‘మత్తు’ వదలరా!

Updated By ManamSat, 06/23/2018 - 21:06
Drugs, more impact Youth, other than issues

కొన్ని దశాబ్దాల కాలం నుంచీ దేశంలోని లక్షలాది మంది పిల్లలనూ, యువతనూ ప్రభావితం చేస్తున్న అతి పెద్ద సమస్యల్లో డ్రగ్ వినియోగం ఒకటి. కొన్ని రాష్ర్టాలు, నగరాల్లో డ్రగ్ వినియోగం ఇప్పటికే హెచ్చు స్థాయిలో ఉండగా, మిగతా నగరాల్లోనూ ఊహించనంతటి వేగంగా ఈ భూతం విస్తరిస్తోంది. చాలా కాలం నుంచి ఉత్తర భారతంలోని పంజాబ్ రాష్ట్రం డ్రగ్ మహమ్మారి కారణంగా అతలాకుతలం అవుతోంది. అక్కడి యువతలో ఏకంగా 75 శాతం మంది ఏదో ఒక మత్తు పదార్ధానికి బానిసలే! ముంబై, హైదరాబాద్ నగరాల్లో డ్రగ్ వినియోగించే యువత సంఖ్య కూడా తక్కువేమీ కాదని రిపోర్టులు చెబుతున్నాయి. తెలంగాణలోని జహీరాబాద్ వంటి ఒక చిన్న పట్నం కూడా దీని తాకిడికి గురవుతుందంటే, అందులోనూ పదో తరగతిలోపు బడి పిల్లలకూ ఈ మాయదారి వ్యసనం అంటిందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవాల్సిందే. ఇంకా చేతులు కట్టుకొని కూర్చుంటే ‘ఉడ్తా పంజాబ్’ సినిమాలో చూపించినట్టు భావి భారతం మత్తుతో ఊగుతూ, తూగుతూ ఉంటుంది. ఊహించుకోడానికే అదెంత భయానకంగా ఉంటుంది! 
(కవర్ స్టోరీ)

Drugs, more impact Youth, other than issuesబాల్యం అనేది భవిష్యత్తుకు పునాది వేసుకొనే మంచి అవకాశాల దశ. కౌమారం మీదుగా ఎదిగే క్రమంలో పిల్లలు ఎన్నో విషయాలను నేర్చుకుంటారు, పలు సామర్థ్యాలను సంతరించుకుంటారు, వ్యక్తిత్వానికి పునాది వేసుకుంటారు. కానీ ఇదే దశ.. మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు, ధూమపానం వంటి అనారోగ్యకర వ్యసనాలకు అలవాటు పడటానికీ దోహదం చేసే దశ కూడా! పేదరికం, పరిసరాల్లోని హింసాత్మక వాతావరణం, తల్లిదండ్రుల నుంచి ప్రేమాదరణలు లోపించడం, మత్తు పదార్థాలు సునాయాసంగా లభ్యం కావడం, సంక్లిష్ట మానసిక స్థితి, స్నేహితుల ప్రేరేపణ వంటి వాటివల్ల పిల్లలు మాదక ద్రవ్యాలు తీసుకోవడానికి కారణమవుతున్నాయి. మెుదట్లో ఒక ప్రయోగంగా వాటిని తీసుకున్నప్పటికీ, కాలక్రమేణా వాటికి బానిసలవుతున్నారని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక రిపోర్ట్ ప్రకారం 74 శాతం భారతీయ కుటుంబాల్లోని వయోజనుల్లో కనీసం ఒకరన్నా డ్రగ్ తీసుకుంటున్నారని వెల్లడైంది.

ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలు ఎలా తయారవుతారు? టీనేజ్‌లోకి అడుగుపెట్టిన పిల్లలు.. అంటే పదమూడు, పద్నాలుగేళ్ల వయసు పిల్లలు చాలా సులువుగా డ్రగ్స్‌కు ఆకర్షితులవుతున్నారు. స్వల్ప కాలంలోనే వాటికి బానిసలైపోతున్నారు. 2000-2001 సంవత్సరంలో యు.ఎన్.ఒ.డి.సి. (యునెటైడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్), సామాజిక న్యాయం, సాధికారతా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ అధ్యయనం దేశంలో 732 లక్షల మంది మద్యపానానికీ, మత్తు పదార్థాలకీ అలవాటు పడ్డారని అంచనా వేసింది. వీరిలో 87 లక్షల మంది గంజాయి (కాన్నబిస్), 20 లక్షల మంది నల్లమందు, 650 లక్షల మంది ఆల్కహాల్ వినియోగదారులు. గంజాయి వినియోగదారుల్లో 26 శాతం మంది, నల్లమందు తీసుకొనేవాళ్లలో 22 శాతం మంది, ఆల్కహాల్ తాగే వాళ్లలో 17 శాతం మందీ వాటికి పూర్తిగా బానిసలయ్యారు! పదిహేడు, పద్దెనిమిదేళ్ల క్రితమే పరిస్థితి ఇలా ఉందంటే ఇప్పుడది ఎంత దారుణంగా ఉండి ఉంటుందో ఊహించుకోవాల్సిందే.

Drugs, more impact Youth, other than issues‘‘హలో.. రాఘవరావు (అసలు పేరు కాదు) గారేనా మాట్లాడేది?’’
‘‘అవున్సార్.. ఎవరు మాట్లాడుతోంది?’’
‘‘నేను సీఐని మాట్లాడుతున్నా. ఒకసారి పోలీస్ స్టేషన్‌కు రాగలరా?’’
‘‘సా..ర్.. ఏ..మైంది?...’’
‘‘ముందు మీరు వెంటనే బయలుదేరి రండి.’’
ఏమీ అర్థంకాక బైక్ మీద బయలుదేరిన రాఘవరావు పావుగంటలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. కానిస్టేబుల్‌ను అడిగి సీఐ రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడ పదహారు, పదిహేడేళ్ల వయసున్న ముగ్గురు కాలేజీ కుర్రాళ్లు చేతులు కట్టుకొని, తలొంచుకొని నిల్చొని ఉన్నారు. వాళ్లను చూసి గతుక్కుమన్నాడు రాఘవరావు. వాళ్లలో ఒకడు ఆయన కొడుకు సందీప్ (అసలు పేరు కాదు).
వణుకుతున్న కంఠంతో ‘‘సార్.. నమస్తే. నేను రాఘవరావుని. ఏమైంది.. సార్?’’ అనడిగాడు.
‘‘ఈ ముగ్గురూ గంజాయి సిగరెట్లు తాగుతూ దొరికిపోయారు. మీరు సందీప్ ఫాదరే కదా..’’
సీఐ ఇంకా చెప్పుకు పోతూనే ఉన్నాడు. రాఘవరావుకి ఏమీ వినిపించడం లేదు. తల, గుండె.. రెండూ ఒకేసారి బద్దలవుతున్న ఫీలింగ్. సందీప్ గంజాయి తాగడమేంటి? ఎలా నమ్మాలి? తాము ఎలా పెంచుతూ వచ్చారు? ఎంతగా ప్రేమ చూపిస్తూ వస్తున్నారు? ఏ లోటూ లేకుండా, ఏది అడిగితే అది.. చేతిలో పెడుతూ వచ్చాం కదా.. ఎప్పుడైనా తప్పు చేస్తే, పొరపాటుగా ప్రవర్తిస్తే మందలిండమో, కాస్త చేయి చేసుకోవడమో.. అంతే కదా! ఏనాడూ గట్టిగా దండించింది లేదే? మరెందుకు తప్పుదారి పడ్డాడు?.. అంతలోనే అతడికి భార్య గుర్తుకువచ్చింది.

Drugs, more impact Youth, other than issuesఈ సంగతి ఆమెకు తెలిస్తే.. అమ్మో.. ఇంకేమైనా ఉందా? ఆమెకు చెప్పకూడదు. తెలిస్తే తట్టుకోలేదు.. మరో గంటసేపు స్టేషన్‌లోనే ఉన్నాడు రాఘవరావు. సందీప్‌తో పాటు పట్టుబడిన మిగతా ఇద్దరు కుర్రాళ్ల తండ్రులూ అక్కడికి వచ్చారు. అందరికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. డ్రగ్స్ వల్ల శారీరకంగా, మానసికంగా ఎలాంటి నష్టం జరుగుతుందో, ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో వివరించారు. ఇంకోసారి పట్టుబడితే కేసు ఫైల్‌చేసి, కోర్టుకు సబ్మిట్ చేస్తామనీ, అదే జరిగితే భవిష్యత్తులో కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందనీ సీఐ హెచ్చరించాడు. విషణ్ణ వదనాలతో తండ్రీ కొడుకులు ఇంటికి వచ్చారు. మధ్యలో ఇద్దరూ ఒక్క మాటా మాట్లాడుకోలేదు.

*****************
ఇది కేవలం రాఘవరావుకో, లేదా ఏ కొద్దిమందికో పరిమితమైన సమస్య కాదు. స్కూలుకీ, కాలేజీకీ వెళ్తున్న చాలా మంది పిల్లల తల్లిదండ్రుల సమస్య ఇది. తమ కొడుక్కి డ్రగ్ తీసుకొనే అలవాటుందని తెలిసి.. దాని వల్ల అతడి బంగారు భవిష్యత్తు ఎక్కడ పాడైపోతుందనే ఆందోళన ఒకవైపు, ఆ విషయం బయటకు పొక్కితే సమాజంలో ఎంత చులకనైపోతామో, కుటుంబ పరువు బజారున పడుతుందేమో.. అనే భీతి ఇంకోవైపు.. చుట్టుముడుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణనాతీతం.

స్నేహితులతో జాగ్రత్త!
Drugs, more impact Youth, other than issuesపిల్లలు ఆనందంగా ఎదగడానికి తల్లిదండ్రుల్ని మించిన ప్రభావవంతమైన వ్యక్తులు ఇంకొకరు ఉండరు. జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితుల్ని అధిగమించడం ఎలాగో పిల్లలు నేర్చుకొనేది తల్లిదండ్రుల దగ్గర్నుంచే. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య బలమైన అనుబంధం ఉంటే, సంక్లిష్ట పరిస్థితుల్లోనూ పిల్లలు సవ్యంగానే వ్యవహరిస్తారని మానసిక నిపుణులు చెబుతుంటారు. ప్రతి రోజూ కొద్దిసేపైనా పిల్లలతో మనస్ఫూర్తిగా గడిపితే, వాళ్లకు అదెంతో మేలు చేస్తుందంటారు. పిల్లలు సక్రమంగా చేసిన పనుల్లో ఏ ఒక్కదాన్నయినా అభినందిస్తే, వారిలో పాజిటివ్‌నెస్‌కు దోహదం చేస్తుందనేది వారి వాదన. సందీప్ విషయానికి వస్తే.. తల్లిదండ్రులు అతడితో ఎక్కువ సమయమే గడుపుతారు. ప్రేమను పంచుతారు. కబుర్లు చెబుతారు. అయినా అతడు మత్తుకు అలవాటు పడ్డాడంటే కారణం.. అప్పటికే ఆ అలవాటుకు గురైన అతడి స్నేహితులు! అందుకే.. పిల్లల స్నేహితుల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సందీప్ ఉదంతం తెలియజేస్తోంది. అలాగే పిల్లలపై టీచర్ల ప్రభావమూ ఎక్కువే. వాళ్లు మంచిగా ప్రేరేపిస్తే సంతోషంగా, హుషారుగా ఎదుగుతారు పిల్లలు. చాలా సంక్లిష్ట పరిస్థితుల్లోనూ, బడిలో ఉండటాన్ని సురక్షితంగా భావించే పిల్లలు చెడు ప్రవర్తనకు తక్కువగా ఆకర్షితులవుతారు.

ఉత్పత్తి పెరుగుతోంది
అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కొకైన్ ఉత్పత్తి, రవాణా, వినియోగం బాగా పెరిగింది. గతంలో పలు చర్యల కారణంగా తగ్గినప్పటికీ, కొలంబియాలో పండించడం ఎక్కువవడంతో, తిరిగి 2013-15 కాలంలో కోకా పంట 30 శాతం పెరిగింది. 2015లో స్వచ్ఛమైన కొకైన్ హైడ్రోక్లోరైడ్ మెుత్తం గ్లోబల్ ఉత్పత్తి 1,125 టన్నులకు చేరింది. అందుకు అనుగుణంగానే అదే ఏడాది సీజ్ చేసిన కొకైన్ రికార్డ్ స్థాయిలో 864 టన్నులకు చేరుకుంది. 2016లో ప్రపంచవ్యాప్తంగా 6,380 టన్నుల ఓపియమ్ (నల్లమందు) ఉత్పత్తయింది. ఇది ఆ మునుపటి ఏడాదితో పోలిస్తే మూడింట ఒక వంతు ఎక్కువ. అఫ్ఘనిస్థాన్‌లో నల్లమందు గింజల సాగుబడి విస్తీర్ణం బాగా పెరగడంతో, ప్రపంచవ్యాప్తంగా వాటి సాగు విస్తీర్ణం పెరిగింది.

స్త్రీలు సైతం..
డ్రగ్స్ వినియోగం వల్ల రుగ్మతలతో బాధపడుతున్నవారిలో స్త్రీలతో పోలిస్తే పురుషులు రెండు రెట్లు ఎక్కువ. ఏదేమైనా, డ్రగ్స్.. ప్రత్యేకించి ఆల్కహాల్, గంజాయి, ఓపియాయిడ్స్, కొకైన్ వంటివి తీసుకోవడం మెుదలుపెట్టిన స్త్రీలు చాలా వేగంగా పురుషుల కంటే ఎక్కువ మోతాదులో వాటిని వినియోగిస్తున్నారు! గత దశాబ్దంలో పురుషుల కంటే స్త్రీలలో డ్రగ్ వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు చాలా వేగంగా పెరిగాయి. ప్రత్యేకించి ఓపియాయిడ్, కొకైన్ వాడకం వల్ల కలిగే రుగ్మతలు పురుషుల్లో (17 శాతం, 26 శాతం) కంటే స్త్రీలలో ఎక్కువగా (25 శాతం,  40 శాతం) ఉండటం గమనించాల్సిన విషయం

వేగంగా వ్యాపిస్తున్న క్షయ
ఆరోగ్యపరంగా హెరాయిన్ వంటి ఓపియాయిడ్స్ అనేవి డ్రగ్స్‌లో అత్యంత హానికర రకానికి చెందినవి. ప్రజల్లో అకాల మరణానికి గురైనవారిలో ఓపియాయిడ్స్ డ్రగ్‌కు అలవాటు పడ్డవాళ్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటున్నారు. డ్రగ్స్‌ను శరీరంలోకి ఎక్కించుకొనేవారు తీవ్రమైన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 లక్షల మంది డ్రగ్స్‌ను ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటున్నారని అంచనా. వాళ్లలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు (16 లక్షల మంది) హెచ్‌ఐవీతోనూ, సగం మంది (61 లక్షల మంది) హెపటైటిస్ సి వ్యాధితోనూ బాధపడుతున్నారు. డ్రగ్ వినియోగం వల్ల సంభవించే ఇతర రుగ్మతలతో చనిపోయేవాళ్ల కంటే హెపటైటిస్ సి కారణంగా చనిపోయేవాళ్లే ఎక్కువ. అంటే డ్రగ్ వినియోగిస్తూ హెచ్‌ఐవీ బారిన పడి మృతిచెందే వాళ్లతో పోలిస్తే, హెపటైటిస్ సి వ్యాధితో మరణించేవాళ్లే ఎక్కువన్న మాట. ఐరోపా, ఆసియా, అమెరికాలలో జరిపిన అధ్యయనాల ఆధారంగా వెల్లడైన మరో విషయం.. డ్రగ్స్‌ను ఇంజెక్ట్ చేసుకునేవారిలో సుమారు 8 శాతం మంది ట్యూబర్‌క్యులోసిస్ (క్షయ వ్యాధి) బారిన పడుతున్నారు. 

Drugs, more impact Youth, other than issuesసాధారణ ప్రజానీకంలో ఈ వ్యాధి 0.2 శాతం మాత్రమే! డ్రగ్స్‌ను వినియోగించేవాళ్లలో క్షయ నిరోధానికీ, చికిత్సకీ నిర్దేశితమైన ప్రమేయాలు అవసరం. డ్రగ్ ఇంజెక్షన్ తీసుకొనేవారిలో క్షయ రావడానికి ప్రధాన కారణాల్లో హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్ ఒకటి. అదేవిధంగా డ్రగ్స్ వినియోగిస్తూ, హెచ్‌ఐవీతో జీవించే వాళ్లలో ఎక్కువ మంది చావులకు క్షయ ఒక ముఖ్య కారణం. డ్రగ్స్ వినియోగించే వాళ్లలో ప్రత్యేకించి క్షయ వ్యాధి చికిత్స చాలా క్లిష్టతరమైంది. కారణం క్షయతో పాటు వాళ్లలో అనేక ఇతర అంటువ్యాధులు, డ్రగ్‌పై ఆధారపడటం వల్ల వచ్చే మానసిక రుగ్మతలతో బాధపడుతూ ఉండటం. అన్నింటికీ మించి, సాధారణ ప్రజల కంటే డ్రగ్స్ వినియోగదారుల్లో క్షయ నివారణ, చికిత్సకు అనేక అవరోధాలు కలుగుతున్నాయి. ఆరోగ్య, సంక్షేమ పథకాలు డ్రగ్స్ వల్ల ప్రభావితులైన లక్షలాది మందికి చేరడంలో విఫలమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. 
 

ఆన్‌లైన్‌లో చీకటి వ్యాపారం
ఇంటర్నెట్‌లో ఉండే డార్క్‌నెట్ ద్వారా కూడా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు వెల్లడైంది. బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ ద్వారా వీటి కొనుగోళ్లు జరుగుతున్నాయి. కొనుగోలు తర్వాత చాటుగా వాటిని డెలివరీ చేస్తున్నారు. డార్క్‌నెట్ ద్వారా గంజాయి, ‘ఎక్‌స్టాసీ’, కొకైన్, హలూసినోజెన్స్ వంటి డ్రగ్ కొనుగోళ్లు జరుగుతున్నాయి. హెరాయిన్, మెథాంఫెటమిన్ ఆర్డర్లు తక్కువ. అయితే డ్రగ్ అమ్మకాల్లో ఈ డార్క్‌నెట్ కొనుగోళ్లు కొద్ది పరిమాణంలోనే జరుగుతున్నా, ఇటీవలి సంవత్సరాల్లో ఈ మార్కెట్ ఏడాదికి 50 శాతం చొప్పున పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం.

అనారోగ్య ప్రపంచం
2015లో ప్రపంచంలోని వయోజనుల్లో 5 శాతం మంది కనీసం ఒక్కసారైనా డ్రగ్స్ తీసుకున్నారు. మరింత బాధాకరమైన విషయమేమంటే ఆ డ్రగ్ వినియోగదారుల్లో 295 లక్షల మంది, అంటే ప్రపంచ వయోజనుల్లో 0.6 శాతం మంది డ్రగ్ వినియోగం వల్ల కలిగే రుగ్మతలతో బాధపడుతున్నారు. దీన్ని మరో రకంగా చెప్పాలంటే డ్రగ్ వినియోగం వల్ల ముందుగానే ఆయుష్షు తీరిపోవడం, వైకల్యాలకు లోనవడం ఫలితంగా 2015లో 280 లక్షల సంవత్సరాల ఆరోగ్యకర జీవితాన్ని ప్రపంచ జనాభా కోల్పోయింది!

జైళ్లూ తక్కువ తినలేదు
అనేక జైళ్లల్లో హెరాయిన్, డ్రగ్ ఇంజెక్షన్లు అనేవి తీసుకోవడం సాధారణమైంది. ఖైదు అయిన కొద్ది కాలానికే ప్రతి ముగ్గురిలో ఒకరు అక్రమ మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారు. జైలులో ఖైదీలు ఎక్కువగా వినియోగిస్తున్న డ్రగ్ గంజాయి. హెరాయిన్‌ది తర్వాత స్థానం. జైలులోకి వచ్చిన కొద్ది కాలానికి 10 శాతం మంది హెరాయిన్‌ను తీసుకుంటున్నట్లు వెల్లడైంది. జైళ్లలో డ్రగ్ ఇంజెక్షన్లు తీసుకుంటున్న వాళ్లలో హెచ్‌ఐవీ వ్యాపించడానికి కారణం సురక్షితం కాని రూపంలో ఇంజెక్షన్లు తీసుకోవడమే. అలాగే జైలు ఖైదీల్లో డ్రగ్ వినియోగదారుల్లో క్షయ బారిన పడుతున్నవాళ్లు ఎక్కువగా ఉంటున్నారు.
(జూన్ 26 డ్రగ్ దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం)
- బుద్ధి యజ్ఞమూర్తి

English Title
Drugs more impact on Youth other than issues
Related News