డేరా బాబా దోషి

dera baba
  • జర్నలిస్టు హత్య కేసులో కోర్టు తీర్పు

  • మరో ఇద్దరు కూడా దోషులే..

  • అత్యాచారం కేసులో ఇప్పటికే జైలులో గుర్మీత్

న్యూఢిల్లీ: డేరా బాబా గుర్మీత్‌సింగ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీంతో పాటు మరో ముగ్గురిని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. కేసులో ఈ నెల 17వ తేదీన శిక్ష తీర్పును వెలవరించనున్నట్లు పేర్కొంది. గుర్మిత్ సింగ్ మహిళల వేధింపుల గురించి జర్నలిస్ట్ రామచంద్ర 2002లో ప్యూర్ సచ్ఛ్ న్యూస్ పేపర్‌లో వార్తా కథనాలు రాశాడు. ఈ వార్తా ప్రచురణ అనంతరం అతడు హత్యకు గురయ్యాడు. దర్యాప్తులో గుర్మీత్ సింగ్ ప్రధాన కారకుడిగా ఉన్నట్లు తేలింది. కేసు విచారణ చేపట్టిన పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు జర్నలిస్ట్ హత్య కేసులో గుర్మీత్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని దోషులుగా తేల్చుతూ శుక్రవారం తీర్పును వెలువరించింది. కాగా తన ఇద్దరు మహిళా అనుచరులను అత్యాచారం చేసిన కేసులో గుర్మిత్‌సింగ్ ఇప్పటికే జైలు జీవితం గడుపుతున్నాడు. 2002లో సిర్సాకు చెందిన జర్నలి స్టు రాంచందర్ ఛత్రపతిని హత్య చేసినందుకు గాను గుర్మీత్‌పై కేసు నమోదు అయ్యింది. తీర్పు నేపథ్యంలో పంచకుల, హరియాణా ప్రాంతా ల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ కేసు విచారణకు దోషులుగా తేలిన ముగ్గురు వ్యక్తులు న్యాయస్థానానికి హాజరయ్యారు. కాగా గుర్మీత్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యాడు. ప్రస్తుతం గుర్మీత్ అత్యాచారం కేసులో 20ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. హరియాణాలోని రోహ్‌తక్ సునారియా జైల్లో ఖైదీగా ఉన్నాడు. అత్యాచార కేసు తీర్పు సమయంలో పంచకులలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకొని 40 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పంచకులతో పాటు పలు ప్రాంతాల్లో శుక్రవారం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

అసలు కేసు ఏమిటంటే..
డేరా ఆశ్రమంలో గుర్మీత్ చేస్తున్న ఆక త్యాలను ‘పూరా సచ్’ వార్తాపత్రికకు చెందిన జర్నలిస్టు రాంచందర్ ఛత్రపతి వెలుగులోకి తీసుకొచ్చారు. ఆశ్రమానికి వచ్చిన మహిళలను లైంగికంగా వేధిస్తూ, వారిపై అత్యాచారాలకు ఒడిగడుతున్నట్లు ఛత్రపతి వార్తలు రాసుకొచ్చాడు. దీంతో అక్టోబరు 24, 2002న ఛత్రపతిని ఆయన ఇంట్లోనే దారుణంగా కాల్చి చంపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్మీత్‌తో పాటు ఆయన అనుచరులు కుల్దీప్‌సింగ్, నిర్మల్ సింగ్ ఉన్నారు. కృషన్‌లాల్‌కు చెందిన రివాల్వర్‌తో కుల్దీప్, నిర్మల్.. జర్నలిస్టును హత్య చేశారు. 2003లో వీరందరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణను 2006లో సీబీఐ చేతికి అప్పగించారు. అప్పటి నుంచి కొనసాగిన ఈ కేసు విచారణలో శుక్రవారం తుది తీర్పు వెలువడింది. ఈ కేసు విచారించిన న్యాయస్థానం గుర్మీత్‌తో పాటు కుల్దీప్, నిర్మల్, కృషన్‌ను దోషులుగా తేల్చింది.

Tags

సంబంధిత వార్తలు