు, కోపాలు, మోసాలు ఉండవు, మాయామర్మాలు తెలియని ప్రపంచం పిల్లలది. అందుకే ‘పిల్లలున్న చోట దేవుడున్నాడు’ అంటారు ప్రసిద్ధ బాలసాహితీ వేత్త బి.వి నరసింహారావు.
 
imageబాలల శ్రేయస్సు కోరి చక్కటి బాలసాహిత్యం రాశారు మహాకవి గురజాడ అప్పారావు. ‘స్మితమతి సూచీ భేదిత/ ఋత మౌక్తిక పదకశతక మిభపతి భాషా /సతి కతి కుతకత గూర్చగ/సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్’ 
అని కఠిన పదాలతో ‘సత్యవ్రతి శతకము’ రాసిన గుర జాడ,  పిల్లల కోసం  అరటికాయ బజ్జి/ మినప్పప్పు సొజ్జి/ కలసిమెలసి తిందాం / కథలు విధలు విందాం/ అంటూ తేలికైన పదాలతో ‘మిణుగురులు’ పేరుతో గేయాలు రాశా రంటే ఆశ్చర్యం కలగక మానదు. దాశరథి దృష్టిలో ‘బాల సాహిత్యం రాయడమంటే రాజవీధిలో దర్జాగా ఊరేగుతున్న పట్టపుటేనుగును ముక్కాలి పీటమీద నిలుచోబెట్టడమే’. అసాధారణ ప్రతిభా సంపదతో అవలీలగా రాయవచ్చునేమో కానీ బాలల కోసం అలతి అలతి పదాలతో రాయడం కష్టం. కానీ గురజాడ కలం నుండి బాలసాహిత్య సృష్టి జరిగింది. 
పిల్లలకిచ్చే  తినుబండారాలను  పక్కవాళ్లకి ఇవ్వకుండా ఒక్కడినే తినమని చెప్పడం తల్లులకు అలవాటు. తెలియ కుండానే  బాల్యం నుండి స్వార్ధం నేర్పుతుంది. అరటి కాయ బజ్జి/ మినప్పప్పు సొజ్జి/ కలసి మెలసి తిందాం / కథలు విధలు విందాం/ అని గురజాడ ఒక గేయంలో రాశారు.   పిల్లల దగ్గర ఉన్న అరటిబజ్జీ అయినా వేరే తినుబండార మైనా కలసిమెలసి తింటామని, కథలు, విధి విధానాలు కలి సే నేర్చుకుంటామని చాటుతూ ఐకమత్యం, పరస్పర సహా య సహకార భావనల గొప్పదనం చెప్పారు. బాలసాహిత్యం కేవలం మౌఖికంగా ఉన్న కాలంలో ‘చిలకమ్మ పెండ్లి’, ‘రైలు బండి’ పేరుతో 1908లో గిడుగు సీతాపతి రాసిన గేయాలు పిల్లలు పాడుకునేంత సులభంగా, సరళంగా లేవు.   
ఆ లోటు పూరించడానికన్నట్టు తెలుగు సాహిత్యంలో ఆధునికతకు తెరతీసిన గురజాడ  కన్యాశుల్కం  పేరుతో ఆ ధునిక నాటకాన్ని 1892లో,  తొలి తెలుగు కథగా చరిత్రలో నిలిచిన ‘దిద్దుబాటు’ కథానికను 1910లో రాయడమే కాకుం డా పిల్లల శ్రేయస్సు కోరి ముత్యాలసరాలు ఛందస్సులో  గేయాలు, గేయ కథలతో తెలుగు సాహిత్యంలో ఆధునికతకు జీవం పోశారు.   

కాలం మారినా బాబుని, పాపని  వీపు మీద మోస్తూ గుర్రం ఆటలతో పిల్లల్లో ఉత్సాహం నింపే పాటలు పాడుతూ, మా తృభాషని పరిచయం చేసేవారున్నారు. అలాంటి మధురాను భూతులు స్మరణకు వచ్చే గేయం గురజాడ రాసిన   ఏనుగు ఎక్కి మనం / ఏ వూరెళదాం / ఏనుగు ఎక్కి మనం / ఏలూరెళదాం. పిల్లలను  ఊహా లోకాల్లో విహరింప చేస్తుంది. ప్రయాణ సాధనాలను పరిచ యం చేస్తూ, విజ్ఞానం పంచే గే యమిది. తాతయ్య మీసాలు లాగుతూ, అమ్మమ్మ ఒడిలో ఆడుకుంటూ కథలు, పాటలు వినే బాలల నుద్దేశించి రాసిన ‘బూరుగుచెట్టు/ చిలుకలతోను/ ఏమని పలికింది?’ ‘పండిన పండు/ ఎండినదూదై / పకపక నవ్వింది/’ అని చమత్కా రంగా గేయం సాగుతుంది. కలువలతో ఏమి మాట్లాడారని చిలకల్ని బూరుగ చెట్టు ప్రశ్నించినట్టు నడుస్తుంది గేయం. 

బూరుగ చెట్టు చిలుకల్ని  ప్రశ్నించడం, చిలుకలు కలు వలతో మాట్లాడడం గేయంలో చొప్పించడం ద్వారా  బాల లకు పర్యావరణాన్ని, పక్షులని పరిచయం చేశారు గురజాడ. పిల్లలకు ఆనందం, ఆహ్లాదం  కలిగించే ఎన్నో ఆటవస్తువులు ఉన్నప్పటికీ ప్రకృతిలోని చెట్లు, పక్షులను పరిచయం చెయ్య డం ద్వారా మనుషులకీ, ప్రకృతికి విడదీయలేని అనుబంధం ఉందని చెప్పడమే ఆయన ఉద్దేశం.  

తెలుగువాడి నోట గర్వంగా నలిగే గొప్ప గీతం ‘దేశ భక్తి’ గీతం. ఆనాటి పరిస్థితులకు అద్దంపడుతూ కొత్త దృక్కో ణంలో దేశమంటే మట్టి కాదోయి, దేశమంటే మనుషులోయి అన్న కొత్త సత్యాన్ని చాటి చెప్పిన గీతం 1910లో రాశారు గురజాడ. ‘దేశభక్తి’ గేయంలో ప్రతి పదం, ప్రతి వాక్యం దేశభక్తి పెంపొందింస్తుంది. 

‘పాడిపంటలు పొంగిపొర్లే దారిలో పాటుపడ’మనీ, /‘కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నించ’ మనీ/ అన్ని దేశాల్లో వ్యాపింప జేసి ధన సంపాదన చెయ్యమనీ,/ ‘వొట్టి గొప్పలు చెప్పుకో’వడం  మానేసి, ఏదైనా మేలు కూర్చి జనులకు చూపమ’నీ/ ‘దేశాలన్నీ తిరిగి వాణిజ్యం చేసి డబ్బు సంపా దించమని/ అలా సంపాదన లేని మనుషులకు కీర్తి సంప దలు ఉండ’వని / ‘సొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడు పడ’మనీ/ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నియు మెలగ వలె’ననీ/  ప్రబోధం చేస్తూనే 

‘దేశమనియెడి దొడ్డవృక్షం ప్రేమలనే పూలు పూయించా లని’/ ‘మానవ శ్రమ చేయడం వల్ల ఏర్పడిన చెమటతోనే పంటలు పండి ధనం మొలకెత్తాలని’ చాటిన ‘దేశభక్తి’ గీతం ఎప్పటికీ గొప్ప భావనలు నింపినదిగా నిలుస్తుంది. ‘ఈసు రోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడుతుం’దని సూటిగా ప్రశ్నించాడు గురజాడ. దేశభక్తి గేయం రాసిన రో జుల్లో మనదేశం పరాయి దేశీయుల పాలనలో నలుగుతోం ది. అప్పటికి దేశ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆ పరిస్థితులను చూసిన గురజాడ హృదయం స్పందించి రాసిన గీతమే అది. అందుకే గీతం లోని అంతర్గత భావాలు దేశ ఆర్ధిక, పారిశ్రామికాభివృద్ధి, అధికోత్పత్తి, విదేశాలలో వాణిజ్యం, దేశసమైక్యత, మత సామరస్యం కోరుతుంది.  దేశ శ్రేయస్సు కోసం సాహిత్యం అన్న సందేశాన్ని బలంగా వినిపించింది. 

‘కన్యక’, ‘పూర్ణమ్మ’, ‘లవణరాజు కల’ అనే గేయ కథ లను రాశారు. ఆయా గేయకథల్లో ఒక్కోకథలో ఒక్కో సామా జిక రుగ్మతను వేలెత్తి చూపించారు గురజాడ. ‘కన్యక’ గేయ కథ రాజరికానికి చెందిన స్త్రీ కథ. మహిళల ఆత్మగౌరవం, ఆత్మాభిమానాలను లోకానికి ఎలుగెత్తి చాటిన కావ్యం. 

ఆనాటి సమాజంలో ఆయన దర్శించిన సామాజిక రుగ్మ తలైన బాల్యవివాహాలు, కన్యాశుల్కాలను చర్చించాడు పూర్ణ మ్మలో. ‘లవణరాజు కల’ సమాజంలో పాతుకుపోయిన  కుల మత వర్ణ వివక్ష మీద బలంగా విసిరిన బాణం. ‘మత ములన్నియు మాసిపోవును. జ్ఞానమొక్కటి నిలిచి వెలుగు ను’ అని ఎలుగెత్తి చాటడమే కాకుండా మంచి అన్నది మాల అయితే, మాల నేనగుతా’నని ధైర్యంగా సమాజానికి చెప్పిన సంస్కరణ వాది గురజాడ. గురజాడ, కందుకూరి వంటి వారు చేసిన ప్రయత్నాల వల్లనే తరువాతి కాలంలో సంస్కర ణలు జరిగాయి. సాహిత్యం ద్వారా సమాజంలోని కుళ్ళును కడగాలని, దురాచారాలను తరమాలని గట్టి ప్రయత్నం చేసి న గొప్పకవి గురజాడ. ఆయన చనిపోయి 103 ఏళ్లు దాటినా స్మరించుకుంటున్నాం. నేటి కవులు, సాహితీవేత్తలు గురజాడ అనుసరించిన జాడను అడుగుజాడగా మార్చుకొని నేటి స మాజ పురోభివృద్ధికి  దుష్ట సంప్రదాయాలను దూరం చేసే రచనలు చేసేందుకు కలాలు ఝళిపించాలని ఆశిద్దాం.  

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు 
8328642583

 

English Title
gurajada in child literature
Related News