ఐటీ కంపెనీకి రూ. 2.5 కోట్ల ఫైన్

Updated By ManamFri, 09/14/2018 - 19:50
H 1B employees
  • హెచ్-1బి వీసాదారులకు తక్కువ జీతం

  • 12 మందికి ఆ మొత్తం ఇవ్వాలని ఆదేశం

  • అదికాక.. మరో రూ. 32 లక్షల జరిమానా

  • అమెరికా కార్మిక శాఖ కఠిన ఆదేశాలు

H-1B employees

వాషింగ్టన్, సెప్టెంబరు 14: హెచ్-1బి వీసాల మీద వచ్చిన ఉద్యోగులకు వాళ్లకు ఇవ్వాల్సిన జీతాల కంటే తక్కువ ఇచ్చినందుకు అమెరికాలోని ఓ ఐటీ కంపెనీకి దాదాపు రూ. 2.5 కోట్లకు పైగా వడ్డన పడింది. ఈ మొత్తాన్ని 12 మంది ఉద్యోగులకు ఇవ్వాల్సిందిగా రెడ్‌మండ్ ప్రాంతంలోని సదరు కంపెనీని అమెరికా కార్మిక వేతనాలు, గంటల విభజన విభాగం ఆదేశించింది. దాంతోపాటు కార్మిక శాఖ నిబంధనలను ఉల్లంఘించినందుకు మరో రూ. 32.32 లక్షల జరిమానా విధించింది. పీపుల్ టెక్ గ్రూప్ అనే కంపెనీకి బెంగళూరు, హైదరాబాద్‌లలో కూడా కార్యాలయాలున్నాయి.

      ఈ సంస్థ హెచ్-1బి వీసాల మీద కొంతమందిని అమెరికాకు పిలిపించుకుని, వాళ్లకు ఇవ్వాల్సిన వేతనాల కంటే తక్కువగా ఇస్తున్నట్లు అక్కడి కార్మిక శాఖ గుర్తించింది.ఫలితంగా ఆయా ఉద్యోగులకు పరిహారం ఇప్పించడంతో పాటు కంపెనీకి జరిమానా కూడా విధించింది. తమకంటే చాలా సీనియర్లు చేయాల్సిన పనిని చేస్తున్నా.. హెచ్-1బి వీసాల మీద వచ్చిన కంప్యూటర్ ఎనలిస్టులు, కంప్యూటర్ ప్రోగ్రామర్లకు కేవలం ప్రాథమిక స్థాయి ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు మాత్రమే ఇస్తున్నట్లు గుర్తించారు. తాను పని కల్పించలేనపుడు ఇవ్వాల్సిన వేతనాన్ని కూడా పీపుల్ టెక్ కంపెనీ ఆ ఉద్యోగులకు ఇవ్వలేదని కార్మిక శాఖ తెలిపింది.

    అమెరికాలో ఉద్యోగులకు కొరత ఉన్నప్పుడు ఆ స్థానాల్లో బాగా నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులను ఎక్కువ జీతాలిచ్చి పిలిపించుకోవడమే హెచ్-1బి వీసా ఉద్దేశమని కార్మికశాఖ తాత్కాలిక జిల్లా డైరెక్టర్ కేరీ ఆగిలర్ తెలిపారు. అమెరికన్ ఉద్యోగాలను కాపాడుకోవడం, చట్టాలకు అనుగుణంగా పనిచేసేవారికి అనుమతి ఇవ్వడం తమ ఉద్దేశమని, అలాగే ఏ ఒక్కరూ తమకు చట్టబద్ధంగా దక్కాల్సిన వేతనాల కంటే తక్కువ పొందకూడదని ఆమె చెప్పారు. ఇలా హెచ్-1బి వీసా నిబంధనలను ఉల్లంఘిస్తున్న దాదాపు 30 కంపెనీలను అమెరికా కార్మిక శాఖ గుర్తించింది. 2013 నాటి జాబితా ప్రకారం చూస్తే ఎలా ఎగవేసేవారిలో ఎక్కువ మంది ఎన్నారై కంపెనీ యజమానులే ఉంటున్నారు. 

English Title
fined for paying low wages to H 1B employees
Related News