అఫ్ఘానిస్థాన్‌కు తొలి ‘పరీక్ష’

Updated By ManamWed, 06/13/2018 - 22:34
 Cricket
  • బెంగళూరులో నేటి నుంచి టీమిండియాతో ఏకైక మ్యాచ్

imageబెంగళూరు: నిత్యం తుపాకీ గుళ్ల శబ్దాలతో, బాంబుల మోతలతో దద్దరిల్లే ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ చరిత్రలో శక్తివంతమైన అడుతు వేయబోతోంది. కెప్టెన్ అస్గర్ స్టానిక్‌జాయ్ నేతృత్వంలోని అఫ్ఘనిస్థాన్ జట్టు గురువారం టీమిండియాతో ఇక్కడ అరంగేట్ర టెస్టు ఆడబోతోంది. ఈ జట్టులోని ప్రతి సభ్యుడికి ఏదో ఒక లోటు ఉంది. ప్రత్యర్థి టీమిండియా సభ్యులతో పోలిస్తే ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లు దారిద్య్రంతో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే టెస్టు హోదా వచ్చిన రెండు దశాబ్దాలలోపే తమ జట్టు అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని స్టానిక్‌జాయ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ఎట్టకేలకు మా టెస్టు ప్రయాణం మొదలైంది. టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టుతో తొలి మ్యాచ్ ఆడుతున్నందుకు గర్వంగా ఉంది. లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తాం. వ్యక్తగతంగా, సమష్టిగా మా ప్రతిభను ప్రదర్శిస్తాం’ అని స్టానిక్‌జాయ్ అన్నాడు. స్టానిక్‌జాయ్ 2009 నుంచి అఫ్ఘనిస్థాన్ జట్టుకు అంతర్జాతీయ వన్డేల్లో ఆడుతున్నాడు. పాకిస్థాన్‌లో తలదాచుకున్న శరణార్థుల నుంచి ఆఫ్ఘనిస్థాన్ జట్టు అభివృద్ధి చెందింది. ఆఫ్ఘనిస్థాన్‌లో 1980, 90 దశకాల్లో జరిగిన అల్లర్ల వల్ల అనేక కుటుంబాలు పాకిస్థాన్‌లో తలదాచుకున్నాయి. అయితే ఇప్పుడు అదే దేశంలో 19 ఏళ్ల రషీద్ ఖాన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత బౌలర్‌ను తయారు చేసింది. ఈ టీనేజర్ మార్చిలో అత్యంత వేగంగా 100 అంతర్జాతీయ వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన అద్భుతమైన బౌలర్‌గా రషీద్ ఖాన్ పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు ప్రమాదకరమైన బౌలర్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో రషీద్ 21 వికెట్లు తీశాడు. అతడిని సన్‌రైజర్స్ యాజమాన్యం 1.4 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది.  ‘నా ఉద్దేశం ప్రకారం టీమిండియా కంటే మా జట్టులో ఉత్తమ స్పిన్నర్లు ఉన్నారు’ అని రషీద్, ముజీబ్ ఉర్ రహమాన్, మహ్మద్ నబీ, రహమత్ షా, జహీర్ ఖాన్‌లను దృష్టిలో పెట్టుకుని స్టానిక్‌జాయ్ అన్నాడు. 

Tags
English Title
First test for Afghanistan
Related News