బంగారు చీర

Updated By ManamThu, 07/05/2018 - 01:55
golden saree

చీరతో వచ్చే అందం, నిండుతనం మరే డ్రెస్‌తోనూ రాదు. అలాంటి చీరలు ఏ రంగులో అయితే బావుంటాయని మగువలు జుట్టు పీక్కుంటారు. ఏ వయసు వారికైనా, మేనిఛాయ ఏదైనా అద్భుతంగా..అతికినట్టు సరిపోయే రంగు బంగారు వర్ణం. ఎక్కువ మెరుపులతో జిగేల్ మంటుందేమో.. రిచ్‌గా ఉంటుందేమో.. గాడీగా కనిపిస్తుందేమో.. మరీ ఖరీదెక్కువేమో.. అందరూ నన్నే చూస్తారేమో...ఈ అనుమానాలన్నిటికీ గోలీమారో.  

షేడ్స్ ఎక్కువే
imageగోల్డ్ కలర్ చీర అనగానే ఒకే రంగును ఊహించుకుంటారు. కానీ ఈ టెక్చర్‌లో వచ్చే రంగులు చాలా ఉన్నాయి. వీటిలోనూ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ ఉంటాయి. షిమ్మర్, నెట్, జెరీ, వర్క్, ప్లెయిన్, బ్రొకేడ్.. ఇలా ఒక్కొక్క క్లాత్‌పై ఒక్కోలా కనిపించడమే గోల్డ్ కలర్ స్పెషాలిటీ.  అంతే కాదు వీటిలోనూ రెడ్ టించ్, బ్రౌన్, యాష్, వైట్, ఎల్లో వంటి వెరైటీల పోగులు ఉంటాయి కనుక ఇది ఒకేలా ఎప్పుడూ కనిపించదు. ఉదాహరణకు పట్టు చీరలో అయితే ‘గోల్డ్ పట్టు చీర’ కళ్లు చెదిరేలాంటి అప్పీల్ ఇస్తుంది. అదే సింథటిక్ శారీలో ఈ రంగు మరోలా ఉంటుంది. ఫ్యాన్సీలో కనిపించే తళుకుబెళుకుల గోల్డ్ కలర్ వేరు. 

సెలబ్స్‌కు ఫేవరెట్
రేఖా వంటి సెలబ్రిటీలకు ఆల్ టైం ఫేవరెట్ అంటే ఈ రంగు చీరనే. బహుశా రేఖనే గోల్డ్ కలర్ చీరలకు బ్రాండ్ అంబాసిడర్ అనాలేమో. అవార్డు ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు తరచూ అతిథిగా హాజరయ్యే రేఖా ఎక్కువగా ధరించేది ఈ రంగు చీరలే. సింపుల్ మేకప్ వేసుకున్నా, హెవీ మేకప్ వేసుకున్నా ఈ రంగు చీరకు మ్యాచ్ అయిపోడవం ఇందులోని ప్రత్యేకత. బాలీవుడ్ సెలబ్రిటీలంతా పలు సందర్భాల్లో గోల్డ్ చీరలే ఎంచుకోవడానికి ప్రధాన కారణం..సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలంటే గోల్డ్ కలర్‌కు మించిన కలర్ మరోటి లేదు మరి. ఒకప్పుడు బ్లాక్  ఈజ్ ద సింబల్ ఆఫ్ గ్లామర్ అనేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ అంతా గోల్డ్ కలరే.  

అదిరే నగలు image
ఇక ఈ రంగు చీర కున్న అతిపెద్ద అడ్వాంటేజ్.. నగలు. మీరు టెర్రకోట నగలు ధరించినా, కేడీఎం బంగారు ఆభరణాలు ధరించినా రెండూ సూపర్‌గానే ఎలివేట్ అవుతాయి. డైమండ్ జువెలరీ, ముత్యాల సెట్, కుందన్స్, నవరత్నాల నగలు, ఇమిటేషన్ జంక్ జువెలరీ, ఆక్సిడైజ్డ్ నగలు ఇలా ఏవైనా ధరించండి అన్నీ చక్కగా కనిపిస్తాయి. అందుకే నగలతో బెడద ఉండదు, ప్రత్యేకంగా కొని సెట్ చేసుకునే తలనొప్పులుండవని సామాన్యులు, సెలబ్రిటీలు గోల్డ్ కలర్ శారీల కలెక్షన్‌వైపే మొగ్గుచూపుతున్నారు.  త్వరలో ఆషాఢ బోనాలు, ఆతరువాత శ్రావణ మాసం లక్ష్మీ వ్రతాలు, పెళ్లిళ్ల సీజన్ వస్తున్నందు ఇలాంటి చీరలకు మీ క్లాసెట్‌లో స్థానం ఇవ్వండి, స్పెషల్‌గా కనిపించండి.

English Title
Golden sari
Related News