నాటక చంద్రుడు చందాల కేశవదాసు..

Updated By ManamFri, 06/08/2018 - 01:15
keshava

keshavaఈ నాటి ఖమ్మం జిల్లాలోని జక్కేపల్లి లో 1876 జూన్ 20 న జన్మించి 1956 మే నెల 14 న రంగ స్థల తారల్లో కలసిపోయిన కేశవదాసు లక్షల మంది కళాకారుల గళాల్లో సజీవంగా ఉన్నారు. ఎవరు రాశారో తెలియకపోయినా మనసారా హత్తుకుని పాడే పాటలు తెలుగువారందరికీ రెండుతరాలు గా తెలిసినవే. ప్రతి పద్యనాటకం ప్రదర్శన ప్రారంభానికి ముందు తెరవెనక చేతులు ముకుళించి  భక్తితో అరమోడ్పు కళ్లతో  ప్రార్దించే గీతం కేశవదాసు కలంలోంచి పుట్టింది.
పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదాశివా... సదానంద.. గీతం వినని తెలుగువారు ఉండరు.   భలేమంచి  చౌకబేరము... సమయము మించినన్ దొరకదు... త్వరంగొనుడు సుజనులారా అంటూ మనందరికి తెలిసిన పాట కూడా ఆయన అంది చిందే. ఎన్నెన్నో పాటలతో పాటు ఆయన రచించిన  మహత్తర నాటకం కనకతార. 1934 నాటికే జనాల జేజేలు అందుకొంది. తెలుగు నాటకాలకు నడకలు నేర్పిన సురభి వారికోసమే ప్రత్యేకంగా రాసిన ఆ నాటకం, నాటి పెద్దలు వనారస గోవిందరావు, పెద రామయ్య, చినరామయ్య, రేకందార్ చినవెంకట్రావుల వంటివారు తీర్చి దిద్దటంతో  మనోరంజకం అయిం ది. 1937 లో హెచ్.వి.బాబు దర్శకత్వంలో సముద్రాల రచన, భీమవరపు నరసింహారావు సంగీ తంతో కూర్చిన ఈ చిత్రం వెండితెరకే అందం తెచ్చింది. నాటి అగ్రనటులు రంగస్థల తారలు కన్నాంబ, సూరిబాబు, దొమ్మేటి సూర్యనారాయణ వంటివారు సరస్వతి టాకీస్ పతాకంపై ప్రేక్షకుల్ని  ఊయలలూగించారు.. ఆ సినిమాలో 12 పాటల్ని కేశవదాసు రాశారు.

పాత తరం నుంచి కొత్త తరం...
చందాల కేశవదాసు రచించిన  నాటకం 60యేళ్ల తరువాత తాజా గా వేదికపైకి వచ్చింది..135 యేళ్ల నాటక చరిత్ర కలిగిన సురభి కుటుంబం నుంచి  నవయువకుల బృందం ఆ  ప్రదర్శన తో తెలంగాణ నాటకాలకి వన్నె పెంచుతున్నారు.. 2018 లో సురభి కుటుంబ వారసులు 85 యేళ్ల నాటి కనకతారను పొదివిపట్టుకుని ఆధునిక ప్రక్రియలతో  తమకు మాత్రమే సాధ్యమైన మార్పులతో తాజాగా మన ముందుకు తెచ్చారు.. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహంతో ఆ నాటకం నవయువ  బృందంతో  వేదికలు ఎక్కుతోంది. తెలంగాణ యువ నాటకోత్సవంలో తొలిసారిగా వేదిక పైకి వచ్చిన  కనకతార మలి ప్రదర్శనలు  లలితకళాతోరణంలో గల సురభి నాటకశాలలో జరిగాయి. తెలుగు సాంస్కృతిక రంగానికి ఆత్మీయుడు, తెలంగాణ  ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్. కె.వి.రమణ. ఆయనకు తోడు  రవీంద్రభారతి  సంచాలకుడు మామిడి హరికృష్ణ చేపడుతున్న చర్యలతో సురభి  కళాకారులలో సరికొత్త జీవం పొంగులెత్తుతోంది.. 

కనకతార రసవత్తర రంగస్థలధార...
మన జానపదగాధలను చిత్ర రూపంలో అందరికీ తెలిసిన అద్భుత రస  కథనంతో ఇద్దరు రాచబిడ్డలు,  కనకసేనుడు, తారలు పడ్డ కష్టాలు, రాజ్యంకోసం కుటుంబంలో జరిగే కుట్రలు, హత్యలు వంటివాటితో ప్రదర్శన ఆసాంతం వినోదం  అందిస్తుంది. రసరమ్యమైన లయ తో భజనగీతాల వంటివాటిల్లోని ఊపు. పల్లెపదాల లోని సరదాలు, ఎకసెక్కాలు, సన్నివేశాల్లో   రక్తి కట్టిస్తాయి. 100 యేళ్ల క్రితం ప్రతి ప్రదర్శనలో తప్పనిసరిగా చోటు చేసుకునే బఫూన్, కేతిగాడు, కోనంగి, విదూషకుడు లాంటి పాత్రల కు ధీటుగా బుడ్డర్‌ఖాన్, ఖుస్రూ ల వంటి పాత్రలు వచ్చాయి. కనకతార నాటకంలో సూర్యకాంతం వంటి గయ్యాళి పాత్రలు,  కత్తికాంతారావు వంటి స్టంట్‌లు నిండుగా ఉంటాయి. సురభి కుటుంబం కలకాలం వికసించాలని కోరుకునేవారు జానపద సినిమాల వంటి నాటకాన్ని కుటుంబసమేతంగా ఆస్వాదిం చాలని అనుకునేవారు కనకతారను తప్పక చూడాలి. తెలంగాణ నాటక వైభవాన్ని తలచుకుని మురిసేలా విస్తృతంగా ప్రదర్శించడానికి  సురభివారు సిద్ధంగా ఉన్నారు.. చూసేవారి ఆదరణకు తగినట్టుగా ప్రదర్శన  వేళలు ఉంటాయని సురభివారు అంటున్నారు. పబ్లిక్ గార్డన్ వైపునకు వచ్చి మా నాటకశాలను దర్శించండి. ఉల్లాసం ఉత్సాహం ఇంటి ల్లిపాదికి అందించే పూచీ మాది. మూడుతరాల నాటక కుటుంబాన్ని ఆదరించాలనే వారందరకీ ఆహ్వానం అంటున్నారు.
- జి.ఎల్.ఎన్. మూర్తి

Tags
English Title
Drama moon The contents of the contents ..
Related News