బరిలో దిగుతున్నా

tulsi gabbard tulsi
  • 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ

  • ఈసారి పోటీలో నేనుండటం ఖాయం

  • డెమొక్రాటిక్ నేత తులసీ గబ్బర్డ్

  • వారంలో అధికారిక ప్రకటనకు చాన్స్

  • ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న తులసి..

  • గెలిస్తే మొట్టమొదటి హిందూ మహిళ

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఢీకొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు హిందూ మూలాలున్న డెమొక్రాటిక్ అమెరికా నాయకురాలు తులసీ గబ్బర్డ్ స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలను సీఎన్‌ఎన్ చానల్ ప్రసారం చేసింది. 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసేందుకు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం తానూ రంగంలో ఉంటానని ఆమె తెలిపారు. ఈ విషయమై వచ్చే వారంలో అధికారిక ప్రకటన చేస్తానని అన్నారు. ఇరాక్ యుద్ధంలో పాల్గోన్న తులసీ గబ్బర్డ్ (37) హవాయికి చెందినవారు. అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన మొట్టమొదటి హిందువు, మొట్టమొదటి సమొవాన్-అమెరికన్ జాతికి చెందిన వారు. డెమొక్రాటిక్ పార్టీ ప్రైమరీలలో పాల్గొనే విషయమై క కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మసాచుసెట్స్‌కు చెందిన అమెరికా సెనెటర్ ఎలిజబెత్ వారెన్ డిసెం బరు 31న ప్రకటించారు. కాగా తన ప్రచారంలో ప్రధాన ఇతివృత్తం.. ‘‘యుద్ధం, శాంతి’’ అని తులసీ గబ్బర్డ్ చెప్పారు. డెమొక్రాటిక్ పార్టీ తరఫున ఈసారి అభ్యర్థి త్వం కోసం చాలామంది పోటీ పడుతున్నారు. వాళ్లలో  సెనెటర్లు కమలా హారిస్, కోరీ బుకర్, కిర్‌స్టెన్ గిల్లిబ్రాండ్, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ ఉన్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు హౌసింగ్ సెక్రటరీగా వ్యవహరించిన జూలియన్ కాస్ట్రో కూడా డిసెంబరులో ఒక కమిటీని ఏర్పాటుచేసవారు. ట్రంప్ మీద పోటీ చేసేందుకు అభ్యర్థిని ఎన్నుకోడానికి డెమొక్రాట్లు గట్టిగా పోటీ పడుతున్నారు. గతంలో మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, సెనెటర్ బెర్నీ శాండర్స్ కూడా ఈ పోటీలో ఉండటంతో 2016లో ఒక్కో రాష్ట్రంలో నామినేటింగ్ పోటీలు పెట్టారు. క్లింటన్, శాండర్స్ మధ్య చర్చల సంఖ్యను తగ్గించాలన్న పార్టీ నిర్ణయానికి నిరసనగా 2016లో డెమొక్రాటిక్ నేషనల్ కమిటీలో నాయకత్వ పదవిని వదులుకోవడం ద్వారా తులసీ గబ్బర్డ్ ఒక్కసారిగా పత్రికల పతాక శీర్షికలకు ఎక్కారు. వారిద్దరి మధ్య తక్కువ చర్చలు జరగడం వల్ల క్లింటన్‌కు మేలు జరిగిందని విశ్లేషకులు అన్నారు. దాంతో అప్పుడు హిల్లరీ క్లింటన్ డెమొక్రాటిక్ అభ్యర్థిత్వాన్ని ఖాయం చేసుకుని, ట్రంప్ మీద పోటీ చేసి ఓడిపోయారు. శాండర్స్‌కు మద్దతు పలికిన అతి తక్కువ మంది కాంగ్రెస్ సభ్యులలో ఒకరిగా తులసీ గబ్బర్డ్ అప్పట్లో నిలిచారు. సిరియా అధ్యక్షుడు బషరల్ అల్ అసద్‌ను రహస్యంగా కలిసినందుకు ఆమె విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయనను అధికారం నుంచి తొలగించడాన్ని తులసీ వ్యతిరేకించారు.

సంబంధిత వార్తలు