భయపడం 

Updated By ManamThu, 07/12/2018 - 07:05
 Ministers
  • పంచాయతీ రిజర్వేషన్ల సాధనపై మంత్రి వర్గ ఉప సంఘం భేటీలో మంత్రులు

  • తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తం

  • భయపడ్డ వారే కేసులేసిండ్రు.. ఆగస్టు తర్వాత ‘ఆఫీసర్’ పాలన?

  • తమిళనాడులో సాధ్యమైనది ఇక్కడా సాధ్యమే

  • తక్కువ కాలంలో ఎక్కువ ఎన్నికలను ఎదుర్కొన్నది టీఆర్‌ఎస్ పార్టీయే

 Ministersహైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో 34 శాతం బీసీల రిజర్వేషన్లను సాధించి తీరుతమని, తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి వర్గ ఉప సం ఘం తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీల రిజర్వే షన్లను 34 శాతానికి తగ్గకుండా చూడాలని తీర్మానించినట్టు మంత్రులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 50 శాతం కన్నా రిజర్వేషన్లు మించొద్దని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పంచాయతీ రాజ్, గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి జూపల్లి  కృష్ణారావు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం భేటీ అయిన మంత్రి వర్గ ఉప సంఘం కూలం కుశంగా చర్చించింది. ఈ సమావేశానికి సబ్ కమిటీ సభ్యులైన మం త్రులు ఈటల రాజేందర్, కేటిఆర్, తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ప్రత్యే కంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న హాజరయ్యారు. మంత్రుల తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావు, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావు పాల్గొన్నారు.

రిజర్వేషన్లపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు... బీసీ గణన, పంచాయతీల పాలక వర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం చర్చించింది. సబ్ కమిటీ చైర్మన్ జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ... సకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు తమ శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామని... అయితే రిజర్వేషన్లు, బీసీ గణన అంశాలపై కొందరు కోర్టును ఆశ్రయించడం, దీనిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వివరించారు. అలాగే ఈ నెలాఖరుతో పాలకవర్గాల పదవీకాలం ముగి యనున్న నేపథ్యంలో...ఈ లోపు ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై కూడా మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది.

అనంతరం జూపల్లి కృష్ణారావు, మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వ ర్రావు, జోగు రామన్నలు మీడియాతో మాట్లా డారు. గత పంచాయతీ ఎన్నికల సందర్భంగా 61 శాతం రిజర్వేషన్లను కల్పించుకునే వెసులు బాటు సుప్రీంకోర్టు ఇచ్చిందని... ఈ సారి కూడా అదే వెసులుబాటు సాధించి తీరుతామన్నారు. ఇప్పటికే పంచాయితీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం, స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అయితే కొంతమంది పంచాయతీ ఎన్నికలపై కేసులు వేయడం వల్ల చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలంటే భయపడేవారే కోర్టులో కేసులు వేశారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుతం బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ తగ్గకుండా చూడటానికి సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. జూలై 31 తో సర్పంచ్ ల పదవీకాలం ముగుస్తుందని...ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించాలా లేక పాలకవర్గం పదవీకాలం పొడిగించాలా అన్నదానిపై కేబినెట్లో చర్చించి, సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వమే ఇదంతా చేస్తోందని కొంతమంది విమర్శిస్తున్నారని, కానీ పరిపాలన ప్రజలక చేరువ చేయాలనే ఉద్దేశంతోనే తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామన్నారు. తమిళ నాడులో బీసీలకు 64 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు తెలంగాణలోనూ అదే విధంగా 34 శాతానికి అనుమతించాలని కోరుతామని తెలిపారు.

గత ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రకారమే ఈ సారీ ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉద్యోగాలు కేవలం విద్య ఉద్యోగాల్లో మాత్రమే ఉన్నాయన్నారు. ఇతర దేశాల్లో రాజ్యాంగబద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు  మాత్రమే రిజర్వేషన్ పద్దతి ఉందన్నారు. 54 శాతం సీలింగ్ చేసి చట్ట సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతామని తె లిపారు. అతి త క్కువ కాలంలో ఎక్కువ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ గుర్తు చేశారు. గెలుపు ఆశలు సన్నగిల్లిన వారు భయపడతారని, టీఆర్‌ఎస్ పార్టీ దేనికీ భయపడదని హెచ్చరించారు. రిజర్వేషన్ అంశంపై రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని, దీనిపై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని సబ్ కమిటీ నిర్ణయించినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

Tags
English Title
Fear




Related News