పంద్రాగస్టు నుంచి కంటి వెలుగు

Updated By ManamSun, 07/22/2018 - 01:08
kcr
  • రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకే రోజు.. కండ్లద్దాలు, మందులు కూడా ఇవ్వాలి

  • నిర్వహణ కోసం 799 బృందాలు.. ప్రగతిభవన్‌లో సమీక్షించిన కే సీఆర్

KCRహైదరాబాద్: రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమం పంద్రాగస్టు నుంచి ప్రారంభమవుతుంది. రాష్ట్రం లోని ప్రతీ ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వ హించాలని, అవసరమైన వారికి కండ్లద్దాలు, మం దులు అందివ్వాలని, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా నిర్వహించాలని సీఎం అధికా రులను ఆదేశించారు. ఆగస్టు 15న రాష్ట్రమంతా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని ఆయ న ఆదేశించారు. గజ్వేల్ నియోజకవర్గంలో తానే స్వ యంగా కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పా టు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కూడా ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరనున్నట్లు వెల్లడించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు.  ఈ కార్యక్రమానికి అవసరమైన సిబ్బందిని, వైద్య పరికరాలను, వాహనాలను, కళ్లద్దాలను, మందులను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమంపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఆరోగ్య శ్రీ సీఈఓ మాణిక్ రాజ్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, జాయింట్ డైరెక్టర్ మోతీలాల్, టీఎస్‌ఎండీసీ ఎండీ వేణుగోపాల్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రాష్ట్రంలోని దాదాపు 3.70 కోట్ల మంది పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇంత పెద్ద కార్యక్రమం గతంలో ఎవరూ ఎప్పుడూ చేయలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నందున అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అందరు ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేయాలని, జిల్లా కలెక్టర్లు ప్రజా ప్రతినిధులందరితో సమావేశాలు నిర్వహించి, జిల్లా స్థాయిలో షెడ్యూల్ ను తయారు చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో కార్యక్రమ నిర్వహణపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అందరూ కంటి వైద్య శిబిరాలకు వచ్చేలా ఏర్పాట్లు చేయాన్నారు. కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు నిర్వహణ కోసం 799 బృందాలను ఏర్పాటు చేశామని, ప్రతీ బృందంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఆప్టోమెట్రిస్ట్, ఎఎన్‌ఎం తదితరులు ఉంటారని తెలిపారు. ఒక్కో వైద్య బృందం రోజుకు సగటున 250 మందికి పరీక్షలు నిర్వహిస్తుందని, ఐ డ్రాప్స్, మందులు సిద్ధం చేసుకున్నామని, 34 లక్షల కంటి అద్దాలు సిద్ధం చేసి జిల్లాలకు పంపుతున్నామని, అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్తంగా 114 కంటి ఆసుపత్రులను గుర్తించినట్లు అధికారులు వివరించారు. 
ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సూచనలు..

  • వర్షం వచ్చినా సరే కంటి పరీక్షలు నిరాటంకంగా నిర్వహించేందుకు వీలుగా గ్రామ స్థాయిలో పాఠశాల భవవాన్ని కానీ, మరేదైనా పక్కా భవనాన్ని కాని ఎంపిక చేసుకోవాలి.
  • కంటి పరీక్షల కోసం నియమించే సిబ్బంది వల్ల సాధారణ వైద్య సేవలకు ఆటంకం కలుగకూడదు. కంటి పరీక్షల శిబిరంలో పనిచేయడానికి ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యుల సేవలను తాత్కాలిక పద్ధతిలో వినియోగించుకోవాలి. వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారిని వినియోగించవద్దు. 
  • ఏ రోజు ఏ గ్రామంలో పరీక్షలు నిర్వహిస్తున్నారనే విషయం ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలి. కంటి పరీక్షలపై అవగాహన కల్పించాలి. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్ల సేవలు వినియోగించుకోవాలి. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి.
  • కంటి పరీక్షల నిర్వహణలో భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ప్రజా ప్రతినిధులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లేఖలు రాయాలి.
  • వైద్య శిబిరాల్లో పాల్గొనే సిబ్బందికి వారానికో రెండు రోజులు ఖచ్చితంగా సెలవులు ఇవ్వాలి. వారు వచ్చిపోవడానికి ప్రభుత్వ ఖర్చుతో వాహనాలు ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో సరైన వసతి ఉండే అవకాశం ఉండదు కాబట్టి సమీప పట్టణాల్లో వసతి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ అతిధి గృహాలతో పాటు సింగరేణి, విద్యుత్ సంస్థల అతిథి గృహాలను వాడుకోవాలి. ప్రైవేటు హోటళ్లలో కూడా బస ఏర్పాటు చేయాలి. పేదలకు వైద్య సేవలు అందించే వైద్య సిబ్బంది భోజన, వసతి ఏర్పాట్లు బాగుండాలి.
  • దగ్గరి చూపు లోపం ఉన్న వారికి వెంటనే మందులు, అద్దాలు(రీడింగ్) అందించాలి. ఇతరులకు డాక్టర్లు సూచించిన అద్దాలు పంపిణీ చేయాలి. ఆపరేషన్లు అవసరమైన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో దశల వారీగా ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా ఆపరేషన్లు చేయించాలి. 

సరోజినీ కంటి ఆసుపత్రికి కొత్త భవనం: కేసీఆర్
హైదరాబాద్‌లోని సరోజినీ కంటి ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించడంతో పాటు అన్ని రకాల ఆధునిక వసతులు కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు.

బస్తీ దవాఖానాల సంఖ్య పెంచాలి.
నగరంలో నిర్వహిస్తున్న బస్తీ దవాఖానాలు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, వాటి సంఖ్యను మరింత పెంచాలని కేసీఆర్ అన్నారు. ముఖ్యంగా పేదలు ఎక్కువగ నివసించే మురికి వాడల్లో ఎక్కువ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. దశల వారీగా బస్తీ దవాఖానాల్లో రోగ నిర్ధారక పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.

యాదాద్రికి అరుదైన గౌరవం.. అభినందించిన కేసీఆర్
యాదాద్రి పుణ్యక్షేత్రం ఐఎస్‌ఓ సర్టిఫికెట్ సాధించినందుకు ఆలయ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఐటీడీఏ వైస్ చైర్మన్ జి.కిషన్ రావు, ఈవో ఎన్.గీత, హెచ్.వై.ఎం. ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు అలపాటి శివయ్య తదితరులు శనివారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి డిజిటలైజ్ చేసిన నమూనాను, ఐఎస్‌ఓ వివరాలను ఆయనకు వివరించారు. దేవాలయాన్ని అద్వితీయంగా నిర్వహించడంతో పాటు ఆలయంలో పర్యావరణ పరిరక్షణ, భద్రత, నిర్వహణ, విద్యుత్ సరఫరా విభాగాల్లో మెరుగైన సేవలు అందిస్తున్నందుకు యాదాద్రి ఐఎస్‌ఓ సర్టిఫికెట్ సాధించింది. భారతదేశంలో ఓ ఆలయానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్ ఇదే ప్రథమం.

Tags
English Title
Eye light from the Pandragast
Related News