కాలుష్య డాటాకు ఆదేశం

Updated By ManamThu, 08/09/2018 - 23:22
Sterlite Industries

imageన్యూఢిల్లీ: తూత్తుకుడిలోని రాగి ఫ్యాక్టరీని నడిపించేందుకుగానీ లేదా స్వతంత్రంగా మెయింటినెన్స్ నిర్వహించేందుకుగానీ స్టెర్లైట్ ఇండస్ట్రీస్‌కు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ మరోసారి అనుమతి నిరాకరించింది. ఫలితంగా, తమిళ నాడులోని తూత్తుకుడిలో ఉన్న ఈ ఫ్యాక్టరీపై యథాతథ స్థితి కొనసాగనుంది. అయితే, కంపెనీకి చెందిన అడ్మినిస్ట్రేషన్ విభాగ సిబ్బంది ఫ్యాక్టరీ లోపలకి వెళ్ళేందుకు ఎన్.జి.టి ధర్మాసనం అనుమతించింది. తమిళ నాడు రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక సంస్థ (సిప్‌కాట్)కి బేస్‌లైన్ కాలుష్య డాటాను విశ్లేషించవలసిందని తమిళ నాడు రాష్ట్రాన్ని, తమిళ నాడు కాలుష్య నియంత్రణ బోర్డును ఎన్.జి.టి ఆదేశించింది. దానిపై పది రోజుల లోగా తనకు నివేదిక సమర్పించాలని పేర్కొంది. ఏడాదికి నాలుగు లక్షల టన్నుల రాగిని తయారు చేయగల సామర్థ్యం ఉన్న తూత్తుకుడి ప్లాంట్ గత 22 ఏళ్ళుగా పనిచేస్తోంది. ప్లాంట్ విస్తరణ ప్రక్రియలో ఉండగా, ప్రజా ప్రతిఘటన ఉద్యమం పతాక స్థాయికి చేరి, చివరకు పోలీసు కాల్పుల్లో 13 మంది పౌరల మరణానికి దారి తీసింది. 

ప్లాంట్ సి.టి.ఓ లైసెన్సును రెన్యూల్ చేసేందుకు తమిళ నాడు కాలుష్య నియంత్రణ బోర్డు ఏప్రిల్ 9న తిరస్కరించింది. ప్లాంట్‌ను మూసేయాలని మే 23న ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మే 28న జారీ చేసిన ఆదేశం ద్వారా వాటిని ఆ తర్వాత ధ్రువీకరించింది. ప్లాంట్ విస్తరణకు కేటాయించిన భూమిని ‘సిప్‌కాట్’ ఇప్పుడు రద్దు చేసింది. ప్రాజెక్టు విస్తరణకు ఇచ్చిన అనుమతులను కాలుష్య నియంత్రణ బోర్డు ఉపసంహరించుకుంది. విస్తరణ ప్రతిపాదనకు పర్యావరణ ప్రభావ మదింపు నివేదిక తయారీకి తాజా పరిశీలనాంశాలను నిర్దేశించవలసిందని కోరుతూ ప్రాజెక్టు ప్రతిపాదనకర్త (వేదాంత) ఈ ఏడాది ఫిబ్రవరి 14న పెట్టుకున్న దరఖాస్తును పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి హర్షవర్థన్ జూలై 20న లోక్ సభకు ఇచ్చిన జవాబులో తెలిపారు. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తాజాగా నిర్దేశించే పరిశీలనాంశాల కోసం వేదాంత ప్రస్తుతం ఎదురు చూస్తోంది. ఆ తర్వాత మాత్రమే అది తాజాగా పర్యావరణ ప్రభావ మదింపు నివేదికను తయారు చేయగలుగుతుంది. ఈ ప్రాజెక్టునకు మొట్టమొదటి పర్యావరణ అనుమతిని 1995 జనవరి 16న జారీ చేశారు. తదనంతరం ప్లాంట్ విస్తరణలకు వేదాంత సంస్థ తదుపరి పర్యావరణ అనుమతులు ఎప్పటికప్పుడు పొందుతూ వచ్చింది. 

English Title
Command to pollution data
Related News