వేరే గ్రూపు రక్తం ఎక్కించేశారు

Updated By ManamWed, 06/13/2018 - 14:14
Different Type Blood Infused
  • వైద్యుల నిర్లక్ష్యం.. చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న మహిళ

Different Type Blood Infusedకోల్‌కతా: సాధారణంగా ఏ గ్రూపు రక్తం వారికి ఆ గ్రూపు రక్తాన్నే ఎక్కించాలి. కానీ, వేరే గ్రూపు రక్తం ఎక్కిస్తే.. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఆ రక్తాన్ని స్వీకరించదు. పైగా.. ఆ రక్తకణాలను విచ్ఛిన్నం చేసేస్తుంది. తద్వారా మనిషి చచ్చిపోయే ప్రమాదముంటుంది. కోల్‌కతాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళకు ఇప్పుడు అదే దుస్థితి ఏర్పడింది. వైద్యులు ఆమెకు తప్పుడు గ్రూపు రక్తం ఎక్కించడంతో చావుబతుకులతో పోరాడుతోంది. ఈ దయనీయ ఘటన పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగింది. కడుపు నొప్పితో కోల్‌కతాలోని కొలంబియా ఏషియా ఆస్పత్రిలో చేరిన 31 ఏళ్ల వైశాఖి సాహా అనే మహిళ ఇప్పుడు చావు అంచుల్లోకి చేరుకుంది. కడుపునొప్పికి శస్త్రచికిత్స ప్రారంభించిన వైద్యులు.. పొరపాటున ‘ఏ పాజిటివ్’ రక్తానికి బదులు.. ‘ఏబీ పాజిటివ్’ రక్తాన్ని ఎక్కించారు. దీంతో రోగనిరోధక వ్యవస్థ.. శరీరంలోని రక్తకణాలను విచ్ఛిన్నం చేసేయడంతో ఆమె శరీరంలోని ఊపిరితిత్తులు, మూత్రపిండాలు సహా పలు అవయవాలు పనిచేయడం మానేశాయి. దీంతో వెంటిలేటర్ ద్వారా ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంపై ఆమె భర్త అభిజిత్ సాహా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘జూన్ 5న కడుపునొప్పితో బాధపడుతున్న నా భార్యను ఆస్పత్రిలో చేర్పించా. శస్త్రచికిత్స సందర్భంగా తప్పుడు గ్రూపు రక్తాన్ని వైద్యులు ఎక్కించారు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేయడమేగాకుండా ఎదురు తనను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆస్పత్రి బిల్లు కట్టకపోతే చికిత్సను ఆపేస్తామంటూ ఆస్పత్రి సిబ్బంది బెదిరిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే రూ.2.5 లక్షలు బిల్లు కింద కట్టామని, అయినా తప్పు చేసి కూడా ఇంకా ఎక్కువ బిల్లు కట్టాల్సిందిగా బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆయన లేఖ రాశారు. ఆరోగ్య శాఖ అధికారులు ఆయనతో మాట్లాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. అయితే, ఆ ఆరోపణలను ఆస్పత్రి వర్గాలు ఖండిస్తున్నాయి. దానికి సంబంధించిన నివేదికను త్వరలోనే విడుదల చేస్తామని చెబుతున్నాయి. కాగా, కోల్‌కతా విధాన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆస్పత్రిపై కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

English Title
Different Type Blood Infused
Related News