అభివృద్ధి నీలినీడల్లో విషాద విస్థాపనలు

Updated By ManamThu, 08/09/2018 - 04:19
adivasi

imageతరతరాలుగా ఆదివాసీలు తమ అస్తిత్వాన్ని, మనుగడను కాపాడుకోవడం కోసం నిరంతరం ఉద్యమిస్తూనే ఉన్నారు. ఏ జాతి ఉనికైనా కలకాలం సజీవంగా ఉండి మనుగడ సాగించాలంటే ఆయా జాతుల సంస్కృతి సజీవంగా ఉండాలి. సంస్కృతి అంటే జాతి ఆచార వ్యవహారాలు వారి జీవన విధానం, ఆహారపు అలవాట్లు, కర్మలు, కట్టుబాట్లు, పూజలు, పండుగలు వ్యవహారిక విధానాలు, భాష, పైన తెలిపిన సంస్కృతి ఇతరులతో పోలిస్తే ఆదివాసులలో భిన్నంగా కనిపిస్తుంది. భారతదేశంలో చారిత్రాత్మకమైన ప్రాచీన ఆదివాసీ నాగరికత, సంస్కృతి విధ్వంసానికి, వివక్షకు గురికాబడింది. నేటికీ అదే దుస్థితి నెలకొని ఉంది.
హరప్ప, మొహంజదారో వంటి గొప్ప నాగరికతల వలె విరాజిల్లిన ఆదివాసీ నాగరికత, రాజ్యాలు, సంస్కృతి ఆర్యులు, మొగలులు వలసలతో విధ్వంసానికి గురికావడం మొదలైంది. మనిషికి ఆధారం అస్తిపంజరం వలె జాతులు మనుగడకు సంస్కృతి అస్తిత్వంగా నిలుస్తుంది. ఏ జాతికైనా ఆత్మాభిమాన పోరాటాలు హక్కుల సాధన కోసం ఉపయోగపడతాయి. ఆత్మాభిమానానికి మూలకారణం కూడా సంస్కృతినే! అందుకే ప్రత్యక్షంగా తలపడలేని శత్రువు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాడు. నాడు మరాఠా రాజులు గోండ్వానా రాజ్యాన్ని కొల్లగొట్టడంలో ఉపయోగించిన సూత్రం, నేడు హక్కుల పోరాటంలో ఆదివాసులను అణిచివేయడంలో ప్రభుత్వాలు ఉపయోగించే సూత్రాలు ఇవే. అందుకే ప్రభుత్వాలు అంతరిస్తున్న ఆదివాసీ సంస్కృతిని పరిరక్షించడంలో చిత్తశుద్ది చూపడంలేదు. ఆదివాసీ సంస్కృతికి ప్రతీక అయిన పండుగలపై నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఆదివాసులను కేవలం ఓటుబ్యాంకుగా వాడుకుంటూ, ఆదివాసుల హక్కులు, చట్టాలను గాలికి వదిలేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో ప్రాజెక్టులు, గనుల తవ్వకాలు, పరిశ్రమల ఏర్పాటు చేసి ఆదివాసులను నిర్వాసితులుగా మారుస్తున్నారు. 70 సంవత్సరాల స్వాతంత్య్ర భారతంలో రాజ్యాంగ ఫలాలు ఆదివాసులకు అందని ద్రాక్షగానే ఉన్నాయి. సమాన హక్కుల కోసం, ప్రత్యేక పాలనకు, సంస్కృతిని కాపాడుకోవడానికి, తన మనుగడను రక్షించడంకోసం ఆదివాసీ తన అస్తిత్వపు పోరును నేటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. చివరికి ఆదివాసుల బతుకులు పోరాటాలతోనే తెల్లారుతున్నాయి. 

ఇలాంటి దుస్థితి భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం ఉన్న ఆదివాసుల బతుకులు ఇంతే. ఈ పరిస్థితులను గమనించిన ఐక్యరాజ్యసమితి 1984లోనే ఆదివాసుల స్థితిగతులపై, జీవన విధానాలపై సమగ్ర అధ్యయనానికి ఆదేశాలు ఇచ్చింది. అనేక మంది పరిశోధకులు, మేధావులు, పెద్దలు ఇప్పటికీ ఆదివాసులు వారి హక్కులు కోల్పోయి, వారి జీవన విధానాలకు దూరం అవుతున్నారని సూచించారు. వీటిని ఆధారంగా చేసుకొని 1993లో జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఆదివాసులను కాపాడటానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. ఆ దిశగా ఆదివాసులను చైతన్యం చేయడం కోసం ఆదివాసులకు ఒకరోజును గుర్తించింది. అదే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఐక్యరాజ్య సమితి 1994 నుంచి ఆగస్టు 9ని అధికారికంగా ఆదివాసీ దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తుంది. నిజంగా ఆదివాసీ చట్టాలను సంపూర్ణంగా అమలు చేసినప్పుడు, ఆదివాసీ గూడేలలో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, కరెంటు, రహదారి సౌకర్యాలు కల్పించినప్పుడు, ఆదివాసీ సంస్కృతిని గుర్తించి, పాఠ్యాంశంలో చేర్చి, ఆదివాసీ పండుగలకు సెలవు దినాలు ప్రకటించినప్పుడు, ఆదివాసీ యువతను ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగల్గినప్పుడు, ఆదివాసులు స్వయంగా వారి ప్రాంతాన్ని వారు మాత్రమే పరిపాలించే అవకాశం దక్కినప్పుడు ఆదివాసులకు నిజ మైన కన్నుల పండుగ అవుతుంది. అప్పుడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9 ఉద్దేశ్యం నెరవేరుతుంది. 
 కుంజా శ్రీను
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఆదివాసీ సంక్షేమ పరిషత్ - ఏపీ
7995036822

Tags
English Title
Development of tragic disturbances in blueberries
Related News