పోటీకి  సై

Updated By ManamThu, 11/08/2018 - 23:04
kamal-hassam
  • ఉప ఎన్నికలకు మేం సిద్ధం

  • పుట్టినరోజున కమల్ ప్రకటన

  • 20 అసెంబ్లీ స్థానాలు ఖాళీ

  • ఎన్నికలు ఎప్పుడున్నా పోటీ

kamal-hassamచెన్నై: తమిళనాడులో ఖాళీగా ఉన్న 20 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా వాటిలో పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధమని ప్రముఖ నటుడు, ఎంఎన్‌ఎం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ ప్రకటించారు. తన 64వ పుట్టినరోజు వేడుకలలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. అయితే, మూడు నెలల క్రితం మాత్రం తాను 2019 సార్వత్రిక ఎన్నికల్లోనే పోటీ చేస్తాను తప్ప ఉప ఎన్నికలపై ఆసక్తి లేదని కమల్ చెప్పారు. అప్పటికి రాష్ట్రంలో రెండు స్థానాలే ఖాళీగా ఉండేవి. కానీ ఇప్పుడు 20 స్థానాలు ఉండటంతో పోటీకి సై అని కమల్ తెలిపారు. ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ఎవరికీ తెలియదని, కానీ అవి ఎప్పుడు జరిగినా తాము పోటీకి సిద్ధమని ఆయన చెప్పారు. హామీలు ఇవ్వడాన్ని తాను నమ్మబోనని, దానికిబదులు ప్రజల నుంచి సూచనలు తీసుకుంటానని చెప్పారు. దినకరన్‌కు మద్దతునిచ్చిన 18 మంది ఎమ్మెల్యేలపై అన్నాడీఎంకే వేటువేయడం, దానిని మద్రాస్ హైకోర్టు కూడా సమర్ధించడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ 18 మంది ఖాళీ చేసే స్థానాలతో పాటు.. కరుణానిధి మరణంతో ఖాళీ అయిన తిరువారూరు, అన్నాడీఎంకేకి చెందిన ఏకే బోస్ ప్రాతినిధ్యం వహించిన త్రిపురాంకుంద్రం సీటు కూడా ఖాళీగా ఉన్నాయి. తమిళనాడులో 20 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే పళనిసామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వానికి అది అగ్నిపరీక్షే అవుతుంది.  అన్నాడీఎంకే ప్రభుత్వ విధానాలను కొత్త పార్టీ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్ కొన్నాళ్లుగా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఉప ఎన్నికలలో దినకరన్ మద్దతుదారులైన తాజా మాజీ ఎమ్మెల్యేలు గానీ, కమల్‌హాసన్  అభ్యర్థులు గానీ గెలిస్తే అప్పుడు పళనిసామి సర్కారు మైనారిటీలో పడుతుంది. డీఎంకే కూటమికి ఉన్న 97 మందికి ఈ 20 మంది తోడై  అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రభుత్వం కూలిపోయే అవకాశం కూడా లేకపోలేదు.

English Title
To the competition
Related News