నీటితో ఆటలు

Updated By ManamSun, 10/21/2018 - 08:56
water games

మన ప్రకృతి.. మన బతుకు.. మన బలం.. నీరే..
అందుకే జలమంటే మనకిష్టం.
నీటితో ఆడటమంటే మరీ మరీ ఇష్టం. 
బాత్‌రూముల్లోనే బందీ అయిపోతున్న ఆధునిక శైలిలో బిజీగా ఉన్న మనకు ఎక్కడైనా, ఎప్పుడైనా.. బావో, కుంటో, చెరువో, కాలువో.. కనిపిస్తే మనస్సు ఉరకలేస్తుంది. సంతోషం, సరదాలు ముప్పిరిగొంటాయి. నదో, పాయో, సముద్రమంత నీటిని చూస్తే భయమేసినా సరే.. అందులో దిగకుండా ఉండలేం. కనీసం కాలైనా ముంచుతాం.
అంతిష్టం మనకు నీరంటే! నీటి ఆటలంటే ఇక చెప్పేదేముంది! 

మనసంతా సంబరం.. జగమంత ఆనందం!!
imageనీరు నిలకడగా, ప్రవాహంగా, కెరటాలు-అలల రూపంలో మనకు అందుబాటులో ఉంటుంది. ఈ మూడు స్థితులకు అనుగుణంగా నీటి ఆటలు కూడా రూపొందించుకున్నాం. మనమందరమూ ఏదో ఒక సమయంలో ఎంజాయ్ చేస్తున్న స్విమ్మింగ్, డైవింగ్, స్నోర్‌కెల్లింగ్, వాటర్‌పోలో వంటివి నిలకడగా ఉన్న నీటిలో ఆడే ఆటలు. ప్రవాహంలో ఆడేవి పడవల ఆటలు. కెరటాలపై తేలుతూ.. అలలపై దూసుకుపోయే ఆటలు సర్ఫింగ్, రాఫ్టింగ్ వంటివి. 
మన తెలుగు రాష్ట్రాల్లో మొదటి రెండు రకాల ఆటలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జల క్రీడాపోటీలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నీటి ఆటల గురించి తెలుసుకుందాం...
పడవతో ఆడే ఆటల్లో వందల రకాలున్నాయి. అయితే ప్రధానంగా పడవల రకాలను బట్టి మన దేశంలో.. అందునా మన రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో మక్కువతో ఆడుతున్న వాటిలో కనోయింగ్, కయాకింగ్, రోయింగ్, సెయిలింగ్, యాటింగ్ ముఖ్యమైనవి.

కనోయింగ్ - కయాకింగ్
చిన్న పడవలతో దాదాపు సింగిల్ సీటర్ బోట్‌లతో ఆడే ఆటలివి. చూడ్డానికి రోయింగ్, కనోయింగ్, కయాకింగ్ ఒకే మాదిరిగా కనిపిస్తాయి. కనోయింగ్‌లో బోటులో మోకాళ్లపై కూర్చుని తెడ్డుతో నడిపిస్తూ లక్ష్యాన్ని చేరాల్సి ఉంటుంది. అదే కయాకింగ్‌లో ఇట్లా మోకాళ్లపై కాకుండా, పడవలో కూర్చుని రెండు వైపులా సరిపోయేట్టు ఉండే పొడవాటి తెడ్డుతో పడవను నడిపించాల్సి ఉంటుంది. రోయింగ్, కనోయింగ్, కయాకింగ్‌లకు ఉన్న తేడా ఉన్నదల్లా ఈ తెడ్డులోనే. రోయింగ్‌లో తెడ్డుకు ఒకటే వైపు నీటిని తోసే భాగముంటే, వీటిలో రెండు వైపులా నీటిని తోయడానికి వీలు కల్పిస్తూ రెండు చివరల్లోనూ తెడ్డు వెడల్పుగా ఉంటుంది.

చిన్నపిల్లల నుంచీ పండు ముసలి వరకూ ఏ వయస్సు వారైనా ఆడటానికి అనుకూలంగా ఉండే ప్రత్యేక క్రీడ కనోయింగ్. అంతే కాదు.. విశాలమైన సముద్రంలోనైనా, సన్నని నీటి పాయలోనైనా ఆడగలిగే సాహస క్రీడ కూడా. దీనికుపయోగించే పడవలు కూడా మిగతా ఆటలకు ఉపయోగించే వాటితో పోలిస్తే ధర చాలా తక్కువ. జంట పడవలు ఉపయోగిస్తూ దివ్యాంగులు సైతం ఆడగలిగే ఆట ఇది. పడవ కూడా సన్నగా, తేలిగ్గా ఉంటూ ఎక్కడికైనా ఈజీగా తీసుకుపోగలిగేలా ఉంటుంది. అందుకే ఇటీవలి కాలంలో ఈ ఆటకు ఆదరణ బాగా పెరుగుతోంది. 
కనోయింగ్‌లో సాధారణంగా స్ప్రింట్, మారథాన్, స్లాలోమ్, వైల్డ్‌వాటర్ రేసింగ్, కనోపోలో అనే విభాగాలుంటాయి. ఈ విభాగాల్లో సింగిల్, పెయిర్, ఫోర్స్ ఈవెంట్లు నిర్వహిస్తారు. స్ప్రింట్ పోటీలు 500 మీటర్ల దూరం నుంచీ 10,000 మీటర్ల దూరం వరకూ జరుగుతాయి. అదే మారథాన్‌లో అయితే 16 నుంచి 100 కి.మీ. దూరం వరకూ కొనసాగుతాయి.

చిన్న అలలు, హెచ్చుతగ్గులుగా పారుతున్న నీటిలో స్లాలోమ్ పోటీలను నిర్వహిస్తారు. వీటిలో పాల్గొనే వారు నీటిలో పాతిన స్తంభాలతో ఉన్న గేట్‌లను నిర్దేశిత మార్గంలో దాటడంలో పోటీ పడాల్సి ఉంటుంది. గేట్‌ల రంగును బట్టి అర్థం ఉంటుంది. ఆ కోడ్‌ను అర్థం చేసుకుంటూ ముందుకు దూసుకుపోవడంలో పోటీ పడడమే లక్ష్యంగా ఆట సాగుతుంది. 
ఇక కయాక్‌ను చేతులతో కంట్రోల్ చేస్తూనే బంతిని నీటిలో ఉన్న పోస్టులోకి గోల్ చేయడమే లక్ష్యంగా సాగేది కనో పోలో. ఇది సాధారణంగా స్విమ్మింగ్ పూల్స్‌లోనే జరుగుతుంది. 
అత్యంత వేగంగా ఉవ్వెత్తున ఎగిసిపడే నీటిలో నిర్దేశిత మార్గంలో సాగుతూ, లక్ష్యాన్ని చేరుకోవడంలో పోటీ పడేదే వైల్డ్ వాటర్ రేసింగ్. సర్ఫింగ్‌లా కనిపించే దీనిని నీటి ప్రవాహాలు లేని ప్రదేశాల్లో కృత్రిమంగా సృష్టించి అందులో ఆడుతారు.

రోయింగ్
సింగిల్ లేదా డబుల్స్ కూర్చునేందుకు సరిపోయే సైజులో ఉన్న బోట్లను నడిపించడంలో పోటీ పడేదే రోయింగ్ ఆట.image పొడవాటి తెడ్డుతో పడవను నడిపించే దాన్ని రోయింగ్ అనీ, కొద్దిగా చిన్నగా ఉండే రెండు తెడ్లతో పడవను నడిపించే కేటగిరీని స్కల్లింగ్ అనీ అంటారు. రోయింగ్ పడవలో తెడ్లతో సహా అన్ని పార్టులు పడవకు బిగించి ఉంటాయి. కానీ, క్రీడాకారుడి సీటు మాత్రం పడవ యాక్సిస్ ఆధారంగా తిరిగేందుకు వీలుగా అమర్చి ఉంటుంది. ఈ రోయింగ్ పోటీలనే బోట్ రేస్ లేదా రెగుట్టా అని కూడా అంటారు. ఆటలో స్వీప్, స్కల్ అనే రెండు రకాల ఈవెంట్లుంటాయి. స్వీప్ రోయింగ్‌లో క్రీడాకారుడు రెండు చేతులతో ఒకే తెడ్డును ఆపరేట్ చేస్తే, స్కల్లింగ్‌లో రెండు చేతులతో రెండు తెడ్లను ఆపరేట్ చేస్తారు. ఆటగాళ్ల బరువును బట్టి కూడా ఈవెంట్లుంటాయి. క్రీడాకారుల సగటు బరువు 70 కేజీల కన్నా తక్కువుంటే లైట్ రెగెట్టా అనీ, ఎక్కువుంటే హెవీ రెగెట్టా రేస్‌లనీ అంటారు. 

సెయిలింగ్
నీటి ప్రయాణంలో పోడీ పడేదే సెయిలింగ్. సెయిలింగ్ అంటే సముద్రయానమని అర్థం. ఈ ఆటకు ఉపయోగించే చిన్న పడవను డింగీ అంటారు. దీని సెంటర్ బోర్డును ప్రత్యేకంగా.. అంటే పడవ పక్కలకు ఒరిగిపోకుండా, జారిపోకుండా బ్యాలెన్సింగ్‌గా ఉంచే విధంగా నిర్మిస్తారు. ఈ డింగీలలో ఉండే రకాలను ‘క్లాస్’ అంటారు. పడవలో ఒక స్తంభం ఆధారంగా చేసుకుని ఒకటి లేదా రెండు తెరచాపలు కడతారు. గాలి వాలును బట్టి ఇది నడుస్తుంది. తెరచాపకు ఆధారమైన స్తంభానికి ఉండే వైర్‌ల ద్వారా వాటిని నియంత్రిస్తారు. గాలి వేగాన్ని అనుకూలంగా వినియోగించుకుంటూ డింగీని నడిపిస్తూ ముందుకు సాగడంలోనే క్రీడాకారుడి ప్రతిభ వ్యక్తమవుతుంది. చిన్నపడవ (డింగీ)లతో యానం చేయడంలో పోటీ పడే వీటిని డింగీరేస్‌లు అని కూడా అంటారు. 

యాటింగ్
imageనీటిలో సగం, బయటకు సగభాగం ఉంటూ నీటి వేగానికి, గాలి వేగానికి మధ్య గల తేడా ఆధారంగా పయనించే పడవను ‘యాట్’ అంటారు. దీనితో జరిగే పోటీలను యాటింగ్ అంటున్నాం. నీటిలో పయనించడానికి ఉపయోగించే పడవల సైజు, నిర్మాణాల్లో ఉన్న తేడాలను బట్టి పడవ, ఓడ ఉన్నట్లే.. డింగీ, యాచ్ వంటివీ ఉన్నాయి. వీటిని ఉపయోగించే తీరును బట్టే కనోయ్, కయాక్‌లు కూడా ఉన్నాయని పైన చెప్పుకున్నాం. ఆటల పోటీల్లో ఏ రకమైన పడవను, ఎట్లా ఉపయోగిస్తున్నారనే దాన్ని బట్టే ఆటకు ఆ పేరు పెడుతున్నారు. 
ఉదాహరణకు...
1. చిన్న పడవ (డింగీ)తో జరిగే పోటీలు డింగీ రేస్‌లు
2. దీనికన్నా కొంచెం పెద్ద పడవతో పడే పోటీలు యాటింగ్ లేదా యాట్ రేసు
3. రెండు వైపులా తెడ్డుతో నడిపించే చిన్న పడవతో పోటీ పడేది కనోయింగ్
4. ఒకే వైపు తెడ్డు వేస్తూ నడిపించే చిన్న పడవ పోటీ కయాకింగ్ 
ఇట్లా.. దాదాపు పడవల్లో ఉండే 100కు పైగా రకాల పడవలతో పోటీలు జరుగుతున్నాయి. వీటిని ఆ పడవ పేరుతోనే పోటీలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో ప్రతి ఏటా డింగీ, రెగెట్టా పోటీలు జరుగుతున్నాయి. ఏ పోటీలో అయినా సాధారణంగా నిర్దేశిత మార్గంలో, నిర్దేశిత గమ్యాన్ని ముందుకు చేరుకోవడంలో పోటీపడడమే లక్ష్యంగా ఉంటుంది.

- నేలంటి మదనయ్య

English Title
Games with water
Related News