బాబ్లీ కేసు మళ్లీ తెరపైకి..

Updated By ManamFri, 09/14/2018 - 15:55
CM chandrababu naidu, Non bailable warrent, Babli Project of Protest case    
  • ముఖ్యమంత్రి చంద్రబాబుపై నాన్‌బెయిలబుల్ వారంటు

  • 16 మంది అరెస్టుకు ఆదేశాలు.. బాబ్లీ ప్రాజెక్టుకు నిరసనపై కేసు

  • తిరిగి తెరవాలంటూ పిటిషన్.. తెరపైకి ఎనిమిదేళ్ల నాటి కేసు

  • 21లోగా హాజరు పరచాలి.. ధర్మాబాద్ మేజిస్ట్రేట్ ఆదేశం

  • ఆగస్టు 16 అని తొలి వారంటు.. దానిపై పెన్నుతో కొట్టేసిన వైనం

  • సెప్టెంబరు 21గా తేదీ మార్పు!.. 23నుంచి సీఎం అమెరికా పర్యటన

  • ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం.. దానికి ముందే కోర్టులో హజరు!

CM chandrababu naidu, Non bailable warrent, Babli Project of Protest case    అమరావతి: ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడిపై నాన్ బెయిలబుల్  అరెస్టు వారంటు జారీ అయింది.  మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ముఖ్యమంత్రి, రాష్ట్ర  జలవనరుల శాఖ మంత్రి  దేవినేని ఉమా సహా మరో 14 మందిపై ఈ వారంటు జారీచేసింది. చంద్రబాబు, ఇతరులను అరెస్టు చేసి ఈనెల 21వ తేదీ లోగా తన  ఎదుట హాజరు పరచాలని ఫస్ట్‌క్లాస్  జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎన్.ఆర్ గాజ్‌భియే ఆదేశించారు. 2010 సంవత్సరంలో  మహారాష్ట్రలో గోదావరి నదిమీద  కడుతున్న బాబ్లీ ప్రాజెక్ట్‌కు నిరసనగా నాటి సమైక్యాంధ్రప్రదేశ్ ప్రతిపక్ష  నాయకుడైన చంద్రబాబు నాయుడు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్లి  నిరసన వ్యక్తం చేసిన ఘటనలో ఈ వారంట్లు జారీ అయ్యాయి.  బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయని నిరసన వ్యక్తం చేయడంతో అప్పట్లో చంద్రబాబు, ఇతర నాయకులను  మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి,  పుణె జైలులో పెట్టారు. తర్వాత  వారిని విడుదల చేశారు. 

ఈ కేసును తిరిగి తెరవాల్సిందిగా  స్థానికులు దాఖలు చేసిన పిటిషన్  ఆధారంగా మహారాష్ట్రలోని నాం దేడ్ జిల్లా ధర్మాబాద్‌కు చెం దిన జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజి స్ట్రేట్ ఈ వారంటు ఇచ్చారు. దాడి  చేయడం, నేరపూరితంగా బల ప్రయోగం, ప్రభుత్వోద్యోగుల విధి  నిర్వహణకు అడ్డుపడటం,  ప్రమాదకరమైన ఆయుధాలు ఉపయోగించి గాయపరచడం, ఇతరుల వ్యక్తిగత భద్రతకు, వారి  ప్రాణాలకు ప్రమాదం కలిగిం చడం, నేరపూరితంగా భయపెట్టడం లాంటి నేరాల కింద  ముఖ్యమంత్రి, తదితరులపై  కేసు నమోదుచేశారు. 

ఎవరెవరికి వారంటు..
1) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 2 జి. కమలాకర్, 3.  కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, 4) సిహెచ్  ప్రభాకర్, 5) నామా  నాగేశ్వరరావు, 6) జి.  రామానాయుడు (జేబీ నాయుడు),  7) దేవినేని ఉమా మహేశ్వరరావు, 8) సీహెచ్  విజయ రామారావు, 9)  ముజఫరుద్దీన్ అన్వరుద్దీన్, 10) ఎం. హన్మత్ షిండే, 11)  పి. అబ్దుల్ ఖాన్ రసూల్ ఖాన్, 12)  ఎస్. సొంజోజు, 13) పి. సత్యనారాయణ,  15) టి. ప్రకాష్ గౌడ్, 16) ఎన్. ఆనం దబాబు 

తేదీ ఎందుకు మార్చినట్లు?
వీరందరిపై ఐపీసీ సెక్షన్లు 353,  324, 332, 336, 337, 323, 504, 506, 109, 34  కింద వారంటు జారీ చేశారు.  అయితే, తొలుత వీరిని ఆగస్టు 16వ  తేదీ లోగా హాజరు పరచాలని కోర్టు  ఆదేశాలలో ఉండగా, ఆ తర్వాత దాన్ని  పెన్నుతో సర్కిల్ చుట్టి, పక్కన  21-9-2018 అని చేత్తో రాశారు. ఇది  ఎవరు రాశారో, అలా ఎందుకు  రాశారోనన్న అనుమానాలను  తెలుగుదేశం పార్టీ వర్గాలు  వ్యక్తం చేస్తున్నాయి. అలాగే, ఈ  ఆదేశాలను కూడా జూలై 5వ  తేదీనే జారీ చేసినా.. సెప్టెంబరు  13వ తేదీ వరకు ఎందుకు ఆపారని కూడా ప్రశ్నలు  తలెత్తుతున్నాయి.

ఐరాస ప్రసంగానికి ముందే..

ఈనెల 23వ తేదీ నుంచి 26వ తేదీ  వరకు ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు అమెరికాలో  పర్యటించాల్సి ఉంది. అక్కడ  ఐక్యరాజ్య సమితిలో ప్రకృతి  వ్యవసాయంపై ఆయన  ప్రసంగిస్తారు. ఈ  కార్యక్రమం ముందే  ఖరారైంది. సరిగ్గా దానికి ముందు 21వ తేదీలోగా అనడంతో..  కోర్టుకు వెళ్లిన తర్వాత  అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న అనుమానాలు  వ్యక్తమవుతున్నాయి.  

అలాగే మంత్రి లోకేశ్ కూడా  ఈనెల 18 నుంచి 20వ తేదీ  వరకు చైనాలో జరిగే  వరల్డ్ ఎకనమిక్ ఫోరం  సమావేశాలకు వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం 17 నుంచి 22వ తేదీ  వరకు ఆయన చైనా  పర్యటన షెడ్యూలు ఖరారైంది.  ఇంతలోనే ఈ వారంట్లు రావడంతో తెలుగుదేశం పార్టీ వర్గాలు,  ఏపీ ప్రభుత్వ వర్గాలు అత్యంత  అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. 

English Title
CM chandrababu naidu among 16 people get Non bailable warrent in Babli Project of Protest case




Related News