క్రొయేషియా కొట్లేసింది

Updated By ManamFri, 07/13/2018 - 00:26
Croatia
  • ఫైనల్‌కు చేర్చిన మారియో మండ్జుకిక్.. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ఓటమి

  • ప్రపంచంలో జనాభా పరంగా చాలా చిన్న దేశం క్రొయేషియా. కానీ ఈ వరల్డ్ కప్‌లో పెద్ద జట్లతో కొదమ సింహంలా తలపడింది. జనాభా పరంగానే కాకుండా ర్యాంక్‌ల పరంగా కూడా  క్రొయేషియా చిన్నదే. అయితే తొలిసారి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం క్రొయేషియా ర్యాంక్ 20. గతంలో అంటే 1950 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరిన చిన్న దేశంగా ఉరుగ్వే చరిత్ర సృష్టించింది. 68 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్‌కు చేరిన చిన్న దేశంగా క్రొయేషియా రికార్డుల్లోకెక్కింది. 

Croatiaమాస్కో: మారియో మండ్జుకిక్.. ఈ పేరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. ఎందుకంటే ర్యాంక్‌లో మాత్రమే కాకుండా జనాభా పరంగా చిన్న దేశమైన క్రొయేషియాను మారియో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు చేర్చాడు. బుధవారం అర్ధ రాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో క్రొయేషియా 2-1తో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకుంది. నిర్ణీత సమయానికి క్రొయేషియా, ఇంగ్లాండ్ జట్లు 1-1 స్కోరుతో సమంగా నిలిచాయి. కానీ జువెంటస్ ఫార్వర్డ్ మారియో ఎక్స్‌ట్రా టైమ్‌లో (109వ నిమిషంలో) ఊహించని గోల్ చేయడంతో క్రొయేషియా జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఇంగ్లాండ్ తీవ్ర నిరాశతో వెనుదిరిగింది. 

అంతకుముందు కీరాన్ టిప్పీర్ 5వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్‌ను గోల్‌గా మలచడంతో ఇంగ్లాండ్‌కు 1-0తో తొలి ఆధిక్యం లభించింది. అభిమానుల కేకలతో స్టేడియం దద్దరిల్లింది. ఈ గోల్‌తో 1966లో ఇంగ్లాండ్ తొలిసారి వరల్డ్ కప్ గెలిచినట్టు ఈసారి కూడా ఫైనల్‌కు చేరుకుని టైటిల్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వెనకబడిన క్రొయేషియా రెండో అర్ధ భాగంలో గర్జించిన సింహంలా ఇంగ్లాండ్ గోల్ బాక్స్‌పై దాడిచేసింది. 68వ నిమిషంలో వర్సాల్కో ఇచ్చిన లాంగ్ పాస్‌ను ఇవాన్ పెర్సిక్ అద్భుతమైన గోల్ చేయడంతో స్కోరు 1-1తో సమమైంది. తర్వాత ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. కానీ ఎక్స్‌ట్రా టైమ్‌లో మారియో గోల్ చేయడంతో క్రొయేషియా ఫైనల్‌కు చేరుకుంది. మొత్తానికి ఫ్రాన్స్‌కు ఎక్కువ లాభం చేకూరిందని చెప్పాలి. ఎందుకంటే మంగళవారం ఫ్రాన్స్ 1-0 తో బెల్జియంను ఓడించిన తర్వాత వచ్చే ఆదివారం ఫైనల్ ఆడేందుకు ఆ జట్టుకు చాలినంత సమయం లభించింది. కానీ క్రొయేషియాకు అది పెద్ద విషయమేమీ కాదు.  

28 ఏళ్ల తర్వాత తొలిసారి సెమీఫైనల్‌కు చేరిన ఇంగ్లాండ్ జట్టు చరిత్ర సృష్టించాలని ఆశించింది. సెమీస్‌కు చేరే క్రమంలో లీగ్స్‌లో పెద్ద జట్టు జర్మనీని ఇంగ్లాండ్ ఓడించింది. నాకౌట్‌లో పెనాల్టీ శాపాన్ని కూడా తప్పించుకుని కొలంబియాపై షూటౌట్‌లో గెలిచింది. సెమీస్‌లోనూ అలాంటిదే పునరావృతమవుతుందని భావించింది. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో డెన్మార్క్, రష్యాలపై పెనాల్టీస్‌తో గెలిచిన క్రొయేషియా ఆటగాళ్లు ఇంగ్లాండ్ ఆటగాళ్ల అంచనాలను తారుమారు చేశారు. ఇంగ్లాండ్ కోచ్ గారెత్ సౌత్‌గేట్ ఆశలను అడియాశలు చేశారు. క్వార్టర్ ఫైనల్లో స్వీడన్‌పై గెలిచిన జట్టునే సౌత్‌గేట్ సెమీస్‌లోనూ ఆడించాడు. కాగా క్రొయే షియా మాత్రం జట్టులో ఒక మార్పు చేసింది. ఇంటర్ మిలాన్‌కు చెందిన మార్సెలో బ్రజోవిక్ బదులు ఆండ్రెజ్ క్రమరిక్‌ను బరిలోకి దించింది. 

స్ఫూర్తిదాయక ఆట గాడు లూక్ మొడ్రిక్ గేమ్‌ను కంట్రోల్ చేస్తాడని క్రొయేషియా భావించింది. కానీ తమ పెనాల్టీ ఏరియాకు ముందు మొడ్రిక్ అనవసరంగా ఇంగ్లండ్ ఆటగాడిని అడ్డుకోవడంతో ఐదో నిమిషంలో రెఫరీ ఫ్రీ కిక్ ఇచ్చాడు. దీంతో ట్రిప్పీర్ ఇంగ్లాండ్‌కు తొలి ఆధిక్యం అందిం చాడు. 25 గజాల దూరం నుంచి ట్రిప్పీర్ అద్భుతమైన కర్లింగ్ షాట్‌తో బంతిని క్రొయేషియా గోల్ బాక్స్‌లోకి పంపాడు. ఇలా జరుగుతుందని బహుశా ఇంగ్లాండ్ కూడా ఊహించివుండదు. తర్వాత జ్లాట్కో డాలిక్ సేన నెమ్మదిగా పుంజుకుంది. అయినప్పటికీ తొలి అర్ధ భాగంలో ఒక్క గోలే నమోదైంది. ఇక రెండో అర్ధ భాగంలో క్రొయేషియా తన వ్యూహం మార్చింది. 68వ నిమిషంలో క్రొయేషియా గోల్ చేయడంతో అభిమానుల కేకలతో లూజ్నికి స్టేడియం దద్దరిల్లింది. సిమి వర్సాల్కో రైట్ వింగ్ నుంచి ఇచ్చిన క్రాస్ పాస్‌ను ఇంగ్లాండ్ గోల్ బాక్స్ వద్దే ఉన్న పెర్సిక్ తన కాలు అడ్డం పెట్టి గోల్ సాధించాడు. దీన్ని ఇంగ్లాండ్ గోల్ కీపర్ ఫిక్‌ఫోర్డ్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు, కానీ అప్పటికే ఆలస్యమైంది. అప్పటి వరకు సౌకర్యవంతంగా ఉన్న ఇంగ్లాండ్ యువసేన తర్వాత కంగారు పడి వేగం పెంచిం ది. అయినా గోల్ సాధించ లేక పోవడంతో ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది. చివ రికి మారియో గోల్ చేయ డంతో క్రొయేషియా జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఆదివారం జరగనున్న ఫైన ల్లో ఫ్రాన్స్‌తో క్రొయేషియా తలపడుతుంది. 

గోల్స్ వీరులు
5వ నిమిషంలో ట్రిప్పీర్ (ఇంగ్లాండ్)
68వ నిమిషంలో పెర్సిక్ (క్రొయేషియా)
109వ నిమిషంలో మారియ మండ్జుకిక్ (క్రొయేషియా)

వరల్డ్ కప్ విశేషాలు
గతంలో ఏ జట్టు కూడా ఎక్స్‌ట్రా టైమ్ ద్వారా ఫైనల్‌కు చేరుకోలేదు
1990లో ఇంగ్లాండ్ జట్టు రెండుసార్లు ఎక్స్‌ట్రా టైమ్‌లో మ్యాచ్ గెలిచింది. కానీ సెమీఫైనల్లో వెస్ట్ జర్మనీ చేతిలో ఓడింది

Tags
English Title
Croatia is broken
Related News