దనుంజయ.. ఇది నీకు తగునా..?

Updated By ManamThu, 09/20/2018 - 23:26
Surendranath Sharma
  • పూజారి జీతం పెంపునకు కోర్టు ఉత్తర్వులు 

  • అమలుకు రూ.25 వేలు డిమాండ్ చేసిన ఏఈవో

  • ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన ఆలయ అధికారి

Surendranath Sharmaకర్నూలు: ఆయన పరమ పవిత్ర శైవ క్షేత్రంలో ఏఈవో. ప్రభుత్వం నెలనెలా వేలకు వేలు జీతం ఇస్తోంది. అయితే ఇది చాలదన్నట్టు స్వామి సేవ చేసుకునే ఓ పూజారి వద్ద కూడా కక్కుర్తి పడ్డారు. జీతం పెంపు ఉత్తర్వులు అమలు చేసేందుకు రూ.25వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమిలేక ఆ పూజారి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం అధికారులు వలపన్ని పట్టుకున్నారు.  దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో మహానంది ప్రముఖమైనది. ఈ దేవాలయంలో మూరి సురేంద్రనాథ్ శర్మ అనే పూజారి గత 10 ఏళ్ల నుంచి కాంట్రాక్టు అర్చకుడిగా పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల అర్చకులకు అకౌంట్ పేయి జీతాలు చేసింది. దీంతో అర్చకుల జీతం గతం కంటే ఎక్కువగా పెరిగింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయాలని అర్చకులు పలుమార్లు దేవాదాయ శాఖ అధికారులను వేడుకున్నారు.  కనికరం చూపకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు వారికి అనుకూలంగా తీర్పు వెలువరిస్తూ.. ఆ పెరిగిన జీతాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఆ ఆదేశాలను అమలు చేయాల్సిన అధికారిమాత్రం కక్కుర్తిపడ్డారు. జీతం పెంచుతూ నిర్ణయం తీసుకోవాలంటే  భారీ మొత్తం లంచంగా ముట్టజెప్పాలని డిమాండ్ చేశారు. చివరికి రూ.25 వేలకు ఒప్పందం కుదిరింది. ఇందుకు ధనుంజయ సరే అనడంతో పూజారి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.  దీంతో ఏసీబీ డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో బృందం రంగంలోకి దిగింది. గురువారం సాయంత్రం పూజారి ఏఈఓకు రూ.25వేలు లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ పంచనామా చేసి ఏఈఓను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో ఎన్‌ఎస్‌ఎం శ్రీధర్, ఖాదర్ భాష, హెడ్‌కానిస్టేబుళ్లు బాలరాజు, పోలీసులు సుల్తాన్, హనుమంతు, రఘు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. 

అధికారుల తీరులో మార్పు కరువు..
ఏసీబీ అధికారులు వరుసగా దాడులు చేసి అవినీతి అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నా.. అధికారుల్లో ఎలాంటి మార్పు కనబడడం లేదు. ఎవరేమన్నా.. మా వాటా మాకు ఇస్తే.. కానీ ఫైల్ ముందుకు కదలని వ్వం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జిల్లాలో ఉయ్యాలవాడ గ్రూప్ టెంపుల్ ఈవో వీరయ్య ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉండడం తో ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. అలాగే మహానంది దేవస్థానంలో డ్రాప్ట్‌మెన్‌గా పనిచేస్తున్న సర్వేశురుడు అనే వ్యక్తి కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. వీరే కాకుండా మరికొంత మంది అవినీతి అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుబడుతున్నా... మిగిలిన అధికారుల్లో ఎలాంటి మార్పు కనిపించడంలేదని అంటున్నారు.

English Title
This is good for you
Related News