నీ.. స్నేహం !

Updated By ManamSun, 08/05/2018 - 03:17
friends
  • ‘మన’లాంటి వాళ్లతోనే బంధం

  • స్నేహాన్ని ప్రేరేపించే ‘కెమిస్ట్రీ’.. సులువుగా కలిసిపోయే తత్వం

  • శత్రువు శత్రువుతో మరింత దగ్గర.. మనసు మాట విని తీరాల్సిందే

  • మెదడు మాట కూడా కావాల్సిందే.. స్నేహబంధం వెనుకా ఉందో సైన్స్

‘స్నేహ బంధమూ.. ఎంత మధురమూ’.. ‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’ ‘స్నేహాని కన్న మిన్న.. లోకాన లేదురా’.. లాంటి వాటి దగ్గర నుంచి ‘ట్రెండు మారినా.. ఫ్రెండు మారడూ’ వరకు టాలీవుడ్ సినిమాలన్నీ స్నేహం చుట్టూనే తిరుగుతున్నాయి. మరి మీ స్నేహం ఎవరితో బాగుంటుంది? అసలు మీకున్న మంచి స్నేహితులు ఎవరు.. వాళ్లు ఎలా ఫ్రెండయ్యారు.. ఇవన్నీ చూస్తే స్నేహం వెనక కూడా ఓ సైన్సుందని తెలుస్తుంది. నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా.. ఇదేంటో చూద్దాం. ఒకే రంగంలో పనిచేసేవాళ్లు.. చిన్నతనంలో కలిసి చదువుకున్న వాళ్లు.. ఒకే ప్రాంతంలో నివసించేవాళ్లు.. ఇలా రకరకాల వ్యక్తుల మధ్య స్నేహం సులభంగా చిగురిస్తుంది. మీకున్న పది మంది స్నేహితుల పేర్లు చెప్పమంటే వెంటనే టకటకా వచ్చేస్తాయి. కానీ వాళ్లే కాదు.. ఒకోసారి శత్రువుల శత్రువులు కూడా మనకు మంచి స్నేహితులుగా మారిపోతారు. రోజూ మనకు కొన్ని వందల మందితో మాటలు కలుస్తున్నా, వాళ్లలో అతి కొద్ది మందిని మాత్రమే స్నేహితులుగా అంగీకరించగలం. అందుకు ప్రధాన కారణం.. మెదడులో స్నేహాన్ని ప్రేరేపించే కేంద్రం! అవును.. మనసు చెబితేనే స్నేహం కుదురుతుందని మనం అనుకుంటాం కదూ, కానీ నిజానికి మెదడు చెబితేనే స్నేహం విషయంలో కూడా అడుగు ముందుకు పడుతుందట. చూడ్డానికి కొంతవరకు మనలాగే ఉండేవాళ్లు, దాదాపుగా మనలాంటి ఆలోచనలే కలిగి ఉండేవాళ్లతో పాటు.. మనకంటే కాస్త ఎక్కువ కష్టాల్లో ఉండేవాళ్లు కూడా మనకు స్నేహితులయ్యే అవకాశం ఉంటుందట.

image


గోదావరి ప్రాంతానికి చెందిన రాఘవ, కృష్ణా జిల్లాకు చెందిన చంద్రారెడ్డి ఒకే రోజు ఒకే సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్లారు. దానికి కొద్ది రోజుల ముందే చంద్రారెడ్డి తండ్రి చనిపోయారు. ఇంటర్వ్యూ సందర్భంగా కలిసినప్పుడు తనకంటే ఒడ్డు, పొడుగు ఎక్కువున్న చంద్రారెడ్డి చిన్నపిల్లాడిలా కళ్లనీళ్లు పెట్టుకుంటూ చెబితే రాఘవ మనసు కదిలింది. ఏమీ పర్వాలేదు.. మీకు తప్పనిసరిగా ఈ ఉద్యోగం వస్తుందని ఊరికే ధైర్యం చెప్పాడు. అనుకోకుండా ఇద్దరికీ అదే సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఆ రోజు తనకు ధైర్యం చెప్పి అండగా నిలబడ్డాడన్న కృతజ్ఞతతో చంద్రారెడ్డి.. తనతోనే కష్టం పంచుకోగలిగాడంటే తామిద్దరి మధ్య ఏదో బంధం ఉందన్న ఆలోచనతో రాఘవ ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు. దాదాపు పాతికేళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన ఇది.

ఇలా.. మనలాగే ఆలోచించే వ్యక్తులతో చాలా తక్కువ సమయంలో స్నేహం కుదురుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అది ఎలా గుర్తుపట్టగలం అంటే.. అవతలివాళ్లను చూసినపుడు వాళ్ల హావభావాలు, ప్రవర్తనకు అనుగుణంగా మెదడులో కొన్ని రసాయనాలు స్రవిస్తాయని, అవి వాళ్లతో స్నేహం చేయాల్సిందిగా ప్రేరేపిస్తాయని మిషిగన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు వివరించారు. వాళ్లతో గడుపుతుంటే.. అచ్చం మనతో మనం ఉన్నట్లే ఉంటుందని, అందుకే త్వరగా స్నేహం కుదురుతుందని చెప్పారు. ఇందులో మరో విచిత్రమైన విషయం కూడా ఉంది. పాతకాలంలో చెప్పినట్లుగా ‘శత్రువు శత్రువు మిత్రుడే’ అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరీ నిజమని నిగ్గుతేల్చారు. మనకు ఎవరైనా ఒకరు బద్ధ శత్రువు ఉండి, వాళ్లకు మరో శత్రువు ఉంటే వాళ్లు మనకు వెంటనే మిత్రులు అయిపోతారట. ఈ విషయం కూడా యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌కు చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలలో మరోసారి రుజువైంది. రాజకీయాల నుంచి నిత్య జీవితం వరకు అన్నింటిలోనూ ఇది నూటికి నూరుశాతం నిజమని స్పష్టం చేస్తున్నారు. సొంత మనుషులను ప్రేమిస్తూ, వేరేవాళ్లను ఎందుకు ద్వేషిస్తామన్న అంశంపై యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా పరిశోధ నలు చేసినపుడు ఇదే విషయం తేలింది. వేరే దేశాలకు చెందినవాళ్లను ద్వేషించే తీరును ‘జెనోఫోబియా’ అంటారు. అదే సమయంలో ఆ దేశాన్ని ద్వేషించే మరో దేశానికి చెందినవాళ్లను మాత్రం అక్కున చేర్చుకుంటామని.. అదే స్నేహానికి కొత్తగా వస్తున్న నిర్వచనమని వివరిస్తున్నారు.
 
చాలా సున్నితం బాస్..
స్నేహం చాలా సున్నితంగా ఉంటుందని కొన్ని వందలమంది మీద పరిశోధనలు చేసిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఏడాదికి రెండుసార్లు, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ప్రతి 7.2 నెలలకు ఒకసారి తమ చుట్టూ ఉన్నవారిలో ఎవరో ఒకరితో గాఢమైన స్నేహబంధం ఏర్పడుతుందట. అదే సమయంలో కొంతమంది ప్రవర్తన వల్ల మనసు తీవ్రంగా గాయపడుతుందని, అలా జరిగినప్పుడు 40% మందికి ఆ గాయం త్వరగా మానదని చెప్పారు. అవతలి వాళ్లు తమ ప్రవర్తన పట్ల క్షమాపణలు చెప్పినా కూడా మళ్లీ వాళ్లతో కలవడానికి మనసు ఒప్పుకోదని, అందుకే స్నేహబంధం విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు. ప్రేమలో భాగస్వాములు సారీ చెప్పినా వెంటనే కలిసిపోతారు గానీ, స్నేహంలో మాత్రం ఒక్కసారి తేడా వస్తే ఇక వాళ్లను జీవితాంతం క్షమించే పరిస్థితి ఉండబోదని, అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని వివరించారు. 

వయసు చూడని స్నేహం
మనకు తెలిసినంతవరకు సమవయస్కులు మాత్రమే స్నేహితులు అవుతారు. కానీ, కొన్ని కొన్ని సంద ర్భాలలో మాత్రం మనకంటే చాలా పెద్ద వయసు, చిన్నవయసులో ఉన్నవారితో కూడా స్నేహం ఏర్పడుతుంది. మీరు.. మీరు అని సంబోధించుకుంటూనే అవతలి వారిపట్ల స్నేహభావంతో ఉంటాం. ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. అభిరుచులు ఒకేలా ఉన్నప్పుడు వయసులో ఎంత తేడా ఉందన్నదాంతో సంబంధం లేకుండానే ఇద్దరి మధ్య స్నేహబంధం చిగురిస్తుంది. చెన్నై నగరంలో ఉండే మంగళా కందూర్ వయసు 82 ఏళ్లు. కానీ ఆమె ఫేస్‌బుక్ స్నేహితుల జాబితాలో చూస్తే 20 ఏళ్ల వారి నుంచి రకరకాల ఏజ్‌గ్రూపుల వాళ్లుంటారు. వాళ్లందరితో ఆమె ఫోన్‌లో కూడా తరచు టచ్‌లో ఉంటారు. ఎప్పుడో.. ఏదైనా సందర్భంలో ఆమెకు ఉండే స్నేహితుల మధ్య చిన్న మాట కలిసినా కూడా.. వాళ్లంతా మంగళను తమ ఫ్రెండుగానే చెప్పుకొంటారు తప్ప పొరపాటున కూడా బామ్మగారు అనరు. అలా స్నేహం వయసు కూడా చూడదని రుజువవుతోంది.

English Title
friendship!
Related News