బకాయిలు చెల్లించాలి

Updated By ManamWed, 06/13/2018 - 22:44
image
  • రెండు నెలైలెనా రైతులకు డబ్బు అందడం లేదు

  • మార్కెటింగ్ శాఖ సమస్యలు పట్టించుకునేవారేలేరు

  • సీఎస్‌కు సమస్య విన్నవించిన మాజీ ఎంపీ పొన్నం

imageహైదరాబాద్: ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన మొక్కజొన్న, వరి ధాన్యానికి సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ విషయమై బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషిని కలిసి సమస్యను వివరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రైతులకు మొత్తం రూ.1800 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ప్రభుత్వం  కేవలం రూ.780 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, అది కూడా రైతులకు సక్రమంగా చేరడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లో నగదు చెల్లిస్తామని చెప్పారని, రెండు నెలలైనా రైతులకు డబ్బు అందలేదన్నారు.

వర్షాకాలం వచ్చిందని, ఈ సమయంలో రైతులకు పెట్టుబడికి నగదు అవసరం ఉంటుందని, కానీ బ్యాంకుల్లో రైతులకు నగదు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఐదు లక్షల ధాన్యం అమ్మినా ఐదు వేలు కూడా బ్యాంకు అధికారులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను సీఎస్ ఎస్.కే. జోషి దృష్టికి తీసుకవెళ్లామని, స్పందించిన సీఎస్ సమస్యలున్నామాట వాస్తవమేనని, దానికనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.

మార్కెటింగ్ శాఖలో ఎదురవుతున్న సమస్యలను పట్టించుకునే వారే లేరన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, ఆర్థిక శాఖల మంత్రులు కూర్చొని ఏ బ్యాంకులో నగదు జమ చేస్తే రైతులకు సక్రమంగా చేరుతుందో నిర్ణయించాలన్నారు. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతుంటే మార్కెటింగ్ శాఖను వేరే వారికి అప్పగించాలని సూచించారు.

English Title
Dues to pay
Related News