ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సంతృప్తి..

Updated By ManamFri, 09/14/2018 - 17:47
 Election Commission CEO Rajat Kumar
 Election Commission CEO Rajat Kumar press meet

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసిందని  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాలోని అభ్యంతరాలన్ని పరిష్కరిస్తామని  పేర్కొన్నారు.  ఓటరు జాబితాలతో పోలింగ్ బూత్‌ల వారీగా విభజన జరుగుతుందని తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పలు సూచనలు చేసిందని అన్నారు.

ఆరు నెలల్లోగా ఎన్నికల నిర్వహించాలనే నిబంధన ఉందని, ఈవీఎం మిషన్లు రాగానే వాటిని అన్ని రాజకీయ పార్టీల సమక్షంలోనే పరిశీలిస్తామని రజత్ కుమార్ తెలిపారు. ఈసారి ఎన్నికల్లో వీవీప్యాట్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నామని, ఈవీఎంలపై ఎలాంటి అనుమానాలు వద్దని అన్నారు. ఈ నెల 20లోగా రాష్ట్రానికి కావాల్సిన ఈవీఎంలు వస్తాయని, అలాగే 52వేల బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతుందన్నారు.

ఇక ఎన్నికల సందర్భంగా నగదు పంపిణీ చేయకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చును క్షుణ్ణంగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా సోషల్ మీడియాతో ఎన్నికల ప్రచారంపై నిఘా ఉంటుందన్నారు.  అలాగే మీడియా మానిటరింగ్ కమిటీ కూడా ఉంటుందని అన్నారు.

అలాగే ఓటర్లను చైతన్యపరిచేందుకు తమ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టిందని రజత్ కుమార్ తెలిపారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలను చైతన్య పరిచేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ నెల 15, 16వ తేదీల్లో గ్రామస్థాయిలో పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాపై ఉన్న అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరిస్తామని చెప్పారు.

English Title
Election Commission CEO Rajat Kumar press meet over elections in telangana
Related News