సాహిత్య వికాసానికి విమర్శ తప్పనిసరి

Updated By ManamMon, 10/15/2018 - 05:05
Sahithya_logo

సమకాలీన సాహిత్య సంద ర్భంలో విమర్శనా ప్రక్రియ క్రమంగా కనుమరుగవు తోంది. సాహిత్యంలో విమర్శకి వున్న ప్రాధాన్యత ఏమిటి.
Sahithya‘సమకాలీన సాహిత్య సందర్భంలో విమర్శనా ప్రక్రి య క్రమంగా కనుమరుగవుతోంది’- అనడం సము చితంగా, సమంజసంగా లేదు. ఏ కాలంలో అయినా, ఏ దేశంలో అయినా, ఏ భాషలో అయినా సృజనాత్మక సాహిత్యానికే పెద్దపీట, గురుపూజ. సృజనాత్మక రచనల్ని విశ్లేషించే విమర్శకు మలిపూజే! సృజనాత్మక సాహిత్యం తన కాల్పనికత, భావాత్మకత, తాజాతనం వల్ల భావి పాఠకుల్ని చాలా త్వరగా ఆకట్టుకొంటుంది. అందరి హృ దయాల్లో దూరేవాడు కవి అయితే, కవి హృదయంలో దూరేవాడు విమర్శకుడు అని ‘సాక్షి’ వ్యాసాల కర్త పా నుగంటి వారన్నట్లు విమర్శకుడు కవి భావుకతతో పాటు, అతనికంటే బౌద్దికంగా కొన్ని మెట్లు ఎత్తులోనే వుంటాడు; రెండాకులు ఎక్కువే చదివి వుంటాడు; వుండాలి. సృజనాత్మక రచనలు వెలువడేంత  వేగంగా విమర్శనలు రూపుదాల్చలేవు. పైగా సృజనాత్మక సాహి త్యానికి పత్రికలు కానీ, ప్రచురణ సంస్థలు కాని ఇచ్చి నంత ప్రాథమికతనూ, ప్రాధాన్యాన్నీ విమర్శనా ప్రక్రి యకివ్వవు. సృజనాత్మక సాహిత్య పాఠక ప్రపంచమూ విపులమే, విశాలమే. కానీ విమర్శనా జగత్తూ పరిమి తం, పాఠక సముదాయమూ మరింత సీమితం. సృజన శీల రచయితలకు పూలదండలూ, విమర్శకులకు అక్షింత లూనూ! సృజనశీలి కంటే విమర్శకునికి అధ్యయనం విస్తారంగా, లోతుగా, చారిత్రకంగా, సమకాలికంగా, పుష్కలంగా వుండి తీరాలి. ఇన్ని కారణాల వల్ల విమర్శ ప్రక్రియ సృజనాత్మక సాహిత్యంతో పోలిస్తే ఉత్పత్తి లోనూ, ప్రాచుర్యంలోనూ సార్వకాలికంగా, సార్వదేశి కంగా ఎప్పుడూ తక్కువగానే వుంటుంది. కానీ క్రమంగా కనుమరుగయ్యే దుస్థితి మటుకు దానికి దాపురించదు. 

సాహిత్యంలో విమర్శకు ప్రాధాన్యం వుండనే వుంటుంది. సృజనశీలి రచయిత రంగస్థలం మీద రారా జిల్లుతుంటే, విమర్శకుడు అలా కాకుండా తెర వెను కనో, రంగస్థలం పక్కనో వుంటూ రచయితలు దారి తప్పకుండా హెచ్చరికలు చేస్తుంటారు. సామాన్య కవికి లభించే గౌరవ సత్కారాలూ, మర్యాదా మన్ననలూ విశిష్ట విమర్శకునికి కూడా లభించడం కష్టం; 1977లో ప్రఖ్యాత విమర్శకులైన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మకు బెంగళూరులో అభినందన సత్కారంతోపాటు అభినం దన గ్రంథం సమర్పిస్తున్నామంటే విఖ్యాత విద్వాం సులు డాక్టర్ తిమ్మావజ్జల కోదండరామయ్య ఇదే మా టను వాడిగా, వేడిగా అన్నారు. విమర్శ సృజనాత్మక రచనల్ని సూచీముఖంగా పరిశీలించి, రచయితలకు దిశా నిర్దేశం చేస్తుంది. అలా చేసిన సందర్భాలు కొన్ని వున్నాయి. భావ కవిత్వంపై అక్కిరాజు ఉమాకాంతం పంతులు, దిగంబర కవిత్వంపై రాచమల్లు రామచంద్రారెడ్డి ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాల ప్రభావం తక్కువేమీ కాదు. ఇక, కట్టమంచి, రాళ్ళపల్లి, వేటూరి ప్రభాకర శాస్త్రి, డాక్టర్ శ్రీపాద గోపాల కృష్ణమూర్తి (కృష్ణశ్రీ), ఆర్.ఎస్. సుదర్శనం, కె.వి.ఆర్. మొదలైన సునిశిత విమర్శకుల ప్రాముఖ్యం గురించి వొత్తి చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఏ సాహిత్య చరిత్రలో కానీ గొప్ప సృజనాత్మక రచయితలకు దీటుగా స్థానం సంపాదించుకున్న విమర్శ కవరేణ్యులు తక్కువే. ‘... సాహిత్యంలో సాహిత్యంతో సమానమైన ప్రాధాన్యం సాహిత్య విమర్శకు కూడా ఉంటుంది.’ అన్న రాచపాళెం చంద్రశేఖర రెడ్డి అభిప్రా యంతో (మన సాహితి, మనం -  ఆగస్టు 13 సంచిక) ఏకీభవించడం కష్టం. అయితే మహా రచయితల ఎత్తున అందుకోలేకున్నా, కాసింత తక్కువ ఎత్తుగా వున్నా, ఎంతో ఎతైన విమర్శగ్రేసురులు మనకు లేకపోలేదు. కాకతమ్మకు ఏకవీర సైదోడు అని పేరుగాంచిన ఏకవీర కాకతమ్మ కంటే కాసింత తక్కువే. విమర్శకుడూ అంతే.

నేడు వివిధ రచనలపై సమీక్షలే ప్రబలంగా కనపడు తున్నాయి. గ్రంథ సమీక్షలన్నీ ఒక విధంగా సాహితీ విమర్శలవుతాయి. కానీ, కేవలం సమీక్షలు మాత్రమే సాహితీ విమర్శలు కావు...కేవలం సమీక్షలే సాహితీ విమర్శకి ప్రాసంగికతని తేగల్గుతాయా? విమర్శను రచయితలు తమ కీర్తికి అడ్డంకిగా ఎందుకు భావిస్తున్నారు?
నేటి పత్రికల్లో వివిధ రచనలపై సమీక్షలే ప్రబ లంగా కనడుతున్నాయనడం బేసబబు. సమీక్షలు అక్క డక్కడ మాత్రమే వెలువడుతున్నాయి. అంతేకాని అవి ప్రబలంగా లేనేలేవు-దుర్బలంగా, క్షీణంగా వున్నాయ నడం వాస్తవం. ‘గ్రంథ సమీక్షలన్నీ ఒక విధంగా సాహి తీ విమర్శలవుతాయి కానీ కేవలం సమీక్షలు మాత్రమే సాహితీ విమర్శలు కావు. ..’ ఈ వాక్యంలోని ‘ఒక విధంగా’ అనే పదమూ, ‘కేవలం’ అనే మాటా లేనిపోని అనర్థాలకూ, అపార్థాలకూ దారితీస్తాయి. సమీక్ష, విమర్శ పదాలకున్న వ్యత్యాసాన్ని మొదట అవగాహన చేసు కోవాలి. లోగడ ఎంతోమంది విమర్శకులు, సమీక్షకులు ఈ రెండింటి స్వరూప స్వభావాల గురించి ఎంతగానో చర్చించారు. కానీ ఒక నిశ్చిత అభిప్రాయానికి రాలేక పోయారు. ‘సమీక్ష’ అంటే  ఓ పుస్తకం వెలువడిన తర్వా త ‘దానిని స్థూలంగా పరిచయం చేసేది’ అన్న అభి ప్రాయం వెలిబుచ్చారు. (రాచపాళెం, మన సాహితి, మనం, ఆగస్టు 13వ తేది) కానీ సమీక్ష అంటే సమ్యక్- సమగ్రమైన, సరైన చూపు, దృష్టి అని అర్థం చేసుకో వటం సమంజసం. అలా కాకుండా పరిచయం -అందు లోనూ ఓ రచన ‘స్థూల పరిశీలన’ అన్న భావనను ‘సమీక్ష’కు కల్పించడం భావ్యం కాదు. ‘సమీక్ష’ అన్న పదం లోతైన విశ్లేషణను తలపింప చేస్తుంది. ఈ నిండా రు అర్థానికి ‘సమీక్ష’ పదం బరువైతే సింపిల్‌గా పరిచ యం - పుస్తక పరిచయం అని వాడొచ్చుగా! దిన పత్రి కల సాహిత్యానుబంధాల్లోనూ, మాస, త్రైమాస సాహి త్య పత్రికల్లోనూ వెలువడే సమీక్షకులకూ, పాపులర్ - కాలక్షేపం మరమరాల్లాంటి వార పత్రికల్లోని ‘సమీక్షకు ల’కూ తేడా వుంటుంది; వుండి తీరాలి కూడా. వార పత్రికలు సామాన్య పాఠకులకు కాలక్షేపం, ఆహ్లాదం కలిగించడానికి వుద్దేశించినవి. 

అందువల్ల వారపత్రికల్లో సామాన్య పాఠకుల్ని దృష్టిలో వుంచుకొని ఓ నవలో, కథా సంకలనమో, నాటికల సంకలనమో వగైరాలను స్థూలంగా పరిచయం చేయడం జరుగుతుంది. ఇలాంటి మరమరాల పత్రికల్లో ఓ సాహిత్య రచననో, విమర్శనా గ్రంథాన్నో లేదా పరిశోధనా గ్రంథాన్నో, శాసనాల సంపుటినో పరిచయం చేయడం తగింది కాదు. వీటి పాఠకులు ప్రబుద్ధులై ఉండాలి, సీరియస్ పాఠకులై వుండాలి. పైగా వీటిని సమీక్షించే వారు కూడా ఆయా సాహిత్య ప్రక్రియల్లో ప్రవీణులై వుండాలి. పేరు మోసిన సాహిత్య పత్రికలు వివిధ సాహిత్య ప్రక్రియల్లో నిష్ణాతులైన విద్వాంసుల జాబితా వుంచుకొని యోగ్యు లైన వాళ్లకు పంపేవి. ఇది ఒకనాటి పరిపాటి, సంప్రదా యం, ఆనవాయితీనూ. కానీ నేడవన్నీ గంగలో కలిసి పోయాయి. సమీక్షించాల్సిన పుస్తకాలు ఒకనాడు సమీ క్షకుల గడపల ముందు వచ్చి వాలేవి. కానీ ఇప్పుడు సమీక్షకులే (?!) పత్రికల కార్యాలయాలకు వెళ్లి తెచ్చుకో వాల్సిన దుస్థితి దాపురించింది. ఆ రోజుల్లో పండితులు తమకు పట్టులేని ప్రక్రియలకు సంబంధించిన పుస్తకాల్ని తాకేవాళ్ళు కూడా కారు. నేడో మరి? కథ అడ్డం తిరి గింది. అందరూ అన్ని రకాల పుస్తకాల్ని సమీక్షించేవారే! పూర్వ సమీక్షకులు ఎంతో బాధ్యతతో సమీక్ష చేసేవాళ్ళు. ప్రస్తుతం ఎలాటి కష్టం లేకుండా, ఉబుసుపోకకై సమీక్షల పేరిట పుస్తక పరిచయాలు చేస్తూ, పత్రికల్లో తమ పేరు చూసుకొని మురిసిపోతుంటారు. ఇక ఆ సాహిత్యం పేజీ పర్యవేక్షించే, నిర్వహించే మహనీయులు ‘పుస్తక సమీక్ష’ శీర్షికను బలవంతపు మాఘస్నానంలా ముగించి, కొంత మందికి సమీక్ష చేసే సౌభాగ్యం కల్పించి స్వామికార్యం, స్వకార్యం పూర్తి చేసి ధన్యులమనుకుంటారు. 

‘గ్రంథ సమీక్షలన్నీ ఒక విధంగా సాహితీ విమర్శల వుతాయి’ అని చెప్పటమూ భావ్యం కాదు. ఎందుకంటే ‘సమీక్ష’ల పేరిట చాలామంది వొట్టి పుస్తక పరిచయాలే చేస్తారు, చేస్తున్నారు. అలాంటప్పుడు ఆ పుస్తక పరిచ యాలు పుస్తక సమీక్షలనిపించుకో లేవు. 50-60 ఏళ్ళ క్రితం, ఇంకా వెనక్కిపోయినా పోవచ్చు. భారతి, ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ దినపత్రికల సారస్వతానుబంధాల్లో నిడదవోలు వెంకటరావు, శాక్యసింహ (నాగళ్ళ గురు ప్రసాదరావు), వేదం వెంకటరాయశాస్త్రి (జూనియర్), టి.ఎల్. కాంతారావు, శ్రీవాత్సవ మొదలైన సాహితీ వేత్తల పుస్తక సమీక్షలకు విమర్శ స్థాయి వుండేది. ‘కేవలం సమీక్షలు మాత్రమే సాహితీ విమర్శలు కావు’ - ఈ మాట నిజమే. కానీ ఈ మాటకు అపవాదాలు కూడా వున్నాయి. రారా గారి ‘సారస్వత వివేచన’లోని విమర్శనా వ్యాసాల్లో చాలా మటుకు పుస్తక సమీక్షలే. తిలక్‌గారి ‘అమృతం కురిసిన రాత్రి’ మీద రా.రా. చేసిన సమీక్ష- ‘తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించు కున్న స్వాప్నికుడు’- తిలక్ కవితా ధర్మాన్నీ, కవితా సౌందర్యాన్నీ చక్కగా వివరించడంతోపాటు, భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం లక్షణ స్వరూపాల్ని అతి స్పష్టంగా నిరూపించ గలిగింది. తిలక్‌ను అభ్యుదయ కవిగా భావించిన కె.వి.ఆర్. టి.ఎమ్.ఆర్. లు కూడా తిలక్ పట్ల తమ అభిప్రాయాల్ని మార్చుకున్నారీ పుస్తక సమీక్ష చదివిన తర్వాత. అలాగే కె.వి. ఆర్. గురజాడపై రాసిన ఉద్గ్రంథం ‘మహోదయం’ను సమీక్షిస్తూ రా.రా. రాసిన వ్యాసం - ‘గురజాడ మీద విజ్ఞాన సర్వస్వం’ కె.వి. రమణారెడ్డి గారి విషయ సేకరణ విధానం, విష యాన్ని వెలిబుచ్చే పద్ధతి, భాషా శైలుల గురించి చాలా లోతుగా, సూక్ష్మంగా, ఎలాంటి ములాజా మొహ మాటాలు లేకుండా చేసిన అత్యంత శక్తిమంతమైన, ప్రభావకారి అయిన సమీక్షాదర్శం. పుస్తక సమీక్షకు, పుస్తక విమర్శ స్థాయిని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళిన పుస్తకసమీక్షకుడు, విమర్శకుడు రా.రా. ది గ్రేట్! ఇలాం టి సన్నివేశాల్నీ సందర్భాల్నీ సీరియస్‌గా గమనించి, పరిశీలించినప్పుడు మాత్రమే మనం పుస్తక సమీక్షలు కూడా సాహితీ విమర్శకు ప్రాంసంగికతను తేగలుగు తాయని చెప్పగలం. అయితే ఇలాంటి విశిష్ట సందర్భా లు ఏ సాహిత్యంలోనూ అపురూపమే. ప్రసిద్ధ విమర్శ కుడు ఎఫ్.ఆర్. లీవిస్ ‘స్క్రూటినీ’ అనే సమీక్ష పత్రికకు సంపాదకత్వం వహించి ఎన్నో కావ్యాల్ని, కవితా సంకల నాల్ని సమీక్షించి వాటికి విమర్శనా స్థాయిని సంతరించి పెట్టాడు. అది మరో చరిత్ర! పుస్తక సమీక్షకులు వాటిని మధించి, రోమంథం చేసి, ఆచరించదగ్గ విషయం అది.  

విమర్శను తను కీర్తి ప్రతిష్ఠలకు అడ్డంకిగా భావించే రచయితలు అన్ని దేశాల్లోనూ, అన్ని భాషల్లోనూ వున్నారు, వుంటారు కూడా. ఎందుకంటే సాధారణంగా రచయితలు తమ రచనల గురించి ప్రశంసల్నే ఆశిస్తారు; ఆదరిస్తారు. కొంతమంది గొప్ప రచయితలు తమ రచన లపై వచ్చిన విమర్శల్ని గమనించి, కొన్నింటిని పురస్క రించి, మరికొన్నింటిని తిరస్కరిస్తారు. ఇంకొందరు రచ యితలు తాము అసలు ఎవరి విమర్శల్ని పట్టించుకో మనీ, అసలు పత్రికల్నే చూడమనీ బుకాయించడమూ కద్దు. కొంతమంది రచయితలు తమ పుస్తకాల గొప్ప తనం పట్ల ఎవరైనా సందేహం వ్యక్తం చేసినప్పుడు, లిఖిత రూపంలో ప్రకటించినప్పుడు ఆ విమర్శలు కుత్సిత మైనవనీ, ద్వేషపూరితమైనవనీ భావిస్తూ, వాటిని ఈసడిస్తారు; శపిస్తారు. ఇలాంటి పెద్దమనషు లుగా భావింపబడే, గౌరవింపబడే రచయితలే విమర్శ ను తమ కీర్తికి అడ్డంకిగా భావిస్తారు. మన సాహిత్యంలో కొంతమంది మహా (?!) రచయితలకు భక్తకూటములు, భజన మందిరాలు, ఏర్పడి తమ గురుపాదుల్నీ, కవి కులగురువుల్నీ విమర్శించిన వాళ్ళపై బెదిరింపులకూ, దాడులకూ పాల్పడడమూ చూస్తున్నాం. ‘విమర్శ రచయిత కీర్తికి అడ్డంకి అనుకోవడం పొరపాటు. విమర్శ కులు రచనను సరిగా అర్థం చేసుకున్నారా? సరిగా వ్యాఖ్యానించారా? అన్నది ప్రధానం గానీ, రచయితను కీర్తించాలా లేదా అన్నది ప్రధానం కాదు’- రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారన్న  మాటలు అక్షరలక్షలు చేసేవే. కానీ నేటి విమర్శకుల్లో చాలామంది రచయితలకు భుజకీర్తులు, కిరీటాలు, గండపెండేరాలు తొడిగిం చేందుకే ప్రయత్నిస్తున్నారు కానీ క్షీరనీర న్యాయం చేసే విమర్శక హంసలుగా వుంటున్నారా?
(ఇంకా వుంది)
 ఘట్టమరాజు
09964082076 

Tags
English Title
Criticism for literary development is mandatory
Related News