ఎమ్మార్పీని నియంత్రించే చట్టం రావాలి

Updated By ManamWed, 06/13/2018 - 00:56
prathipati
  •  లీటర్ నీళ్ల బాటిల్‌పై రూ.100 ముద్ర వేస్తున్నారు.. చట్టాల్లోని లొసుగులతో వ్యాపారుల ఇష్టారాజ్యం

  • దీనికి అడ్డుకట్ట వేయాలి: మంత్రి ప్రత్తిపాటి..ఆరేళ్ల తర్వాత వినియోగదారుల రక్షణ మండలి భేటీ

imageవిజయవాడ: ఎమ్మార్పీని నియంత్రించేలా కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న చట్టాల్లోని లొసుగులను వాడుకుంటూ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వినియోగదారుల హక్కులను హరిస్తూ.. వారిని దోచుకుంటున్నారని అన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేలా కొత్త చట్టం రావాలని ఆకాంక్షించారు. దాదాపుగా ఆరేళ్ల తర్వాత మంగళవారం అమరావతిలో వినియోగదారుల రక్షణ మండలి సమావేశమైంది. మంత్రి ప్రత్తిపాటి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో వినియోగదారుల హక్కుల రక్షణ, ఆహార నాణ్యతపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరేళ్ల తరవాత తొలిసారిగా తన హయాంలో వినియోగదారుల రక్షణ మండలి సమావేశం జరిగిందన్నారు. ప్రతిభ కనబర్చే వినియోగదారుల రక్షణ మండలి సభ్యులకు వచ్చే డిసెంబర్‌లో అవార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

నాణ్యమైన ఆహారం అందేలా ఫుడ్ కంట్రోల్ బోర్డును పౌర సరఫరాల శాఖ క్వాలిటీ కంట్రోల్ కిందకు తీసుకొస్తున్నామన్నారు. ముఖ్యంగా జిల్లాకో ల్యాబ్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూమి కేటాయిస్తే, కేంద్ర ప్రభుత్వమే రూ.50 లక్షల వ్యయంతో ప్రయోగశాల నిర్మిస్తుందన్నారు. ల్యాబ్‌ల ఏర్పాటుతో సరుకుల నాణ్యతపై తక్షణమే పరీక్షలు నిర్వహించడానికి వీలుకలుగుతుందన్నారు. రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా గుర్తింపుల్లేని వాటర్ ప్లాంట్లు నెలకొల్పుతున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. పండగ రోజుల్లో ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తోందని, దీనివల్ల పేదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండలి సమావేశం దృష్టికి సభ్యులు తీసుకొచ్చారని చెప్పారు. మధ్యాహ్న భోజనం పథకం అమలులో భాగంగా అక్షయపాత్ర సంస్థ విద్యార్థులకు కోడిగుడ్లు పంపిణీ చేయడంలేదని సభ్యులు తెలిపారన్నారు. దీనిపై విద్యాశాఖాధికారులు స్పందిస్తూ, ఆయా విద్యా సంస్థ యాజమన్యాలకు కోడిగుడ్డుకు రూ.1 చొప్పున చెల్లిస్తున్నామని చెప్పారన్నారు. కార్పొరేట్ కళాశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలనే నిబంధన ఉందని, దాని అమలుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రన్న విలేజ్ మాల్స్‌లో ప్యాక్‌ల పేరుతో అధిక ధరలకు కొన్ని రకాల వస్తువులు విక్రయిస్తున్నారని తెలిపారన్నారు. ఆయా వస్తువుల ధరల అదుపునకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

మల్టీప్లెక్స్‌ల్లో ఎమ్మార్పీ మోసాలు
కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు, షాపింగ్ మాల్స్‌లో దారుణమైన ‘ఎమ్మార్పీ’ మోసాలు జరుగుతున్నాయని మంత్రి ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయువాడలోని పీవీపీ షాపింగ్ మాల్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా, బ్రాండెడ్ కాకుండా స్థానికంగా తయారైన వాటర్ బాటిల్‌ను రూ.100 ఎమ్మార్పీ ముద్ర వేసి విక్రయించడం గుర్తించామని తెలిపారు. చట్టంలో ఉన్న లొసుగులను తమకనుకూలంగా మార్చుకుని వ్యాపారులు.. ప్రజలను దోచుకుంటున్నారన్నారు. ఎమ్మార్పీపై తమ కంట్రోల్ లేదని, దీనివల్ల వినియోగదారులు మోసపోయే అవకాశం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఎమ్మార్పీని నియంత్రించే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని చోట్ల జీఎస్టీ నంబర్ లేకుండానే అదనంగా జీఎస్టీ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారని తెలిపారు. చీరలు, రెడీమేడ్ దుస్తులు అధిక ధరలకు అమ్ముతున్నారని చెప్పారు.

English Title
controlling law should come




Related News