బాల్యం బలవుతోంది!

Updated By ManamThu, 06/14/2018 - 20:10
Children school, Childhood age, children future, Makutam

స్కూలు.. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసే కలల ప్రపంచం! స్కూలు.. ఆడుతూ పాడుతూ, తుళ్లుతూ ఉన్నన్ని రోజులూ పిల్లలకు ఎన్నో మధుర జ్ఞాపకాల్ని అందించే అపురూప ప్రదేశం! స్కూలు.. నిన్నూ, నన్నూ, ఎందరినో తీర్చిదిద్దిన గొప్ప స్థలం!! ఎందరెందరో మేధావులు, శాస్త్రవేత్తలు, కవులు, రచయితలు, విద్యావేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు చదువును గురించి తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు.

Children school, Childhood age, children future, Makutamచదువంటే నేర్చుకోవడం. చదువంటే తెలుసుకొని ఆచరించడం. మనలోని జ్ఞానాన్ని వికసింపజేసుకోవడం. మన భావాలకు, ఆలోచనలకు రెక్కలు తొడగడం. తమలోని ఆలోచనలకు, అభిరుచులకు మెరుగు పెట్టుకోవడం. మనుషుల్లోని మృగత్వాన్ని తొలగించుకొని, ఋషిత్వాన్ని పెంపొందించుకోవడం. ప్రేమాభిమానాల్ని పంచుకోవడం, పెంచుకోవడం. మనుషుల్నీ, ప్రకృతినీ, సమస్త జంతుజాలాన్నీ ప్రేమతో అక్కున చేర్చుకోవడం. జీవన తత్వాన్ని అర్థం చేసుకోవడం! మనుషులకు కలిగే కష్టదశ ఏదని కళ్లులేని హెలెన్ కెల్లర్‌ను అడిగినప్పుడు, ‘‘కళ్లున్నా చూడలేకపోవడం’’ అని చెప్పారు. ఆమెకు కళ్లు లేకపోయినా ఎన్నో గ్రంథాలు రాశారు. ప్రపంచమంతా తిరిగారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఎంతో కృషి చేశారు. ‘‘ఐ యామ్ ఓన్లీ వన్ బట్ స్టిల్ ఐ యామ్ వన్. ఐ కాన్ట్ డు ఎవిరిథింగ్. బట్ స్టిల్ ఐ కెన్ డు సమ్‌థింగ్.

"On the whole that physical, emotional and ethical integration of an individual into a complete man is fundamental aim of education."
    l UNESCO

ఐ విల్ నాట్ రెఫ్యూజ్ టు డు సమ్‌థింగ్ ఐ కెన్ డు’’ అని ఆమె చెప్పారు. సృజనాత్మకంగా సాగాల్సిన విద్య ఇవాళ ప్రైవేటు పాఠశాలల స్థాయి దాటిపోయి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. వస్తువుల్ని తయారుచేసే పారిశ్రామికవేత్త సైతం మనుషుల్ని దృష్టిలో పెట్టుకొనే తయారుచేస్తాడు. కానీ ఇవాళ్టి విద్యా విధానంలో మానవ కోణం కానీ, మనిషి విలువలు కానీ, సామాజిక స్పృహ కానీ, నీతి నియమాలు కానీ లేనే లేవు. వ్యాపారం.. వ్యాపారం. లాభం, నష్టం. ఇదే ఇవాళ్టి విద్యార్థులకు శాపంగా పరిణమించిన విష సంస్కృతి. ఈ వ్యవస్థలో పిల్లలు మొండిగా తయారవుతారు. బడికి వెళ్లడానికి మొరాయిస్తారు.

అక్కడ వాళ్లకు ఇష్టమైంది లేకపోగా కష్టం కలిగించే ఎన్నో విధానాలుంటాయి. ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమం దుర్బేధ్యమైన కోట గోడ. ఏ వయసు వాళ్లనైనా కథలు కదిలిస్తాయి. మహాత్మా గాంధీపై తల్లి చెప్పిన కథల ప్రభావం, టాల్‌స్టాయ్ కథల ప్రభావం ఎంతో ఉంది. అంబేద్కర్‌పై ఆయన ఉపాధ్యాయుడు చెప్పిన కథల ప్రభావం ఉంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, లాల్ బహదూర్ శాస్త్రి, సుబ్రమణ్య భారతి, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి గొప్పవాళ్లపై వాళ్ల ఉపాధ్యాయులు చెప్పిన కథల ప్రభావం ఎంతో ఉంది. కథల ద్వారా ఆలోచన, ఊహ, తర్కం, జ్ఞానం, అన్వేషణ వంటి అనేక శక్తియుక్తులు పిల్లల్లో పెరుగుతాయి.

నానాటికీ తీసికట్టు
Children school, Childhood age, children future, Makutamఇవాళ జరుగుతున్నదేమిటి? పుస్తకమంటే పాఠ్య పుస్తకమే. అదైనా పూర్తిగా చదివి అర్థం చేసుకుంటే మంచిదే. వాళ్లకా అవకాశం ఎక్కడ ఉంది? పాఠ్య పుస్తకం స్థానాన్ని గైడ్స్, మెటీరియల్స్ ఆక్రమించేశాయి. ఇంగ్లీష్ మీడియం పిల్లలకైతే ప్రశ్న, జవాబు మాత్రమే చదువు. ప్రశ్న కూడా తెలియకుండా జవాబే వాళ్ల మెదళ్ల నిండా కుక్కేస్తున్నారు. ఇంక పుస్తకాలకు చోటెక్కడ? గ్రంథాలయాలకు తావెక్కడ? అవగాహన కలిగిన చదువులకు చోటెక్కడ? ప్రభుత్వ పాఠశాలల పనితీరు నానాటికీ దిగజారిపోతున్నది. ప్రాథమిక, మాధ్యమిక విద్య.. ప్రేమతో, దయతో, అభిమానంతో సాగాల్సిన స్థాయి. అయితే బడుల్లో ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ, డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. ఉపాధ్యాయుల్లో నిబద్ధత కొరవడడంతో ఎక్కడలేని అలసత్వం చోటు చేసుకుంటోంది.

సంవత్సరంలో ఎప్పుడు పిల్లలొచ్చినా బడిలో చేర్చుకోవాల్సిన ఉపాధ్యాయులు టీసీ లేదనీ, మధ్యలో వచ్చారనీ, ఆధార్ కార్డ్ లేదనీ.. రకరకాల కారణాలతో పిల్లలు బడిలో కాకుండా బడి బయట ఉండటానికి కారణమవుతున్నారు. ‘‘విద్యను నిర్బంధంగా బోధించాల్సిన అవసరం లేదు. అది పెరుగుదలతో ఒక భాగం మాత్రమే. దానికి సమాజానికి ప్రయోజనకరంగా తీర్చిదిద్దేవారే గురువులు’’ అంటారు జర్మన్ విద్యావేత్త ప్రోబెల్. ఒక మొక్కలో కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు ఎంత సహజంగా పెరుగుతాయో.. పిల్లలు కూడా తమ ఆలోచనలు, భావనలు యథేచ్ఛగా ప్రకటిస్తూ పెరగాలి. బడి ఒక పూలవనంలా ఉండాలని ఆయనంటారు.

ప్రేమాభిమానాలతో చెప్పాలి
Children school, Childhood age, children future, MakutamThe average teacher tells
The good teacher explains
The superior teacher demonstrates
The great teacher inspires

- విలియం ఆర్థర్ వార్డ్
బడికి వచ్చిన పిల్లల్లో సామాజిక, ఆర్థిక, కుటుంబ కారణాల రీత్యా ఎంతో భిన్నత్వం ఉంటుంది. అందర్నీ ఒకే గాటన కట్టేసి పాఠం చెప్పడం వల్ల సగానికి సగం మంది పిల్లలు తమకు చదువు రాదనుకొని డ్రాపవుట్లవుతున్నారు. ప్రతి పిల్లవాడిలోనూ అద్భుతమైన శక్తులుంటాయి. వాటిని గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తాడు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఐదు సంవత్సరాల పాటు పిల్లలు ఒకే బడిలో ఉంటారు. అలాంటప్పుడు వాళ్లకు చదవడం, రాయడం, సొంతంగా ఆలోచించడం నేర్పడం పెద్ద కష్టం కాదు. అలా నేర్పి హైస్కూల్‌కు పంపితే వాళ్లు కచ్చితంగా చదువులో ముందుకెళతారు. అయితే ఇవాళ జరుగుతున్న వాస్తవమేమంటే ప్రాథమిక పాఠశాలలో ఎక్కువ మంది చదువు రాకుండానే హైస్కూల్‌కు వెళ్తున్నారు. అక్కడా వాళ్లను పట్టించుకోకపోయినా, ఎలాగో పదో తరగతి పాసై బయటకు వస్తున్నారు. ఆ తర్వాత ఇటు పని చెయ్యడం రాక, అటు చదువూ రాక.. రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతున్నారు.

ఇంకాస్త ముందుకు వెళ్లిన ఉపాధ్యాయులు వాళ్ల పిల్లలు చదువుకొనే ప్రైవేటు పాఠశాలల్లో అనుసరించే ప్రశ్న-జవాబు పద్ధతిని అనుసరిస్తున్నారు. ఎక్కువ భాగం పాఠశాలల్లో గైళ్లు చూసి రాసే పద్ధతిలో హోమ్‌వర్క్ నడుస్తుంది. ప్రతి రోజూ ఏడు సబ్జెక్టులు హోమ్‌వర్క్ రాయడం కష్టం కావడంతో కొంతమంది పిల్లలు హోమ్‌వర్క్ వల్లనే బడి మానుకుంటున్నారు. అంటే చదవడం రానివాళ్లు కూడా ఈ చూసిరాత రాయక తప్పనిసరి కావడంతో చదువు మధ్యలో మానేస్తున్నారు. అంటే.. ఉపాధ్యాయులు కొట్టడం వల్ల కొంతమంది, చూసిరాతల వల్ల కొంతమంది బడి మానేస్తున్నారు. ‘‘చదువు చెప్పాలంటే దండించాల్సిన పనిలేదు. పిల్లల్ని ప్రేమాభిమానాలతో మచ్చిక చేసుకొని బోధించాలి. ఒక తల్లి తన బిడ్డల్ని ఎలా లాలించి, గారాబం చేసి పెంచుతోందో అలాగే టీచరు కూడా పిల్లల్ని చూడాలి’’ అంటారు ఆధునిక విద్యా పితామహుడిగా కీర్తిగాంచిన జోహాన్ అమోస్ కొమినియస్.

విలువల్లేని చదువు
ఒక దేశ విద్యా విధానం ఆ దేశపు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్దేశిస్తుందనీ, అందుకే దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందనీ అంటారు కొఠారీ. బడిలో నేర్చుకున్న పాఠాలే భవిష్యత్తును నిర్ణయించవనీ, బడి బయట నేర్చుకున్న విషయాలే వారి బాటను నిర్దేశిస్తాయంటారు సోక్రటీస్. ఎంతోమంది మేధావుల్ని, దేశభక్తుల్ని, రచయితల్ని, గొప్ప గొప్ప నాయకుల్ని కని పెంచి పెద్దజేసిన భూమి మనది. ఈ భూమి నాది, ఈ భాష నాది, ఈ నీరు నాది, సంస్కృతి నాదని ప్రాణానికి ప్రాణంగా కళ్లకద్దుకుంటూ ఎందరో మహానుభావులు సాగిపోయిన పుణ్యభూమి ఇది. మానవత్వంతో, ప్రేమతత్వంతో ఆప్యాయతా అనురాగాలు కలబోసుకొని ఒకరికొకరి మధ్య మానవ సంబంధాలతో మనుషులు నడయాడిన నేల ఇది. అలాంటి ఈ భూమ్మీద ఎలాంటి విలువలకూ చోటులేని విద్యతో పిల్లలు యువతగా మారి సమాజంలోకి అడుగు పెడుతున్నారు.

అలాంటి వాళ్ల నుంచి మనం ఆశిస్తున్నదేమిటి? కళ్లతో చూస్తున్నదేమిటి? మనిషి ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశమున్న రోజులివి. అలాగే అధఃపాతాళానికి తీసుకు వెళ్లడానికి అంతకంటే మరిన్ని ఆకర్షణలూ ఉన్న కాలం ఇదే. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పిల్లల్ని పెడదోవ పట్టిస్తోంది. ఇలాంటి సందిగ్ధ సందర్భంలో ఉపాధ్యాయుల బాధ్యత, విద్యారంగం బాధ్యత మరింత పెరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూల్లో, కాలేజీలో చేర్పించామని చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఇవాళ పిల్లలపై ఒత్తిడి మరింత పెరిగింది. మంచి స్కూలు, మంచి కాలేజీ, సెల్‌ఫోన్, మోటార్ బైక్, లాప్‌టాప్.. పిల్లల పాలిట మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. వీటి విషయంలో అందరూ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.

విష వలయం
పిల్లల్ని ర్యాంకుల, మార్కుల కర్మాగారాలుగా చూడడం వల్ల వాళ్లలో మానసిక ఒత్తిడి పెరిగిపోయి ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. విద్యలో సరైన దృక్పథం లేకపోవడం వల్ల పిల్లల్లో సహజంగా అభివృద్ధి చెందాల్సిన వాస్తవ దృక్పథం, ప్రయోగశీలత, సమస్యా పరిష్కార ఆలోచనా విధానం పెరగకపోవడంతో అర్ధంతరంగా ఎంతోమంది పిల్లలు తనువు చాలిస్తున్నారు. చదువనే మాట వినగానే పిల్లలతో పాటు తల్లిదండ్రులూ భయపడిపోతున్నారు. ఓ వైపు తమ పిల్లలు పోటీలో నెగ్గాలని కోరుకుంటున్న పెద్దలు.. స్కూళ్లల్లో, కాలేజీల్లో వరుసగా జరుగుతున్న ఘటనలు చూసి బెంబేలెత్తుతున్నారు. చదువనేది వ్యాపారమయ్యాక, సమాజం కెరీరిజాన్ని తలకెత్తుకున్నాక పిల్లలపై పడుతున్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. రోజు రోజుకూ పోటీ వాతావరణాన్ని ఉద్దేశపూర్వకంగా పెంచేస్తూ తమ స్కూలు లేదా కాలేజీలో చదువుకున్న విద్యార్థులు మిగతా వాటికంటే ఎక్కువ ర్యాంకులు, ఎక్కువ మార్కులు సంపాదించుకున్నారని ఆయా యాజమాన్యాలు భారీగా ప్రకటనలు ఇస్తుండటం ఒత్తిడిని మరింతగా పెంచుతోంది. పరిస్థితులు ఏ స్థాయికి దిగజారాయంటే.. ఒక స్కూలులో ప్రతిభావంతులైన విద్యార్థులుంటే వాళ్లకు ఉచితంగా చదువు చెబుతామనీ, ఐఐటీ కోచింగ్ ఇప్పిస్తామనీ చెప్పి వాళ్లను తమ స్కూలుకు వచ్చేలా యాజమాన్యాలు చేసేంతగా! ఇలాంటి అనైతిక కార్యకలాపాల వల్ల కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలంటేనే ఏవగింపు కలుగుతోంది. వీటి చర్యల్ని అడ్డుకునే నాథుడు లేకపోవడమే విషాదం.

తమ పిల్లలకు ఐఐటీ సీటు వచ్చే అవకాశం లేదని తెలిసినా, మిగతా వాళ్లకంటే తగ్గకుండా ఉండాలనే ఆపేక్షతో తల్లిదండ్రులు ఐఐటీ కోచింగ్ ఇచ్చే కాలేజీల్లోనే బలవంతంగా పిల్లల్ని చేరుస్తున్నారు. తద్వారా వాళ్లపై ఒత్తిడి పెంచుతూ, తాము కూడా ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో ఇదొక విష వలయంలా మారిపోయింది. మరోవైపు తమ సామర్థ్యానికి మించి కష్టపడాల్సి రావడం పిల్లల్ని వేధిస్తోంది. ఫలితంగా కొంతమంది ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తూ భవిష్యత్తనేదే లేకుండా చేసుకుంటున్నారు. ఐఐటీల్లో లేదంటే మెడికల్ కాలేజీల్లో సీటు రాకపోతే.. తక్కువతనంగా భావిస్తుండటమే అన్ని అనర్థాలకూ మూలం.

మార్కులు-వివక్ష
ప్రతి ఒక్కరిలోనూ అనంతమైన శక్తి ఉంటుంది. అది తెలుసుకుని, ఆ శక్తిని వెలికితీసే క్రమంలో ఎంతో శ్రమపడాల్సి వస్తుంది. కొండల్ని పిండిచేసే శక్తి యువతలో ఉందనీ, దాన్ని ఉపయోగించుకుంటే గొప్పవాళ్లు కావడం ఏమంత కష్టం కాదనీ అంటారు వివేకానందుడు. పిల్లలకు గొప్పవాళ్లు కావడానికి అవసరమైన వాతావరణం కల్పించడమే మనం చెయ్యాల్సింది. ఇవాళ పిల్లలు ర్యాంకుల రోళ్లల్లో పడి రోదిస్తున్నారు. మార్కుల చట్రంలో పడి ముక్కలు చెక్కలవుతున్నారు. పిల్లలు పిచ్చివాళ్లవుతున్నారు. సమాజం నుంచి దూరమైపోయి దూరతీరాలకు సాగిపోతున్నారు. ప్రేమను పంచే ప్రపంచం తెలియకుండా పోతున్నారు. మనుషుల మధ్య సంబంధాలకు మరీ మరీ దూరంగా జరిగిపోతున్నారు. ఆనందానికి అర్థమే లేకుండా పోయింది. సంస్కృతి నీటి మీద రాతైపోయింది. భాష బతకలేక చావలేక కొట్టుకులాడుతోంది. మనిషి మట్టికొట్టుకుపోతున్నాడు. సంబంధాలు సర్వనాశనమవుతున్నాయి. విద్య వికాసం కోసం కాకుండా వినాశనానికి దారి తీస్తోంది. చదువులే పిల్లల్ని పనికిరాని వాళ్లుగా తయారు చేస్తున్నాయి. అకడమిక్ చదువులనేవి పిల్లలను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాల్సింది పోయి, వాళ్లలో ఆత్మన్యూనతా భావాన్నీ, అనారోగ్యకరమైన పోటీ వాతావరణాన్నీ రగిలిస్తున్నాయి. పాఠాల్ని అర్థం చేసుకొనేలా చెప్పాల్సిన టీచర్లు, లెక్చరర్లు.. బలవంతంగా వాటిని రుద్దుతుండటం వల్ల విద్యార్థులు చదువును ఆస్వాదించలేక పోతున్నారు.

క్లాసులు జరిగే సమయమంతా టార్చర్‌గా ఉంటోందని వాళ్లు భావిస్తున్నారు. మార్కుల ఆధారంగా విద్యార్థుల్ని విభజిస్తుండటంతో, ఈ వివక్ష కారణంగా ఎక్కువ మంది ఆత్మన్యూనతా భావానికి లోనవుతున్నారు. విద్యనేర్చి విజ్ఞానవంతులు కావాల్సిన వాళ్లు ఒత్తిడిని భరించలేక ఇళ్ల నుంచీ, హాస్టళ్ల నుంచీ పారిపోతున్నారు. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఎంత అమానవీయంగా తయారవుతున్నా వ్యవస్థ చేష్టలుడిగి చూస్తోంది. ఇప్పటి పిల్లల్లో సామర్థ్యం, తెలివితేటలు ఎక్కువగానే ఉంటున్నాయి. అయినప్పటికీ వాళ్లు చాలా త్వరగా న్యూనతలోకి జారిపోతున్నారు. వాళ్లలోని వ్యాకులతను తొలగించేందుకు ఆరోగ్యకరమైన మార్గాన్ని మనం అనుసరించాలి. అందుకే మొదట పిల్లలతో ప్రవర్తించే తీరును తల్లిదండ్రులు మార్చుకోవాలి. 
- సెల్: 9949535695

‘‘పాపం పుణ్యం ప్రపంచ మార్గం
కష్టం సౌఖ్యం శ్లేషార్థాలూ
ఏమీ ఎరుగని పూవుల్లారా
అయిదారేడుల పాపల్లారా
మెరుపు మెరిస్తే వాన కురిస్తే
ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మీకే అని ఆనందించే కూనల్లారా
మీదే మీదే సమస్త విశ్వం
మీరే లోకపు భాగ్య విధాతలు’’
- శ్రీశ్రీ

‘‘విద్యార్థులకు శారీరక, మానసిక శిక్షణ గరపడం కంటే వారికి ఆత్మ శిక్షణ గరపడం కష్టమనిపించింది. ఆత్మ శిక్షణకు మత గ్రంథాల సాయం నేను పొందలేదు. విద్యాభ్యాసంలో ఆత్మ శిక్షణ ఒక భాగమని టాల్‌స్టాయ్ ఆశ్రమంలో మా పిల్లలకు శిక్షణ జరిగే సమయంలో తెలుసుకున్నాను. శరీర సంబంధమైన శిక్షణ ఇవ్వాలంటే వ్యాయామం ద్వారా ఇవ్వాలి. బుద్ధికి పదును పెట్టాలంటే బుద్ధి చేత వ్యాయామం చేయించాలి. అలాగే ఆత్మ జ్ఞానం కలగాలంటే ఆత్మకు వ్యాయామం అవసరం.’’
- మహాత్మా గాంధీ

‘‘పాఠశాల అంటే కేవలం ఒక భౌతిక ప్రదేశం కాదు. అది పిల్లల ఆకాంక్షలకూ, అభివృద్ధికీ సంగమం. వారికిష్టమైన ప్రతి ప్రాణితో, ప్రతి వస్తువుతో, ప్రతి వాస్తవిక అంశంతో సాన్నిహిత్యం నెరపుకొనగల ఒక బహిరంగ ప్రపంచం. పాఠశాలక్కావలసింది బోధకులూ, మహోపాధ్యాయులూ కాదు. కోరినప్పుడు స్నేహ హస్తం అందించగల మంచి మిత్రులు.’’
- అరవిందుడు

‘‘మన పిల్లలకు జ్ఞానాన్ని అందించే సాధనమే బడి అనుకోవడం తప్పు. పాఠశాల అంతకంటే గొప్పది. స్వయం వ్యక్తిత్వం, స్వంత ఆశయాలు లేని మూసపోసిన వ్యక్తుల వల్ల సమాజం ముందుకు పోదు. పాఠశాల స్వంతంగా ఆలోచించగల, వ్యవహరించగల వ్యక్తుల్ని తయారుచెయ్యాలి. మంచి మాటలు చెప్పడం వల్లా, వినడం వల్లా కాదు వ్యక్తిత్వాలు రూపుదిద్దుకునేది. చేసే శ్రమ వల్లా, పని వల్లా మాత్రమే వ్యక్తిత్వాలు రూపొందుతాయి.’’
- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

English Title
Children school age more Valuable in their life
Related News