కాలుష్యంతో అబార్షన్స్..

Air Pollution and Increased Risk for Miscarriage
  • హెచ్చరించిన అమెరికన్ హెల్త్ యూనివర్సిటీ

వాషింగ్టన్, డిసెంబరు 7:  వాయు కాలుష్యంతో గర్భస్రావాల ప్రమాదం అంతకంతకూ పెరుగుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. ‘ఫర్టిలిటీ అండ్ స్టెరిలిటీ’ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ స్టడీని అమెరికాకు చెందిన ఉటా హెల్త్ యూనివర్సిటీ నేతృత్వంలో సాగింది. అత్యధిక జనాభా ఉన్న ఉటా ప్రాంతంలో ఇటీవలి కాలంలో గర్భస్రావాల సంఖ్య విపరీతంగా పెరిగింది. వాయు కాలుష్యానికి బలవుతున్న గర్భిణీల్లో కనీసం 16శాతం మంది గర్భస్రావాన్ని ఎదుర్కొన్నట్టు ఈ అధ్యయనం తేల్చింది. గర్భం నిలవడం, స్వచ్ఛమైన వాతావరణం మధ్య లోతైన సంబంధం ఉందని, దీనిపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉందని అధ్యయనకర్తల్లో ఒకరైన మ్యాథ్యూ ఫుల్లర్ అన్నారు.

ఉటా ప్రాంతంలో మాత్రమే నివసిస్తున్న గర్భిణీలపై పెట్టిన నిఘాలో నైట్రోజన్ డయాక్సైడ్ తీవ్ర ప్రభావం చూపినట్టు వీరు గుర్తించారు. జనాభా పెరిగేకొద్దీ వాయు కాలుష్య ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చుతుందని..ఇది అభివృద్ధిచెందుతున్న దేశాలకు మాత్రమే పరిమితం కాదని, అమెరికాలోనూ ఇది అతిపెద్ద సమస్యగా మారుతుందని అధ్యయనం హెచ్చరించింది.  వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తక్షణం చర్యలు చేపట్టకపోతే మానవాళికి తీవ్ర ముప్పు తప్పదని ఫుల్లర్ హెచ్చరించారు. 

మాస్కులు వాడండి
గర్భిణీ స్త్రీలు ఎన్95 ఫేస్ మాస్క్‌లు ధరించి తాము పీల్చే వాయువును ఫిల్టర్ చేసుకోవచ్చని వైద్యులు సూచించారు. స్వచ్ఛమైన వాతావరణం లేనిచోట్ల బయట తిరగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం గర్భిణీలను సురక్షితంగా ఉండేలా కాపాడుతుందని వీరు చెబుతున్నారు. ఇంట్లో కూడా ఎయిర్ ఫిల్టర్స్ వాడటం ఓ మార్గమని వీరు వివరించారు. 

సంబంధిత వార్తలు