తేరుకున్న మార్కెట్లు

Updated By ManamWed, 09/12/2018 - 22:33
bse
  • గణేశ చతుర్థి కారణంగా గురువారం స్టాక్ ఎక్స్చేంజీలకు సెలవు

bseముంబై: రెండు రోజుల పతన ధోరణిని రివర్స్ చేస్తూ, ఈక్విటీ సూచీలు బుధవారం కోలుకుని పైకి ఎగబాకిన ధోరణిని కనబరచాయి. ఇటీవల దెబ్బతిన్న ఎఫ్.ఎం.సి.జి, మెటల్, క్యాపిటల్ గూడ్స్ షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. రూపాయి కూడా కొంత తెప్పరిల్లడం మార్కెట్‌కు ఊరట నిచ్చింది. దేశీయ కరెన్సీ ‘‘నిర్హేతుకమైన స్థాయిలకు’’ తరిగిపోకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత సెంటిమెంట్ బలపడింది. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారాంతంలో సమీక్షించనున్నారని వార్తలొచ్చాయి. సానుకూల స్థితిలో మొదలైన బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి ( బి.ఎస్.ఇ) 30 షేర్ల ‘సెన్సెక్స్’ మధ్యాహ్న ట్రేడ్‌లో మరింత పుంజుకుని, చివరకు 304.83 పాయింట్ల లాభంతో 37,717.96 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ కూడా 82.40 పాయింట్లు పెరిగి 11,369.90 వద్ద ముగిసింది. 

తెప్పరిల్లిన రూపాయి
డాలర్‌తో రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ఠ స్థితి రూ. 72.91 (ఇంట్రా-డే) నుంచి కోలుకుని మధ్యాహ్న ట్రేడ్‌లో రూ. 71.86కు కాస్త బలపడింది. భారతదేశపు ఎగుమతులు ఆగస్టులో 19.21 శాతం వృద్ధి చెంది 27.84 బిలియన్ డాలర్లకు చేరాయని డాటా సూచించడం రూపాయికి శుభ సూచకం అయింది. రూపాయి మంగళవారం రూ. 72.69కి క్షీణించిన సంగతి తెలిసిందే. రూపాయి ‘‘నిర్హేతుకమైన స్థాయిలకు’’ క్షీణించకుండా చూసేందుకు, ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అన్ని చర్యలు తీసుకుంటాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ చెప్పారు. దేశీయ మదుపు సంస్థలు, రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్ళతో బి.ఎస్.ఇ ‘సెన్సెక్స్’ ఒక దశలో 37,752.58 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. ఇంట్రా-డేలో అది 37,342 పాయింట్ల కనిష్ఠ స్థాయిని కూడా చూసింది. ప్రపంచ వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల ఆశావాదాన్ని చెల్లాచెదురు చేయడంతో  ‘సెన్సెక్స్’ గత రెండు సెషన్లలో సుమారు 977 పాయింట్లు పతనమైంది. తీవ్ర హెచ్చు తగ్గులను చూసిన సెషన్‌లో ఎన్.ఎస్.ఇ ‘నిఫ్టీ’ కీలకమైన 11,300 స్థాయిని తిరిగి అందుకుంది. అది 82.40 పాయింట్లు లాభపడి 11,369.90 వద్  ముగిసింది. ఇంట్రా-డేలో అది 11,250.20 నుంచి 11,380.75 మధ్య ఊగిసలాడింది. సడలిన ముడి చమురు ధరలు బ్రెంట్ క్రూడ్ ధర పీపాకు 79 డాలర్ల స్థాయిని దాటిన తర్వాత కొంత చల్లారింది.  ముడి చమురు ధరలు కాస్త సడలాయి. ఆసియాలోని చాలా భాగం ఇతర మార్కెట్లలో వరుసగా ఆరవ సెషన్‌లోనూ నష్టాలు కొనసాగగా, యూరోపియన్ మార్కెట్లు మాత్రం అధిక స్థితిలోనే ఆరంభమయ్యాయి. దేశీయ మదుపు సంస్థలు మంగళవారం రూ. 749.62 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 1,454.36 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారని తాత్కాలిక డాటా సూచించింది.

English Title
Expected Markets
Related News