వాద్రాకు సంబంధించి మూడు చోట్ల ఈడీ సోదాలు

Enforcement Directorate, ED Raids, Robert Vadra's close aide
  • మూడు చోట్ల ఏకకాలంలో దాడులు చేసిన అధికారులు

న్యూఢిల్లీ: బికనీర్ భూ ఒప్పందం కేసులో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాకు ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం వాద్రాకు సంబంధించిన సన్నిహితుల సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. ఏక కాలంలో మూడు చోట్ల సోదాలు జరిపినట్టు ఈడీ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. బెంగళూరులోని పలు ప్రాంతాల్లో కూడా సోదాలు జరిగాయి. భూ కుంభకోణం వ్యవహారంలో వాద్రా సన్నిహితుల బ్యాంకు అకౌంట్లలోకి నగదు మళ్లీంచారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ సోదాలు జరిపినట్టు న్యూస్ ఏజెన్సీ నివేదించింది. 

ఈడీ కథనం ప్రకారం.. వాద్రాకు సంబంధించిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ 69.55 హెక్టార్ల స్థలాన్ని రూ.72 కోట్లకు కొనుగోలు చేసిందని, అల్జెనీ ఫిన్‌లీజ్‌కు రూ. 5.15 కోట్లకు అమ్మి రూ. 4.43 కోట్లు లాభాన్ని పొందినట్టు ఆరోపించింది. తాజాగా వాద్రా సంబంధిత సంస్థల్లో ఈడీ సోదాలు జరపడంపై ఆయన తరపు న్యాయవాది తీవ్రంగా ఖండించారు. స్కైలైట్ హాస్పిటాలిటీ సిబ్బందిని ఈడీ బృందం లోపలే నిర్బంధించిందని, లోపలికి ఎవరిని అనుమతించలేదని.. ఇది నాజీయిజమా? జైలు అనుకుంటున్నారా? అని న్యాయవాది మండిపడ్డారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ ఈడీ... ఆధారాలు ఉన్నట్టు కట్టుకథలు అల్లుతోందని ఆరోపించారు. నాలుగన్నరేళ్లుగా ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. కానీ, ఇప్పుడు ఈడీ అధికారులు తమను లోపల నిర్బంధించి ఆధారాలు ఉన్నాయంటూ కట్టు కథలు కల్పిస్తోందని న్యాయవాది విమర్శించారు. ఈడీ సోదాలపై స్పందించిన రాబర్ట్ వాద్రా రాజకీయ కక్షతోనే తనపై ఇలాంటి ఆరోపణలు గుప్పిస్తూ ఈడీతో సోదాలు చేయిస్తున్నారని ఆరోపించారు.  

సంబంధిత వార్తలు