ఔషధ ధరల కళ్లేనికి ‘ధరల సూచీ’

Updated By ManamSun, 06/03/2018 - 18:07
Govt To Bring Pharma Price Index
  • కేంద్రం నిర్ణయం.. నెలాఖరులోపే నోటిఫికేషన్.. వ్యతిరేకిస్తున్న సంస్థలు

Govt To Bring Pharma Price Indexన్యూఢిల్లీ: దేశంలో ఔషధ ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఔషధ ఉత్పత్తుల ధరలను నిర్ణయించేందుకు సరికొత్త ధరల సూచీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. జూన్ నెల లోపే ధరల సూచీని ఏర్పాటు చేసేందుకు చకచకా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 850 రకాల అత్యవసర ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తూ నిర్ణయిస్తోంది. అంతేగాకుండా ఔషధ ధరలను జాతీయ ఔషధ ధరల అధీకృత సంస్థ (ఎన్పీపీఏ) నియంత్రిస్తోంది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారంగా ఏటా ధరలను సమీక్షిస్తోంది. 10 శాతం మించకుండా ధరలను పెంచుకునేందుకు సంస్థలకు అనుమతిస్తోంది. అయితే, తాజాగా ఆ వ్యవస్థను రద్దు చేసేసి సరికొత్త ధరల సూచీని ఏర్పాటు చేయాలని కేంద్రం అడుగులు వేస్తోంది. అన్ని ఔషధాలను దాని పరిధిలోకి తీసుకురావాలని చర్యలు తీసుకుంటోంది.

ఓ ప్రభుత్వాధికారి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ధ్రువీకరించారు. జూన్ నెలలోనే ఔషధ విభాగం దానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుందని తెలిపారు. కేవలం షెడ్యూల్డ్ ఔషధాలనే కాకుండా, నాన్ షెడ్యూల్డ్ ఔషధాల ధరలను ఈ కొత్త ధరల సూచీలోకి తీసుకొస్తారని చెబుతున్నారు. అందుకు అనుగుణంగా ఔషధ ధరల నియంత్రణ చట్టం 2013కు సవరణలు చేయాల్సిందిగా నీతి ఆయోగ్‌లోని మేధో వర్గం సూచించిందని వివరిస్తున్నారు. ఇక, ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.లక్ష కోట్ల దేశీయ ఔషధ మార్కెట్లో కేవలం 17 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంది. అమ్మే మందుల్లో 24 శాతం మందులపైనే కేంద్ర అజమాయిషీ ఉంటోంది. ఈ నేపథ్యంలోనే సామాన్యుడికి ఔషధాలను అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు చెబుతున్నారు. 

వ్యతిరేకిస్తున్న సంస్థలు...
కేంద్ర తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని పలు సంస్థలు, ఔషధ నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. ఔషధాలు నాణ్యంగా రావాలంటే మాత్రం అందుకు తగిన మూల్యం తప్పనిసరి అని అంటున్నారు. తక్కువ ధరల్లో నాణ్యతతో కూడిన ఔషధాలు రావాలంటే అది చాలా కష్టమైన పని అని అంటున్నారు. మధ్య, చిన్న తరహా సంస్థలకైతే అది తలకు మించిన భారమవుతుందని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నాణ్యతా ప్రమాణాలను అందుకోవాలంటే... అందుకు తగినట్టుగా సంస్థలు ధరలు పెంచుకునే వెసులుబాటు ఉండాలని చెబుతున్నారు. టోకు ధరల సూచీకి మించి ధరలు పెంచకుంటే మాత్రం చిన్న, మధ్య తరహా సంస్థలు మౌలిక వసతులు ఏర్పరచుకోలేవని, తద్వారా పరిశోధన, అభివృద్ధి, ఎగుమతులు చాలా ప్రభావితమవుతాయని హెచ్చరిస్తున్నారు. 

English Title
Govt To Bring Pharma Price Index
Related News