కుప్పకూలిన ‘శిఖరాగ్రం’

Updated By ManamTue, 06/12/2018 - 00:04
SUMMITT

imageకెనడాలో చార్లెవాయిక్స్‌లోని క్యూబెక్ నగరంలో జరుగుతున్న జీ-7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో సభ్య దేశాల మధ్య భేదాభిప్రాయాలు తీవ్ర స్థాయిలో బహిర్గతమయ్యాయి. సమావేశానంతరం సభ్య దేశాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. సదస్సు ముగియడానికి ముందే ఉత్తరకొరియా అధ్యక్షడు కిమ్‌తో సమావేశ మయ్యేందుకు సింగపూర్ బయల్దేరిన ట్రంప్ విమానంలోనే ఉమ్మడి ప్రకటనపై స్పందించారు. ఆతిథ్య కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విలేఖర్ల సమావేశంలో అమెరికాపై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం చెబుతూ ‘ట్రూడో చెప్పినవని అబద్ధాలు. నిజం ఏంటంటే అమెరికా కంపెనీలు, కార్మికులు, వ్యవసాయదారులపై కెనడా విధిస్తున్న టారిఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. జీ-7 సమావేశ సమయంలో ఎంతో అణుకువ, మర్యాద నటించిన ట్రూడో, నేను వెళ్లిన తర్వాత తనను ఎవరూ భయపెట్టలేరని మీడియా ముందు అలా మాట్లాడారు’ అని ట్విట్టర్‌లో ట్రంప్ మండిపడ్డారు. రెండురోజుల పాటు క్యూబెక్‌లో జరిగిన సంపన్న దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశం వాణిజ్యం పై చెలరేగిన టారిఫ్ యుద్ధ సమస్యను పరిష్కరించకపోగా మరింత పెంచిం ది. దీనికి కారణం అమెరికాయేనని ఇతర సభ్య దేశాలు విమర్శించగా, కెనడా ప్రధాని ట్రూడోనే కారణమని అమెరికా తీవ్రంగా దుయ్యబట్టింది. ట్రూడో నిజాయితీ లేనివాడని, బలహీనుడని తీవ్రమైన వ్యక్తిగత విమర్శలకు అమెరికా పాల్పడింది. అయితే స్వేచ్ఛాయుత, న్యాయమైన వాణిజ్యానికి ప్రాముఖ్యమివ్వాలని ట్రూడో నొక్కి చెప్పడం వల్లనే ఆర్థిక స్వీయ రక్షణ విధానాలను అమలు చేస్తున్న ట్రంప్ ఇలా తీవ్రంగా స్పందించారని ఇతర జీ-7 దేశాలు విమర్శిస్తున్నాయి. పరస్పర వైషమ్యపూరిత దూషణలు, వాణి జ్య యుద్ధ చర్యల హెచ్చరికలతో జీ-7 శిఖరాగ్ర సమావేశం అర్థాంతరంగా ముగిసింది.

2008 నుంచి కొనసాగుతున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా సంపన్నదేశాల కూటమి (జీ-7)లో ఆధిపత్యపోరు తలెత్తింది. అగ్రరాజ్యంగా పెత్తనం చేస్తున్న అమెరికా ఆర్థిక బుడగ పగిలిపోవడంతో, ఆర్థిక ఆత్మరక్షణ, జాత్యహంకార విధానాలతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ సృష్టిస్తున్న అపరి ష్కృత వాణిజ్య వివాదాలు జీ-7 సభ్య దేశాల మధ్య తలెత్తాయి. ఈ ఏడాది మార్చిలో యూరోపియన్ (ఈయూ), కెనడా, మెక్సికో నుంచి దిగుమతి అవుతున్న స్టీల్‌పై 25 శాతం, అల్యూమినియంపై 10శాతం అమెరికా సుంకం విధించడంతో వందల కోట్ల డాలర్ల నష్టం చేకూరింది. అందుకు ప్రతిగా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే మెక్సికో బూర్బన్ విస్కీ, పంది మాంసం, ఆపిల్స్, బంగాళాదుంపలు సహా ఉక్కు దిగుమతులపై 15-25 శాతం సుంకం విధించింది. అదే తీరులో గతవారం ఈయూ కూడా అమె రికా దిగుమతులపై సుంకాలు విధించడంతో ఆ దేశానికి 280 కోట్ల యూరో లు నష్టం వాటిల్లింది. అమెరికా స్వీయ రక్షణ ఆర్థిక విధానాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని అనేక దేశాలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. అమెరికా సుంకాలపై కెనడా ప్రధాని జీ-7 సదస్సులో తీవ్రంగా స్పందిం చారు. ట్రంప్‌కు ప్రతీకార చర్యలు జులై 1 నుంచి అమలు చేస్తామని కెనడా ప్రధాని ప్రకటించడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్రిమియా సంక్షోభం నేపథ్యంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జీ-7 దేశాల కూటమి నుంచి బహిష్కరణకు గురైన రష్యాకు తిరిగి సభ్యత్వం ఇవ్వాలని ట్రంప్ ఈ శిఖరాగ్ర సమావేశంలో గట్టిగా ప్రతిపాదించడం అంద రినీ ఆశ్చర్యపరచింది. అయితే ఈ ప్రతిపాదనను ఇటలీ మినహా మిగతా దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జీ-7 సదస్సుకు హాజరైన ఐరోపా సమాఖ్య దేశాలేవీ ఇందుకు అంగీకరించబోవని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తేల్చి చెప్పారు. ఆర్థిక స్వీయ రక్షణ చర్యలు, పారిస్ ఒప్పందం, ఇరాన్ అణు ఒప్పందాల నుంచి అమెరికా వైదొలగడంపై ప్రపంచ దేశాల నుంచి నిరసనలు వ్యక్తమైనాయి. ప్రపంచ సంపదలో 62 శాతం, జీడీపీలో 46 శాతం వాటా కలిగిన జీ-7 కూటమి నేడు అంతర్జాతీయంగా చైనా ముఖంతో ఈయూ, రష్యాల మద్దతుతో రూపుదిద్దుకుంటున్న సరికొత్త భౌగో ళిక రాజకీయ, ఆర్థిక సమీకరణల ధాటికి బీటలు వారింది. అమెరికా ఒంటె త్తు విధానాల కారణంగా కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, బ్రిటన్ ఆంగ్లో సాక్సన్ దేశాల ఐక్యత కూడా వేగంగా ఆవిరవుతోంది. ఈ నేపథ్యంలో జీ-7 దేశాల శిఖరాగ్ర సమావేశం రూపొందించిన ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయకుండా అమెరికా వైదొలగినా, ఆరు దేశాల ప్రకటనగా విడుదల చేయా లని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రతిపాదించారు. వాతావరణ మార్పుపై చర్చలకు ఎగ్గొట్టడం, ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయకుండా ముందుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్‌ను సభ్య దేశాల ప్రతినిధులు నిలదీస్తున్న దృశ్యాన్ని జర్మనీ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ ట్విట్టర్‌లో ఉంచిన ఫోటో నేడు వైరల్ అయింది.

అమెరికా ఆర్థిక స్వయం రక్షణ విధానాలను విమర్శిస్తూ ప్రతిగా అమె రికా దిగుమతులపై సుంకాలు విధించబోతున్నట్లు కెనడా ప్రధాని ట్రూడో ప్రకటనతో ప్రపంచంలో మిగిలిన దేశాలు కూడా అదేబాట పడితే అమెరికా పరిస్థితి తారుమారుకాగలదన్న ఆందోళన నేపథ్యంలో జీ-7 ప్రకటనపై సం తకం చేసేందుకు ట్రంప్ నిరాకరించారు. 1975లో జీ-7 శిఖరాగ్ర సమా వేశాలు మొదట ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటిదాకా ఉమ్మడి అవగాహన తోనే ప్రకటనలు విడుదలయ్యాయి. సంపన్న దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించలేకపోవడం ఇదే ప్రథమం. 1930ల నాటి మహామాంద్యం పరిస్థి తులు నెలకొన్న సమయంలో నడిచిన తీరులోనే వాణిజ్య యుద్ధాలు మరో సారి తెర మీదకు వచ్చాయి. ఆనాటి వాణిజ్య యుద్ధాలు క్రమంగా ప్రపంచ యుద్ధంగా పరిణమించిన చేదు అనుభవం మళ్ళీ పునరావృత్తం కాకుండా ప్రపంచ ప్రజలు అప్రమత్తతతో వాటిని నివారించే విధమైన ప్రపంచ శాంతి ఉద్యమాలకు సిద్ధం కావాలి. కెనడా ప్రధాని ట్రూడోపై మండిపడుతున్న ట్రంప్, అదే క్రమంలో కొన్ని అమెరికా ఎగుమతులపై భారత్ 100 శాతం సుంకాలు విధించడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఇలాంటి చర్యలను అనుమతించబోమని హెచ్చరించారు. అమెరికా, చైనా సామ్రాజ్యవాద దేశాల మధ్య తీవ్రమవుతున్న పోటీలో వాణిజ్య లాభం పొందేందుకు భారత్ ప్రయ త్నిస్తోంది. అయితే మారుతున్న భౌగోళిక రాజకీయాధిపత్య సమీకరణల్లో భారత్ తన స్థానాన్ని సవ్యంగా నిర్వచించుకొని, అందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి. అంతర్జాతీయ ఒప్పందాలను తన స్వార్థ ప్రయోజనాల కోసం విచ్చిన్నం చేస్తున్న ట్రంప్ ఉత్తకొరియా అధినేత కిమ్‌తో జరుపుతున్న సమావేశంలో అంతర్జాతీయ ప్రపంచ శాంతి ఆకాంక్షలను ఏ మేరకు నెరవేరుస్తాడన్నది సందేహమే! 

English Title
Collapsed 'summit'
Related News