వైభవంగా గరుడసేవ

Updated By ManamMon, 10/15/2018 - 07:10
garuda
  • వేంకటేశునికి ప్రియమైన వాహనం.. స్వామికి అత్యంత విశేష అలంకారం

  • 5 పేటల సహస్రనామ కాసులమాల..  గరుడసేవకు ముందు భారీ వర్షం

  • గొడుగులు వేసుకుని చూసిన భక్తులు.. ఉదయం మోహినీరూపంలో స్వామి

garudaతిరుమల: తిరమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన ఆదివారం రాత్రి.. మలయప్ప స్వామి తనకు అత్యంత ప్రియమైన గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారిని 5 పేటల సహస్రనామ కాసులమాల, చతుర్భుజ లక్ష్మీహారం, మైసూర్ మహారాజు శ్రీవారికి కానుకగా సమర్పించిన మకర కంటి తదితర ఆభరణాలతో అలంకరించారు. సహస్రనామ కాసులమాలలో గల 1008 కాసులపై విష్ణుసహస్ర నామాలు ఉంటాయి. చతుర్భుజ లక్ష్మీహారంలో గల కాసులపై శ్రీవారి దేవేరి అయిన లక్ష్మీదేవి ప్రతిమలుంటాయి. సహస్రనామ కాసులమాల, చతుర్భుజ లక్ష్మీహారం ఆభరణాలను నిత్యం శ్రీవారి మూలమూర్తికి అలంకరిస్తారు. గరుడవాహన సేవ ఉన్న ఒక్కరోజు మాత్రం వీటిని ఉత్సవ మూర్తి అయిన మలయప్ప స్వామికి అలంకరించడం విశేషం. గరుడ వాహన సేవకు కొద్ది నిమిషాల ముందు నుంచి తిరుమలలో హోరున వర్షం మొదలైంది. అంత జోరు వర్షంలోనూ భక్తులు భక్తిభావంతో వాహనసేవను తిలకించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవదిష్టుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నారు. ఉదయం శ్రీవారు మోహినీ రూపంలో శృంగార రసాధిదేవతగా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చాడు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చాడు.

English Title
Exclamation
Related News