ఆస్ట్రేలియా చేరుకున్న ధోనీ, రోహిత్

 Rohit sharma

సిడ్నీ: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం భారత్ జట్టు అగ్రశ్రేణి ఆటగాళ్లు మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ మంగళవారం సిడ్నీకి చేరుకున్నారు. శనివారం ఉదయం 07:50 గంటల నుంచి సిడ్నీ వేదికగానే తొలి వన్డే ప్రారంభంకానుండగా.. వన్డే సిరీస్‌కి ఎంపికైన ధోనీ, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, చాహల్ తదితరులు భారత్ నుంచి బయల్దేరి మంగళవారం అక్కడికి చేరుకున్నారు. వీరితో పాటు ఇటీవల తన భార్య రితికకి పాప పుట్టడంతో చివరి టెస్టు నుంచి తప్పుకుని స్వదేశానికి వచ్చేసిన రోహిత్ శర్మ కూడా వెళ్లాడు. సోమవారం ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడిన భారత టెస్టు జట్టు ప్రస్తుతం సిడ్నీలోనే ఉన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడే భారత్ జట్టులో మంగళవారం మేనేజ్ మెంట్ ఒక మార్పు చేసింది. నాలుగు టెస్టుల సిరీస్‌తో అలసిపోయిన ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకి విశ్రాంతినిచ్చి అతని స్థానంలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కి అవకాశం కల్పించింది. ఈ మార్పు మినహా.. గతంలో సెలక్టర్లు ప్రకటించిన జట్టు అలానే ఉంది.  

భారత్ వన్డే జట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ 

సంబంధిత వార్తలు