వయస్సు 14.. బరువు 237 కిలోలు..

Updated By ManamTue, 07/03/2018 - 16:50
Doctors operate, 237kg Delhi boy, world's heaviest teen
  • ప్రపంచంలోనే బరువైన టీనేజర్‌గా గుర్తింపు

  • శస్త్రచికిత్సతో 60 కిలోలు తగ్గిన యువకుడు

Doctors operate, 237kg Delhi boy, world's heaviest teenన్యూఢిల్లీ: పద్నాలుగేళ్ల వయసులో ఉండాల్సిన వయసు కన్నా... ఆ మాటకొస్తే అసలు ఉండకూడనంత బరువున్నాడు. ఆ వయసుకే ఏకంగా 237 కిలోల బరువుతో ప్రపంచంలోనే అత్యంత బరువైన టీనేజర్‌గా గుర్తింపు పొందాడు. నిలుచోవడమే కష్టంగా మారడంతో ఎప్పుడూ పడుకోవడం, బెడ్‌పై కూర్చోవడానికే పరిమితమయ్యాడు. మితిమీరిన భారాన్ని దించుకోవాలని వైద్యులను ఆశ్రయిస్తే.. ఆ బాబు బరువు తగ్గించడం సాధ్యమేనా అని వైద్యులే సందేహాలు వ్యక్తం చేశారు. అయితే, తనతో పాటు తన తల్లిదండ్రులు కూడా పట్టుదలగా వైద్యుల సలహాలు పాటించడంతో వైద్యులు నమ్మకంతో ముందడుగు వేశారు. ఫలితం మూడు నెలల్లో 60 కేజీలు తగ్గి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాడు. మున్ముందు మరింత బరువు తగ్గుతానంటున్న ఆ బాలుడి వివరాలు.. ఢిల్లీలోని ఉత్తర్ నగర్‌కు చెందిన మిహిర్ జైన్(14) పుట్టినప్పుడు 2.5 కిలోల బరువు ఉండేవాడు. కానీ క్రమంగా బరువు పెరుగుతూ ఐదేళ్ల నాటికి 60 నుంచి 70 కిలోలకు చేరుకున్నాడు.

Doctors operate, 237kg Delhi boy, world's heaviest teenఅయితే, తమ కుటుంబంలో అందరూ బలంగానే ఉండటంతో మిహిర్ బరువు పెరగడాన్ని పట్టించుకోలేదని బాలుడి తల్లి పూజ వివరించారు. కొన్ని రోజులకు లేచి నడవడానికి కూడా మిహిర్ ఇబ్బంది పడటంతో 2 వ తరగతి నుంచి స్కూల్ మాన్పించి, ఇంటి దగ్గరే పాఠాలు బోధించినట్టు చెప్పారు. 2010లో తొలిసారిగా వైద్య సాయంకోసం ప్రయత్నించినా కానీ, ఆపరేషన్‌కు తగిన వయసు కాదంటూ వైద్యులు తిరస్కరించారట! ఇటీవల మరోసారి వైద్యులను ఆశ్రయించడంతో వైద్యులు సందేహిస్తునే చికిత్స ప్రారంభించారు. తొలుత తక్కువ కేలరీల ఆహారం తీసుకోవాలని సూచించామని డాక్టర్ ప్రదీప్ తెలిపారు. 

మిహిర్‌కు కేవలం 800 కేలరీల డైట్‌ను మాత్రమే సిఫార్సు చేశామని చెప్పారు. నాలుగు వారాల తర్వాత పది కిలోల బరువు తగ్గి తిరిగొచ్చిన మిహిర్‌కు మరో రెండు నెలల పాటు అదే డైట్ ఉపయోగించాలని సూచించినట్లు వివరించారు. ఆ తర్వాత ఆపరేషన్ చేస్తే బాగుంటుందనే నిర్ణయంతో.. ఏప్రిల్లో గ్యాస్ట్రిక్ బైపాస్ చేసినట్టు డాక్టర్ ప్రదీప్ తెలియజేశారు. ఆపరేషన్ సమయంలో చాలా శ్రమించాల్సి వచ్చింది.. నోరు, ముక్కు, ఊపరితిత్తుల్లో కొవ్వు పేరుకుపోవడంతో అనెస్తీషియా ఇవ్వడానికి ఇబ్బందులు తప్పలేదని చెప్పారు.

Doctors operate, 237kg Delhi boy, world's heaviest teenదాదాపు రెండున్నర గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతం చేసినట్లు తెలిపారు. చికిత్సలో భాగంగా మిహిర్ జీర్ణాశయంలో గ్యాస్ట్రిక్ బైపాస్ వ్యవస్థను ఏర్పాటుచేశామని వివరించారు. దీనివల్ల ఆహారం స్వల్ప మొత్తంలో తీసుకున్నా.. కడుపు నిండిన అనుభూతి ఏర్పడుతుందని తెలిపారు. ఈ శస్త్రచికిత్స తర్వాత 60 కిలోల బరువు తగ్గిన మిహిర్ ప్రస్తుతం 177 కేజీల బరువున్నాడు. అయితే, ఇది సరిపోదని.. వచ్చే ఏడాదిలోగా తన బరువు వంద కిలోల లోపు రావాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు మిహిర్ చెబుతున్నాడు. ఇందుకోసం తనకెంతో ఇష్టమైన పాస్తా, పిజ్జాలకు గుడ్‌బై చెప్పినట్లు వివరించాడు.

English Title
Doctors operate on 237kg Delhi boy, world's heaviest teen
Related News