కత్తి సాముకు కదులుదాం!

Updated By ManamThu, 06/14/2018 - 21:26
fenching practice game, Olympic from Greece 

fenching practice game, Olympic from Greece మన పురాణాల్లోని కత్తి యుద్ధానికి ఆధునిక రూపమే ‘ఫెన్సింగ్’. రాజులు వాడే పొడవాటి ఖడ్గాలను పోలిన సన్నటి తీగల వంటి ఆయుధాలతో పోటీ పడుతూ ఆడే ఆట ఫెన్సింగ్. మానవ సంస్కృతి మొదలైన నాటి నుంచీ ఈ కళ ప్రాక్టీసులో ఉందని చెబుతారు. గ్రీసులో రూపొందిన ఈ క్రీడ చాలా కాలం పాటు ఆ ప్రాంతానికే పరిమితమైంది. ప్రాచీన ఒలింపిక్స్ ప్రారంభమైన 1896లోనే ఇది ఒలింపిక్ క్రీడాంశంగా ఉంది. అప్పటి నుంచీ క్రమంగా ప్రపంచ వ్యాప్తమయింది. దశాబ్దాల నుంచీ ఆడుతున్నా కూడా ఇది మన దేశంలో ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకే పరిమితం. ఇప్పటికీ ఈ రాష్ట్రాలకు చెందిన వారే ఈ క్రీడలో అగ్రగామిగా ఉన్నారు. 

మన రాష్ట్రానికి సంబంధించి ఇది ప్రాథమిక దశలోనే ఉందని భావించాలి. 1996వ సంవత్సరం నుంచీ అధికారికంగా ఫెన్సింగ్ క్రీడా పోటీలను మన రాష్ట్రంలో నిర్వహిస్తున్నా కూడా ఇది బాగా విస్తరించలేదు. హైదరాబాద్ వంటి చోట్ల మాత్రమే ఈ క్రీడా శిక్షణ అందుబాటులో ఉండటం దీనికి కారణం. 

ఎలా ఆడతారంటే..
ఫెన్సింగ్ ఆడే క్రీడాకారులను ‘ఫెన్సర్స్’ అని అంటారు. దీనిని ఇండోర్‌లో ఆడతారు. ఇద్దరు క్రీడాకారులు ఎదురెదురుగా నిల్చొని ఆయుధం (కత్తి)తో ఎదుటి వారి శరీరంలోని భాగాలను తాకాలి. ప్రత్యర్థి క్రీడాకారులు కూడా ఇదే విధంగా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా తమను తాము కాపాడుకుంటూ ప్రత్యర్థులను అటాక్ చేయడమే ఫెన్సింగ్ క్రీడ. ఎదుటి వారి కత్తి మొన తమను తాకకుండా తన కత్తిని అడ్డుపెడుతూ ఎదుటివారి శరీరాన్ని తన కత్తితో తాకాల్సి ఉంటుంది. ఇలా కత్తిని తాకించడం ద్వారా ఫెన్సర్స్ పాయింట్లను పొందుతారు. నిర్దేశిత (9 నిమిషాలు) సమయంలో ఎవరైతే ఎక్కువ పాయింట్లను సాధిస్తారో వారే విజేతలవుతారు.

మూడు రకాలు
కత్తి పరిమాణం, పొడవు, బరువును బట్టి మూడు రకాలైన ఆయుధాలతో ఈ ఆటను ఆడతారు. వాటి ప్రకారమే ఈ ఆటను కూడా మూడు రకాలుగా వర్గీకరించారు. అవి.. 1. ఫాయిల్, 2. ఎపీ, 3. సాబ్రే.

ఫాయిల్: ఈ విభాగంలో ఉపయోగించే కత్తి 110 సెం.మీ పొడవుతో అతి తేలిగ్గా ఉంటుంది. 550 గ్రాముల కన్నా తక్కువ బరువుంటుంది. దీనితో ఎదుటి వారిని తాకాలి. నడుము నుంచీ మెడ వరకూ మాత్రమే అటాక్ చేయాలి. ఇతర భాగాలను తాకితే పాయింట్లు ఇవ్వరు. పైగా పాయింట్లు తగ్గించే ప్రమాదం కూడా ఉంది. తాకే ఫోర్స్‌ను బట్టి పాయింట్లు వస్తాయి. 

ఎపీ: దీనిలో ఉపయోగించే క త్తి బరువు 550 నుంచి 770 గ్రాముల మధ్యన ఉంటుంది. దీని పొడవు దాదాపు 110 సెం.మీ. ఆట అంతా ఫాయిల్ విభాగంలో మాదిరిగానే ఆడతారు. అయితే ఎపీ విభాగంలో కత్తి కేవలం నడుమే కాకుండా శరీరంలోని ఏ భాగాన్నైనా తాకవచ్చు. తాకిన ఫోర్స్‌ను బట్టి పాయింట్లు ఇస్తారు. సాబ్రే: ఈ విభాగంలో నడుము పై భాగం నుంచీ తల వరకూ ఏ భాగాన్నైనా టార్గెట్‌గా చేసుకోవచ్చు. కత్తి 105 సెం.మీ. పొడవు, 500 గ్రాముల బరువుంటుంది. ఫాయిల్, ఎపీలు చివర బటన్ వంటి ముగింపుతో మొండిగా ఉంటాయి. వీటి వలన కేవలం తాకడమే సాధ్యమవుతుంది. అయితే సాబ్రే కొన మాత్రం మొనదేలి ఉంటుంది. క్రీడాకారుల నడుము భాగానికి కట్టిన సన్నని వైర్.. కంప్యూటర్‌కు అనుసంధానమై ఉంటుంది. ఇది కత్తి ఫోర్స్‌ను గణిస్తుంది. దాని ప్రకారం క్రీడాకారులకు పాయింట్లు వస్తాయి.

పద్ధతులు: ప్రస్తుతం కాంపిటీషన్స్‌లో రెండు రకాల పద్ధతుల్లో ఫెన్సింగ్ క్రీడను నిర్వహిస్తున్నారు. ఒకటి రౌండ్ రాబిన్ కాగా రెండవది డైరెక్ట్ ఎలిమినేషన్ పద్ధతి. రౌండ్ రాబిన్ విధానంలో ఫెన్సర్‌లు మొత్తం అయిదు పాయింట్ల కోసం నాలుగు నిమిషాల పాటు ఆడతారు. డైరెక్ట్ ఎలిమినేషన్ పద్ధతిలో ఫెన్సర్‌లు 15 పాయింట్ల కోసం తొమ్మిది నిమిషాలు ఆడతారు.

కోర్టు: ఈ క్రీడా కోర్టు ప్రత్యేకంగా ఉంటుంది. కలపతో గానీ, లోహంతో గానీ అడుగు ఎత్తులో 19 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు సైజులో చేసిన వేదికపైన క్రీడాకారులు పోటీ పడతారు. దీనిని ఫెన్సింగ్ పరిభాషలో ‘బౌట్’ అంటారు. దీని అటు చివర ఒక మీటరు, ఇటు చివర ఒక మీటరు భూమి నుంచి పైకి రావడానికి వీలుగా స్లోప్ ఉంటుంది. ఇది పోను మిగిలిన స్థలంలో క్రీడాకారులు నిల్చొని ఆడాలి. దీనిని ‘పిస్టే’ అంటారు. 

ఆహార్యం: క్రీడాకారులు రక్షణ కోసం మొహానికి మాస్క్‌ను, ఒంటికి జాకెట్‌ను, చెస్ట్ గార్డ్‌ను వేసుకుంటారు. కాళ్లను ఎటైనా కదలడానికి, పైకి లేపడానికి వీలుగా ఉండే ప్యాంట్‌ను ధరిస్తారు. దీనిని బ్రీచెస్ అంటారు. చేతులకు గ్లవ్స్, కాళ్లకు ప్రత్యేకమైన బూట్లు ధరిస్తారు.

వయసును బట్టి కేటగిరీ 
ఇండివిడ్యువల్ పోటీలు కొనసాగే ఈ ఆటలో మహిళలు, పురుషులు వేర్వేరు విభాగాలుగా ఆడతారు. వయస్సును బట్టి వీరిని నాలుగు గ్రూపులుగా విడదీసి పోటీలను నిర్వహిస్తారు. 14 ఏళ్లలోపు వయసున్న క్రీడాకారులను సబ్ జూనియర్‌లుగానూ, 14 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్నవారిని క్యాడెట్స్‌గానూ, 20 ఏళ్లలోపు వారిని జూనియర్స్‌గానూ పరిగణిస్తారు. అదే విధంగా 18 ఏళ్ల పైబడి వయసున్న వారిని సీనియర్ క్రీడాకారులుగా పరిగణిస్తారు. నాలుగు గ్రూపుల్లోనూ ఎపీ, ఫాయిల్, సాబ్రే విభాగాల్లో పోటీలను నిర్వహిస్తారు.

fenching practice game, Olympic from Greece అనుకూలత: ఎత్తు ఎక్కువ ఉన్న వారికి అడ్వాంటేజ్‌గా ఉంటుంది. అలాగని పొట్టి వారు రాణించరని కాదు. నాలుగున్నర అడుగుల ఎత్తున్న వారు కూడా ఫుట్‌వర్క్‌తో కాంపిటెంట్‌గా తయారు కావచ్చు. పోటీ తక్కువ కాబట్టి రెండు సంవత్సరాల్లోనే జాతీయ స్థాయికి ఎదిగే అవకాశాలున్నాయి. 35, 40 ఏళ్ల దాకా ఆడవచ్చు. ప్రస్తుతం తెలంగాణలోని 31 జిల్లాల్లోనూ దీనికి శిక్షణ లభిస్తోంది.

ప్రవేశం: పది పదకొండేళ్ల వయస్సులో పిల్లలు ఈ ఆటను ఎంపిక చే సుకుంటే బావుంటుంది. అయితే 18 ఏళ్లప్పుడు ప్రారంభించినా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఉపయోగముంటుంది. ఏడాది ప్రాక్టీసు చేస్తే పరిణతి వస్తుంది. అక్కడ్నుంచి పోటీల్లో పాల్గొనవచ్చు. 

కత్తి ఎలా ఉంటుందంటే.. 
ఫెన్సింగ్ క్రీడలో ఉపయోగించే సన్నని పొడవాటి కత్తి సాధారణంగా మూడు భాగాలుగా ఉంటుంది. కింది వైపు చేతితో పట్టుకోవడానికి వీలుగా పిడి, దాని పైభాగంలో పట్టుకునే చేతికి రక్షణకు గాను ప్రధాన కత్తిని విడదీస్తూ గుండ్రటి పలకలాంటి అమరిక గార్డ్, దాని పైనుంచి పొడవుగా కత్తి ఉంటుంది. ఎపీ, ఫాయిల్‌లకు గార్డ్ ఒకే మాదిరిగా ఉంటే సాబ్రేకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. దీనికి చేతితో పట్టుకునే పిడి చివరి భాగాలకు కలుపుతూ గార్డ్ ఉంటుంది. 
- నేలంటి మదనయ్య

ఉపయోగాలు 
బాలల్లో పోటీ తత్వాన్ని పెంచే వాటిలో ప్రధానమైన గేమ్ ఫెన్సింగ్. వారి ఎముకల వ్యవస్థకు తగిన ఎక్సర్‌సైజ్‌నందిస్తుంది. కంటి చూపు మెరుగుపడడానికి బాగా ఉపకరిస్తుంది. చెస్ వంటి వ్యూహాత్మక ఆట అయినందున ఇది బాలల ఐక్యూ పెంచుతుంది. చెస్ వ్యూహాన్ని, మెదడుకు పదును కలిగిస్తుంది. అంతే కాదు ‘సిచ్యుయేషనల్ రెస్పాన్స్’ను పెంచుతుంది. స్పందనా గుణాన్ని తేజోవంతం చేస్తుంది. కండరాలు, దేహ కదలికలను వేగవంతం చేసి చలనశీలతను గుణాత్మకంగా మెరుగుపరుస్తుంది. ఈ విధంగా ఇది పలు లక్షణాలను పెంచడం ద్వారా నైపుణ్యాల ‘ఎఫీషియెన్సీ’ని పెంచే ఆటగా బాగా ఆదరణ పొందుతోంది.

English Title
Fenching practice game more populared after Olympic from Greece 
Related News