పంతం మూవీ రివ్యూ

Updated By ManamThu, 07/05/2018 - 13:14
Gopichand Pantham
Gopichand Pantham Movie Review

చిత్రం: ప‌ంతం
విడుద‌ల తేదీ: 5.07.18
సెన్సార్ రిపోర్ట్‌:  యు/ఎ
నిర్మాణ సంస్థ‌: శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్‌

తారాగ‌ణం:  గోపీచంద్‌, మెహ్రీన్ కౌర్‌,  సంప‌త్, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, అజ‌య్‌, హంసా నందిని, ప్ర‌భాస్ శ్రీను, ముఖేష్ రుషి, సాయాజీ షిండే, ఆవిష్ విద్యార్థి, రాళ్ల‌ప‌ల్లి, గిరిబాబు, శ్రీనివాస‌రెడ్డి, పృథ్వి, స‌త్య కృష్ణ‌, మ‌హేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి త‌దిత‌రులు
కూర్పు ప‌్ర‌వీణ్ పూడి
క‌ళ‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌
మాట‌లు: ర‌మేశ్ రెడ్డి, శ్రీకాంత్‌
సంగీతం: గోపీ సుంద‌ర్‌
కెమెరా: ప‌్ర‌సాద్ మూరెళ్ళ‌
నిర్మాత‌:  కె.కె.రాధామోహ‌న్‌
ద‌ర్శ‌క‌త్వం:  కె.చ‌క్ర‌వ‌ర్తి

క‌టౌట్ చూసి కొన్నిటిని న‌మ్మేయాల‌న్న‌ది పాపుల‌ర్ డైలాగ్‌. గోపీచంద్ క‌టౌట్ చూసి, యాక్ష‌న్ సినిమాల‌కు ప‌నికొస్తాడు అనేది అచ్చంగా న‌మ్మాల్సిందే.  గ‌తంలో ఆయ‌న న‌టించిన కొన్ని సినిమాలు అందుకు తార్కాణాలు. తాజాగా అలాంటి యాక్ష‌న్ కీల‌కంగా గోపీచంద్ న‌టించిన సినిమా `పంతం`. ఇది ఆయన న‌టించిన 25వ సినిమా. టీజ‌ర్‌లో డైలాగులు, స్టైలిష్ లుక్స్ ఇప్ప‌టికే ఆక‌ట్టుకున్నాయి. కొత్త ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తిని న‌మ్మి గోపీచంద్ చేసిన ఈ సినిమా ఆయ‌న‌కు మైలురాయిగా నిలిచిపోతుందా?  లేదా?  లుక్ వేసేయండి..

క‌థ‌:
తెలుగు రాష్ట్రాల్లో హోం మినిష్ట‌ర్ జయేంద్ర (సంప‌త్‌) అంద‌రి మంత్రుల ద‌గ్గ‌రున్న న‌ల్ల‌ధ‌నాన్ని మేనేజ్ చేస్తూ ఉంటాడు. అయితే గోపీచంద్‌, అత‌ని స్నేహితుడు హోం మినిష్ట‌ర్, హెల్త్ మినిష్ట‌ర్ ద‌గ్గ‌రున్న డ‌బ్బును కొట్టేస్తాడు. పోయింది న‌ల్ల‌డ‌బ్బు కాబ‌ట్టే ఎవ‌రికీ తెలియకుండా ఎంక్వైరీ చేయ‌మ‌ని సిబీఐ ఆఫీస‌ర్‌(షాయాజీ షిండే)ని అడుగుతాడు. ఈలోపు గోపీచంద్ గురించిన అస‌లు విష‌యం జయేంద్ర‌కు తెలుస్తుంది. అప్పుడు జ‌యేంద్ర ఏ నిర్ణ‌యంతీసుకుంటాడు?  గోపీచంద్‌, కోటీశ్వ‌రుడైన  విక్రాంత్ సురానాకి మ‌ధ్య రిలేష‌న్ ఏంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే  సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్
 గోపీచంద్ న‌ట‌న‌, యాక్ష‌న్, డైలాగులు
 కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన న‌టీన‌టులు
 లొకేష‌న్లు, కాస్ట్యూమ్స్, ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌
 క్లైమాక్స్ సీన్స్

మైన‌స్ పాయింట్లు
 రొటీన్ క‌థ‌
 నెరేష‌న్‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం
 ట్యూన్లు మ‌ళ్లీమ‌ళ్లీపాడుకునేలా లేవు
 కామెడీ లేదు

Gopichand Pantham Movie

విశ్లేష‌ణ‌
అన్నీ వేసి చూడు, న‌న్ను వేసి చూడు అని వంటింట్లో అంటుంద‌ట  ఉప్పు. సినిమాల విష‌యంలో అన్నీ ఉన్నా స‌రే, క‌థ‌దే అగ్ర‌తాంబూలం. ఈ సినిమాలో అన్ని విష‌యాల్లోనూ అత్యంత జాగ్ర‌త్త తీసుకున్న ద‌ర్శ‌కుడు ఎందుకో క‌థ‌ను మాత్రం పాత‌దాన్నే తీసుకున్నాడు. పైగా టీజ‌ర్‌లోనే `చెప్పుకోవ‌డానికి ఇది కొత్త క‌థ కాదు` అని కూడా చెప్పాడు.

అయినా టిక్కెట్టు కొని సినిమాకు వెళ్లేది పాత సినిమా క‌థ‌ను చూడ‌టానికి కాదుగా. రాబిన్ హుడ్ త‌ర‌హాలో ఉన్న‌వాడి ద‌గ్గ‌ర దోచి లేనివాడికి పెట్ట‌డం అనే కాన్సెప్ట్ తోనే ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ క‌థలో ఎక్క‌డా కొత్త‌ద‌నం లేదు. `కిక్‌`, `శివాజి` వంటి సినిమాలను గుర్తుచేస్తుందీ సినిమా. 

గోపీచంద్‌, మెహ‌రీన్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, సంప‌త్‌, పృథ్వి.. ఒక‌రేంటి అంద‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించారు. చాన్నాళ్ల త‌ర్వాత హంసానందిని ఈ సినిమాలో క‌నిపించారు. త‌నికెళ్ల భ‌ర‌ణి పాత్ర హుందాగా ఉంది. గోపీచంద్ ప‌డ్డ క‌ష్టం కూడా తెర‌మీద క‌నిపించింది. చూడ్డానికి కూడా హీరో స్టైలిష్‌గా ఉన్నారు. మెహ‌రీన్ గ‌త చిత్రాల‌తో పోలిస్తే కాస్త స‌న్న‌బ‌డింది. కాక‌పోతే కామెడీ పెద్ద‌గా లేదు. పృథ్వి, శ్రీనివాస‌రెడ్డి కాసింత ఊర‌ట క‌ల్పించారు. హీరో, హీరోయిన్ల ల‌వ్‌స్టోరీ సినిమాలో అత‌క‌లేదు. క్లైమాక్స్ సీన్లు, డైలాగులు మెప్పించాయి. సినిమాలో కొన్ని డైలాగులు ఆలోచింప‌జేస్తాయి. అయినా రొటీన్‌గా ఉన్న సినిమా ఇది. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు న‌చ్చేవారికి ఈ సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. కొత్త‌ద‌నం ఆశిస్తే మాత్రం క‌ష్ట‌మే.

రేటింగ్‌: 2.5/5
చివ‌ర‌గా: `పంతం`.. రొటీన్ క‌మర్షియ‌ల్ మూవీ

English Title
Gopichand Pantham Movie Review
Related News