కొనసాగిన పతనం

Updated By ManamThu, 05/17/2018 - 22:32
bse
  • ఇంటా, బయటా ప్రతికూల సంకేతాలతో మూడోరోజూ నష్టాల్లో ముగిసిన సెన్స్‌క్స్, నిఫ్టీలు

bse1ముంబయి: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ కుమ్ములాట, కొండెక్కి కూర్చుంటున్న ముడి చమురు ధరలతో, దిగులు చెందిన మదుపరులు ఉన్నకాడికి అమ్మి లాభం చేసుకునే ధోరణిని కనబరచడంతో ఈక్విటీ సూచీలు వరుసగా మూడవ రోజున నష్టాలను పోగు చేసుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) ‘సెన్సెక్స్’ 239 పాయింట్లు క్షీణించి 35,149.12 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 58.40 పాయింట్లు నష్టపోయి 10,682.70 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా, ముడి చమురు ధరలు పీపాకు 80 అవెురికన్ డాలర్ల స్థితికి చేరుతున్నాయి. భారత్ వంటి ఇంధన దిగుమతి దేశానికి దిగుమతి వ్యయాలు పెరుగుతాయని, ద్రవ్య లోటు అధ్వానంగా తయారవుతుందనే భయాలు పెట్రేగాయి. కర్ణాటక ముఖ్యమంత్రిగా బి.జె.పికి చెందిన బి.ఎస్. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం అయితే చేశారుకానీ, తన ముందున్న కేసు తుది ఫలితంపైనే ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు ఆధారపడి ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. చప్పగా ఉన్న  త్రైమాసిక ఫలితాలు, ప్రపంచ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు, విదేశీ ఫండ్ల నిర్విరామ అమ్మకాలతో బయటకుపోతున్న నిధులు మార్కెట్లో హెచ్చు తగ్గులను ఎగదోశాయని బ్రోకర్లు చెప్పారు. ‘సెన్సెక్స్’ 35,483.62 వద్ద హెచ్చు స్థాయిలోనే మొదలై 35,510.01 స్థాయిని తాకింది. ట్రేడ్ చివర్లో చోటుచేసుకున్న హఠాత్ అమ్మకాలతో అది 35,087.82 స్థాయికి పడిపోయింది. చివరకు 238.76 పాయింట్ల నష్టంతో 35,149.12 వద్ద ముగిసింది. మే 4 (34,915.38) తర్వాత  ‘సెన్సెక్స్’ ఇంత తక్కువ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. ‘నిఫ్టీ’ 10,682.70 నుంచి 10,777.25 మధ్య కదలికలు సాగించి, 58.40 పాయింట్ల నష్టంతో 10,682.70 వద్ద ముగిసింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు బుధవారం రూ. 699.22 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ మదుపు సంస్థలు రూ. 229.06 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశాయని తాత్కాలిక డాటా సూచించింది. ‘‘డాలరుతో మారకం విలువలో రూపాయి పుంజుకున్నా మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రతికూల మొగ్గుతోనే సాగింది. కర్ణాటక ఎన్నికల డైలమా తర్వాత, ఇప్పుడు ఇన్వెస్టర్ల దృష్టి కంపెనీలు ప్రకటించే త్రైమాసిక ఫలితాలపై కేంద్రీకృతమైంది. స్మాల్, మిడ్-క్యాప్ షేర్లు ప్రకాశించాయి. ఇక అంతర్జాతీయంగా.. అవెురికాలో బాండ్ ప్రతిఫలం 3 శాతం ఎగువకు పెరిగింది. చమురు ధరలు హెచ్చు స్థాయిల్లోనే ఉన్నాయి. అవి ఈక్విటీ మార్కెట్లలోకి నిధుల ప్రవాహాన్ని నీరుగార్చవచ్చు. ముఖ్యంగా ఇండియాలో, ఈక్విటీల ధరలు వాటి అసలు విలువకన్నా ఎక్కువగా ఉన్నాయనే భావన ఉంది’’ అని జియోజీత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు. 

కోలుకున్న రిలయన్స్
బుధవారం పతనాన్ని చూసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేర్ ధర గురువారం 56.87 శాతం పెరిగింది. ఎరిక్‌సన్‌తో సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునేందుకు చర్చలు జరుగుతున్నాయనే వార్తలతో ఆ కంపెనీ షేర్ ధర తిరిగి పుంజుకుంది.

Tags
English Title
Continued fall
Related News