ఎఫ్‌బీలో ఫేక్ న్యూస్‌కు ఫుల్‌స్టాప్..

Updated By ManamThu, 07/19/2018 - 19:49
Facebook will prioritize removing fake news that incites violence

Facebook will prioritize removing fake news that incites violence

  • రెచ్చగొట్టే వార్తలపై నిషేధం

  • 24 గంటల్లోనే మారిన నిర్ణయం

  • విమర్శలకు జడిసిన జుకెర్‌బర్గ్

న్యూయార్క్: ఫేస్‌బుక్‌లో అబద్ధపు వార్తలను, యూజర్లను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని తొలగించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. సంస్థ ఫ్లాట్‌ఫాంపై వీటికి చోటులేకుండా చూస్తామని పేర్కొంది. తప్పుడు వార్తలు, వదంతుల ప్రచారంతో ప్రజలు భయాందోళనకు లోనై, మూకుమ్మడిగా దాడులకు పాల్పడుతున్న ఘటనల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. దేశవ్యాప్తం గా పలుచోట్ల జరిగిన ఈ దాడులలో పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సోషల్ మీడియానే కారణమని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రముఖ సామాజిక మాధ్యమాలలో వదంతుల ప్రచారాన్ని కట్టడి చేయాలన్న డిమాండ్‌లు పెరిగాయి. భారత ప్రభుత్వం కూడా ఫేస్‌బుక్ గ్రూపునకు చెందిన వాట్సప్‌నకు గతంలోనే ఓ లేఖ రాసింది. 

అయితే.. సోషల్‌మీడియాలో పెట్టే పోస్టులు ఆయా వ్యక్తుల అభిప్రాయాలని.. దాడుల పేరుతో వాటిని తొలగించడం తీవ్రమైన చర్యే అవుతుందని ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఫేక్‌న్యూస్ అనే సందేహం వచ్చినపుడు సదరు వార్తల తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. అంతేకానీ మొత్తంగా పోస్ట్‌ను తొలగించడమంటే ఖాతాదారుల అభిప్రాయాలను అగౌరవ పరచడమేనని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

జుకర్‌బర్గ్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే మొదలైన ట్రోలింగ్ తాజాగా మరో ప్రకటన విడుదల చేసే వరకూ ఆగలేదు. సర్వత్రా వెల్లివెత్తుతున్న విమర్శల నేపథ్యంలో ఫేస్‌బుక్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఎఫ్‌బీలో తప్పుడు, హింసను ప్రేరేపించే వార్తల ప్రచారంపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. కల్లోలాన్ని ప్రోత్సహించే వార్తలపై నిషేధంతో పాటు ఇంటర్నెట్‌లోని వివిధ ఫొటోలను మార్ప్ చేసి పోస్ట్ చేయడాన్నీ అడ్డుకోనున్నట్లు వివరించింది. మరోవైపు తన అనుబంధ సంస్థ వాట్సప్‌లో వదంతులు, పుకార్ల వ్యాప్తిని అడ్డుకోవడానికి మెరుగైన చర్యలు తీసుకుంటున్న విషయాన్నీ ఆయన గుర్తుచేశారు.

English Title
Facebook will prioritize removing fake news that incites violence
Related News