పంద్రాగస్టు నుంచి రైతుబీమా

Updated By ManamTue, 06/19/2018 - 02:07
pocharam
  • 18 నుంచి 60 ఏళ్ల లోపు రైతులంతా అర్హులు.. నెలఖారులోగా పూర్తి చేసిన దరఖాస్తులు పంపాలి

  • తెలంగాణలో రైతులంతా ధనిక రైతులుగా ఎదగాలి

  • పెట్టుబడి చెక్కులందుకున్న అందరినీ పథకంలో చేర్చాలి

  • ఆ బాధ్యతంతా వ్యవసాయ విస్తరణాధికారులదే.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి

pocharamకరీంనగర్: పంద్రాగస్టు నుంచి రాష్ట్రంలో రైతు బీమా పథకం అమలులోకి వస్తుందని, ఈ నెలాఖరులో రైతులు నామినేషన్ ఫారాలు ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా వ్యవసాయాధికారులు, రైతు సమన్వయసమితి సభ్యులుకు రైతు బీమా పథకంపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పోచారంతో పాటు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ రైతు బిడ్డలే అన్నారు. స్వయంగా రైతు కావడం వల్లే సీఎం కేసీఆర్‌కు రైతు సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. అందుకే అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. ఎకరానికి 8 వేలు చొప్పున రైతు బంధు పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు పెట్టుబడి అందిస్తోందని చెప్పారు. అందులో భాగంగా రైతు బంధు జీవిత భీమా పథకాన్ని ఆగస్టు15 నుండి అమల్లోకి తీసుకువస్తున్నామన్నారు. రైతు ఆకస్మికంగా లేదా సాధారణ మరణం పొందినా రూ.5లక్షలు ఈ బీమా కింద అందుతుందున్నారు. పథకంలో చేరేందుకు అవసరమయ్యే ప్రీమియం రూ. 2,271ను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రైతు చనిపోయిన 15 రోజులలోపు రైతు నామినేషన్ ఫారంలో సూచించిన వ్యక్తికి డబ్బు అందుతుందన్నారు. రైతు బంధు జీవిత  బీమా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 కోట్ల మేరకు ఖర్చు చేస్తుందన్నారు. రైతు మరణించినట్లు గ్రామ రెవెన్యూ అధికారి దృవీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుందన్నారు. ఒక వేళ 10రోజుల్లోగా మరణించిన రైతు కుటుంబానికి జీవిత బీమా చెక్కు అందకపోతే, ఎవరి వల్ల ఆలస్యం జరిగిందో వారికి రోజుకు రూ.1000 చొప్పెన జరిమాన విధిస్తామన్నారు.  వ్యవసాయ విస్తరణ అధికారులు ఇంటింటికీ వెళ్లి రైతు నామిని పేరు, రైతు సంతకం తీసుకుని కలెక్టర్ల ద్వారా బీమా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. 18 నుండి 60 సంవత్సరాల లోపు రైతులందరూ.. పథకానికి అర్హులని చెప్పారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులందరినీ బీమా పథకంలో చేర్చాల్సిన బాధ్యత వ్యవసాయ విస్తరణ అధికారులదేనని పోచారం పేర్కొన్నారు. రైతులందరూ సకాంలో పంటలు వేసుకోవాలని సూచించారు. తెలంగాణలో రైతులందరూ ధనిక రైతులుగా అభివృద్ది చెందాలన్నారు.

రైతులకు అండగా సర్కారు: జోగు 
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లోని మార్కెట్ యార్డులో సోమవారం రైతుబంధు జీవిత బీమా పథకంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, రైతు సమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుబీమా పథకంపై మంత్రులు వ్యవసాయాధికారులకు, రైతు సమన్వయ సమితి సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ రైతు బీమా పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉండేందుకు మరో బాధ్యతను భుజానికి ఎత్తుకుందన్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ రైతు రాజ్యస్థాపనకు సీఎం కేసీఆర్ ఆహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు.

రైతు సంక్షేమానికి పెద్ద పీట: ఈటల
తెలంగాణ ప్రభుత్వం  రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రూ.17వేల కోట్ల రైతు రుణాలను ప్రభుత్వం నాలుగు విడతల్లో మాఫీ చేసిందని ఈటల పేర్కొన్నారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నీళ్లు అందించే జలహరం అన్నారు. రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టిందన్నారు. 57 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతు బంధు చెక్కులను అందించామన్నారు. ఇందులో రూ.4,700 కోట్లును రైతులు బ్యాంకుల నుండి తీసుకున్నారని తెలిపారు. ఆగస్టు 15 నుండి రైతు బీమా పథకం అమలులోకి వస్తుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కరీంనగర్‌లోని చారిత్రాత్మక పాఠశాల కూల్చివేతను ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం సిగ్గుచేటన్నారు. కరీంనగర్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా ప్రభుత్వం పాఠశాల ఆవరణంలో పార్కును ఏర్పాటు చేస్తున్నామన్నారు.  రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈఈవోలు రైతు సమన్వయ సమితి సభ్యుల సహకారంతో రైతుల నామిని, పేరు సంతకంతో ఫారాలను పూరించి ఈ నెలఖారులోగా పంపించాలని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్  తుల ఉమ, ఎంపీ వినోద్‌కుమార్, కరీంనగర్ ఇన్‌చార్జి కలెక్టర్‌కృష్ణబాస్కర్, పెద్దపల్లి కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బొడిగె శోభ, వొడితెల సతీష్ బాబు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సోమారపు సత్యనారాయణ. పుట్ట మధు స్థానిక నేతలు పాల్గొన్నారు.
 

Tags
English Title
Farmerbeam from pandragasta
Related News