రెడీగా ఉండండి..: కేసీఆర్

Updated By ManamThu, 07/12/2018 - 09:30
CM KCR Phone Call To Party MLAS On Upcoming Elections

CM KCR Phone Call To Party MLAS On Upcoming Elections

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఇప్పట్నుంచే వ్యూహరచనలు చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. ఎంత మెజార్టీ వస్తుందని పలువురు ఎమ్మెల్యేలను కేసీఆర్‌ అడిగినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థులు ఏం చేస్తున్నారు..? వారి ప్లాన్స్ ఏంటి..? మనల్ని ఎదుర్కోవడానికి వారు చేస్తున్న ప్రయత్నాలేంటి..? అనే విషయాలపై కేసీఆర్ ఆరా తీశారని సమాచారం. పార్టీ పరంగా ఎలాంటి సాయమైన సరే చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ నేతలకు సీఎం హామీ ఇచ్చారు.!. సర్వేలో భాగంగా.. ఎమ్మెల్యేలకు వీక్, ప్లస్ పాయింట్లు ఏంటి..? అనేవి నిశితంగా వివరించినట్లు తెలుస్తోంది.

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ పార్టీలో చేరిక సమయంలో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేశామని సమయమొచ్చినప్పుడు బయటపెడతానని కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో నియోజకవర్గంలో సర్వే ఫలితాలను ఎమ్మెల్యేలకు సీఎం వివరించారు. పలువురు ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచనలు కూడా చేశారని తెలుస్తోంది. ఇవన్నీ అటుంచితే.. ప్రతిపక్షపార్టీలైన టీడీపీ, కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ నేతలు కారెక్కిన సంగతి తెలిసిందే. అయితే వారికి టికెట్ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా.. ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తానని.. మారితే ఒకట్రెండు మారొచ్చని సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వేరే పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇస్తారా..? లేకుంటే మిన్నకుండిపోతారా? అన్నది తెలియాల్సి ఉంది.

కాగా.. గత నాలుగైదు రోజులుగా దాదాపు 70 మందికి ఈ ఫోన్లు వెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలకు కేసీఆర్ నుంచి ఫోన్ రాలేదని తెలుస్తోంది. కేసీఆర్ నుంచి ఫోన్ రానివారందరికీ మరోసారి పోటీ చేయడం కష్టమేనని సమాచారం. అయితే ఇంకా ఫోన్ ఎవరెవరికి రాలేదు..? ఎందుకు రాలేదు..? ఫోన్ రాకపోవడానికి గల కారణాలేంటి..? తమ వీక్ పాయింట్లను సరిదిద్దుకునే పనిలో ఎమ్మెల్యేలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

మొత్తానికి చూస్తే.. ముందస్తు ఎన్నికలు రావడం పక్కా అని స్పష్టంగా అర్థమవుతోంది. కేంద్రంలో తనకున్న పరిచయాలతో కేసీఆర్ ముందు జాగ్రత్తగా అప్రమత్తమై ఇప్పట్నుంచే వ్యూహాలు రచిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా జమిలీ ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని ఇదివరకే లా కమిషన్‌కు పార్టీ పెద్దలు వివరించిన సంగతి తెలిసిందే.

English Title
CM KCR Phone Call To Party MLAS On Upcoming Elections
Related News