జైల్లో గ్యాంగ్‌స్టర్ బజరంగీ హత్య

Updated By ManamMon, 07/09/2018 - 21:27
image
  • తుపాకీతో కాల్చిచంపిన మరో ఖైదీ.. ఉత్తరప్రదేశ్ జిల్లా జైలులో ఘటన 

  • సీరియస్‌గా తీసుకున్న యోగీ సర్కార్.. ఘటనపై న్యాయ విచారణకు ఆదేశం

imageబాఘ్‌పట్(యూపీ): ఉత్తరప్రదేశ్‌లో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ ప్రేమ్ ప్రకాశ్ సింగ్ అలియాస్ మున్నా బజరంగీ జైల్లోనే హత్యకు గురయ్యాడు. ఓ ప్రజాప్రతినిధి హత్య సహా పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న బజరంగీని ప్రత్యర్థి ముఠాకు చెందిన మరో ఖైదీ తుపాకీతో కాల్చి చంపేశాడు. బాఘ్‌పట్ జిల్లా జైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జైలులో ఉన్న విచారణ ఖైదీల చేతుల్లోకి ఆయుధాలు ఎలా చేరాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ నలుగురు జైలు అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు ఘటనపై విచారణకు ఆదేశించారు. బీజేపీ ఎమ్మెల్యే లోకేష్ దీక్షిత్‌ను డబ్బు కోసం బెదిరించాడనే కేసులో బజ్రంగీపై బాఘ్‌పట్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణకు హాజరుపరిచేందుకు ఝాన్సీ జైలులో శిక్ష అనుభవిస్తున్న బజ్రంగీని ఆదివారం నాడు పోలీసులు బాఘ్‌పట్ జిల్లా జైలుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అదే జైలులో ఉన్న బజరంగీ ప్రత్యర్థి, మరో గ్యాంగ్‌స్టర్ సునీల్ రాతి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో బజరంగీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు వెల్లడించారు.

పోలీసుల హిట్ లిస్ట్‌లో..
గ్యాంగ్‌స్టర్ బజ్రంగీ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన భార్య సీమ గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. బజరంగీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని సీమ ఆరోపించారు. ఈ క్రమంలో సోమవారం బజ్రంగీ హత్యకు గురవడం.. అదీ జిల్లా జైలులోని ఓ ఖైదీ తుపాకీతో కాల్చిచంపడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జైలులోపలికి తుపాకీ ఎలా చేరిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, సోమవారం ఉదయం బజరంగీని న్యాయస్థానానికి తీసుకెళ్లే ప్రయత్నాలలో ఉండగా.. సునీల్ రాతి అనే ఖైదీ కాల్పులు జరిపి బజరంగీని హత్య చేశాడని జైలు అధికారులు వివరిస్తున్నారు.

English Title
Gangster Bajrangi killed in jail
Related News