కొనసాగిన నష్టాలు

stock market
  • మార్కెట్లలో లోపించిన ఉత్తేజం

  • వడ్డీ రేట్లపై యథాతథ స్థితికే ఆర్బీఐ మొగ్గు, ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాలు కారణం

ముంబై: స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో సెషన్‌లో బుధవారం నష్టాలను పోగేసుకున్నాయి. ఆర్.బి.ఐ రెపో రేటును మార్చకపోవడం, అవెురికా-చైనా వాణిజ్య వివాదంపై మళ్ళీ తెరపైకొచ్చిన ఆందోళనలతో ప్రపంచ మార్కెట్లు భయకంపితమవడం మార్కెట్ల అవరోహణకు పురికొల్పిన ప్రధానాంశాలు. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) ‘సెన్సెక్స్’ 249.90 పాయింట్లు పతనమై 35,884.41 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) ‘నిఫ్టీ’ 84.55 పాయింట్లు నష్టపోయి 10,784.95 వద్ద ముగిసింది. బి.ఎస్.ఇలోని అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. మెటల్, ఫార్మా, ఆటో, బ్యాంకింగ్ షేర్లు ఎక్కువ నష్టాలను చూశాయి. వ్యవస్థలోకి నిధులు ఎక్కువగా రాకుండా చూసే వైఖరినే ఆర్.బి.ఐ కొనసాగించింది. బ్యాంకులకిచ్చే రుణాలపై వడ్డీ రేటు (రెపో)ను 6.5 శాతం వద్ద అలానే ఉంచింది. అయితే, బ్యాంకులు రుణాల మంజూరును పెంపొందించేందుకు వీలుగా, బ్యాంకులు వాటి వద్ద తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన రిజర్వుల స్థాయిని ఆర్.బి.ఐ తగ్గించింది.  బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో ఆ నిధుల స్థాయిని నిర్వహించాల్సి ఉంటుంది. వాటిని తగ్గించడం వల్ల రుణాలిచ్చేందుకు బ్యాంకుల వద్ద నగదు నిల్వలు పెరుగుతాయి. అయితే, మార్కెట్లను ఉత్తేజపరచడంలో అది విఫలమైంది. బలహీన స్థితిలో ఆరంభమైన మార్కెట్లు ఆర్.బి.ఐ విధాన ప్రకటన తర్వాత మరింత క్షీణించాయి. అవెురికన్ డాలర్‌తో మారకంలో రూపా యి మరో 11 పైసలు బలహీనపడి ఇంట్రా-డేలో రూ. 70.60గా నిలవడం కూడా సెంటిమెంట్‌ను కుంగదీసిందని ట్రేడర్లు చెప్పారు. ‘‘బలహీన అంతర్జాతీయ సంకేతాలను అనుసరించి నిఫ్టీ నీరసించింది.  నష్టాలతో ముగిసింది...నిఫ్టీలోని మిడ్‌క్యాప్ సూచి 1.5 శాతం క్షీణించగా, స్మాల్‌క్యాప్ సూచి 1.8 శాతం క్షీణించింది. అవెురికాలోని ముఖ్యమైన సూచీలు మంగళవారం 3 శాతం పైగా పతనమయ్యాయి. బాండ్ ప్రతిఫలాలు తలకిందులవడం, వాణిజ్యంపై నెలకొన్న కొత్త భయాందోళనల సమష్టి దాడితో మార్కెట్లు కుంగిపోయాయి’’ అని హెచ్.డి.ఎఫ్.సి సెక్యూరిటీస్‌లో పి.సి.జి, క్యాపిటల్ మార్కెట్స్ గ్రూప్ అధిపతి వి.కె. శర్మ అన్నారు. ‘‘చైనాతో చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి. వాటిని పొడిగించకపోతే, అవి (శనివారం నుంచి) 90 రోజుల్లో ముగుస్తాయి’’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మంగళవారం రూ. 55.89 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ మదుపు సంస్థలు రూ. 521.38 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించాయని బి.ఎస్.ఇ వద్ద అందుబాటులోనున్న తాత్కాలిక డాటా సూచించింది. బ్రెంట్ క్రూడ్  0.53 శాతం తగ్గి పీపా 61.75 డాలర్ల వద్ద పలుకుతోంది.

సంబంధిత వార్తలు