ఐబీసీతో సత్ఫలితాలు

Updated By ManamThu, 05/17/2018 - 22:32
Amitabh_Kant_PTI

Amitabh_Kant_PTIకోల్‌కతా: నూతన ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్ట్స్రీ కోడ్ (ఐ.బి.సి) బాలారిష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ, అది ఇండియాలో ‘క్రోనీ క్యాపిటలిజం’కి తెర దించుతోందని నీతి ఆయోగ్ సి.ఇ.ఓ అమితాబ్ కాంత్ అన్నారు. ఆర్థిక వ్యవస్థలో ఒక వ్యాపార సంస్థ విజయం ఆ సంస్థ యజమానికి, ప్రభుత్వ అధికారులకు మధ్యనున్న సన్నిహితత్వంపై ఆధారపడినప్పుడు, దాన్ని ‘క్రోనీ క్యాపిటలిజం’గా పిలుస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల బంధువుల సంస్థలకు మేలు చేసే విధంగా ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు ఉండటం కూడా ‘క్రోనీ క్యాపిటలిజం’ లక్షణం. ‘‘ఇంతకుముందు అప్పులు చేసి తీర్చేవారు కాదు. ఇప్పుడు తీసుకున్న రుణాలు చెల్లించకపోతే, ఎవరైనా సరే చేస్తున్న వ్యాపారాన్ని కోల్పోతారు’’ అని కాంత్ అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన వ్యవస్థాగత సంస్కరణల్లో అది ప్రధానమైనదని ఆయన అన్నారు. ఈ కోడ్ అమలులో కొన్ని సమస్యలు తలెత్తుతున్నమాట నిజవేునని, కానీ, ఈ నూతన చట్టం సత్ఫలితాలను అందిస్తుందనే ఆశ ఉందని ఆయన అన్నారు. ఇక్కడ ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అమితాబ్ కాంత్ మీడియా ప్రతినిధులతో విడిగా మాట్లాడారు. ఐ.బి.సి ప్రభావశీలతపై కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) విడుదల చేసిన ప్రధాన ఎన్.పి.ఎ ఖాతాల పరిష్కార ప్రక్రియను నిర్దేశిత కాలపరిధిలో పూర్తి చేయడంలో అది విఫలమైందనే విమర్శలూ ఉన్నాయి. దివాలా తీసిన సంస్థకు 270 రోజుల్లోగా ఒక పరిష్కారం కనుగొనాలి లేదా దాని ఆస్తులను అమ్మేసి వచ్చిన నగదును రుణ దాతలకు పంచాలని ఐ.బి.సి పేర్కొంటోంది. కానీ, వివిధ వ్యాజ్యాల వల్ల జాప్యాలు సంభవిస్తున్నాయి. ‘‘ఒక వ్యాపార సంస్థ తర్వాత మరో వ్యాపార సంస్థ తన వ్యాపార సామ్రాజ్యాన్ని కోల్పోతోంది. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ వాటిని సాగనంపుతోంది’’ అని కాంత్ అన్నారు. ఐ.బి.సికి చెందిన న్యాయ నిర్ణయాధికార సంస్థగా ట్రైబ్యునల్ వ్యవహరిస్తోంది. నిరర్థక ఆస్తుల వల్ల బ్యాంకులు దెబ్బతింటున్నాయని, వాటిలో ఉన్నది ప్రజా ధనం కావడం వల్ల బ్యాంకులను ప్రభుత్వం కొంత క్రమశిక్షణలో పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. హెచ్చు జి.డి.పి వృద్ధికి ముఖ్య అవరోధాలలో, దేశంలో ఉన్న కాలం చెల్లిన సంస్థలు ఒక కారణమని, వాటిని ‘విప్లవాత్మకమైన రీతిలో పునర్నిర్మించా’లని కాంత్ అభిప్రాయపడ్డారు. ‘‘సంస్థల్లో చాలా వాటిని పునర్నిర్మిస్తే తప్పించి మనం 9-10 శాతం ఆర్థిక వృద్ధిలోకి ప్రవేశించలేం. ఉదాహరణకు, విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, భారత వైద్య మండలి వంటి వాటిలో తీవ్ర మార్పులు తీసుకురావాలి’’ అని ఆయన అన్నారు.  

English Title
Good results with IBS
Related News