చటేశ్వర్ చమత్కార్

pujara
  • సెంచరీతో ఆదుకున్న పుజారా

  • టాపార్డర్ పూర్తిగా విఫలం 

  • తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 250/9 

  • ఆస్ట్రేలియాతో తొలి టెస్టు

అడిలైడ్: చటేశ్వర్ పుజారా అవసరాన్ని బట్టి ఆస్ట్రేలియాలో తొలి సెంచరీ చేయడంతో గురువారం ఇక్కడ ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా ఇబ్బందుల నుంచి గట్టెక్కింది. తొలి రోజు కోహ్లీ సేన 9 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. 50 ఓవర్లలో 127 పరుగులకే 6 వికెట్లు నష్టపోయిన సమయంలో పుజారా పట్టుదలగా ఆడి జట్టును గండం నుంచి గట్టెక్కించాడు. అయితే తొలి రోజు చివరి బంతికి రనౌటయ్యాడు. బ్యాటింగ్ ఎండ్‌లో ఉన్న షమీ సింగిల్ తీయబోయాడు. అయితే పాట్ కమ్మిన్స్ విసిరిన బంతి నేరుగా వికెట్లకు తగలడంతో పుజారా పెవిలియన్ దారి పట్టాడు. వాతావరణం అనుకూలిస్తుందని భావించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ టాపార్డర్ విఫలమైంది. మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, కమ్మిన్స్ త్రయం పేస్‌కు టీమిండియా బ్యాటింగ్ లైనప్ పేక మేడలా కుప్పకూలింది. భోజన సమయానికి 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా 250 పరుగులు చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అయితే పుజారా 16వ టెస్టు సెంచరీ చేసి జట్టును గొప్ప ప్రమాదం నుంచి కాపాడాడు. ఈ పోరాటంలో పుజారా ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. 30 ఏళ్ల పుజారా లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో రెండు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దీంతో భారత బౌలర్లకు కాస్త పనికల్పించినట్టయింది. టీ విరామం తర్వాత పుజారా, అశ్విన్ కలిసి ఏడో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత కూడా పుజారా చూడచక్కని బ్యాటింగ్ చేయడంతో టీమిండియా కోలుకుంది. చివరికి కమ్మిన్స్‌కు 74వ ఓవర్లో మరో వికెట్ లభించింది. అశ్విన్ రెండో స్లిప్‌లో ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత పుజారాతో కలిసి ఇషాంత్ శర్మ 21 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో టీమిండియా 200 పరుగుల మైలు రాయిని 79వ ఓవర్లో దాటింది. ఒకసారి ఇషాంత్ శర్మ డీఆర్‌ఎస్ ద్వారా అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఫుల్ లెంగ్త్ బాల్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒకవైపు సహచరులు అవుటవుతున్నా మరో ఎండ్‌లో పుజారా వేగంగా పరుగులు సాధించాడు. భోజన విరామం తర్వాత రోహిత్, పుజారా కలిసి ఐదో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఒక ఎండ్‌లో పుజారా గంభీరంగా ఆడుతోంటే.. మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ సిక్సర్లు కొట్టాడు. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఒక సిక్సర్ బాదాడు. తర్వాత నాథన్ లియాన్ వేసిన రెండో బంతికి కూడా రోహిత్ భారీ షాట్ కొట్టాడు. బౌండరీ లైన్ వద్ద ఉన్న మార్కస్ హారిస్ బంతిని దాదాపుగా పట్టుకున్నాడు. అయితే బ్యాలెన్స్ తప్పడంతో బంతి బౌండరీ లైన్ అవతల పడింది. రోహిత్ ఆట తీరును చూస్తే జట్టును కష్టాల నుంచి గట్టెక్కించే ఉద్దేశంతో ఆడినట్టు కనిపించింది. అంతటితో ఆగలేదు. లియాన్  వేసిన బంతికి మరో భారీ షాట్ కొట్టబోయి డీప్‌లో ఉన్న హారిస్ చేతికి చిక్కాడు. ఆస్ట్రేలియా అటాకింగ్ బౌలింగ్‌ను చితకబాదే ఉద్దేశంతోనే రిషబ్ పంత్ కూడా బరిలోకి దిగాడు. ఐదు బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. తర్వాత నెమ్మదిగా ఆడాలని పుజారా సూచించాడు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 41 పరుగులు జోడించడంతో టీమిండియా 41వ ఓవర్లో 100 పరుగుల మార్క్‌ను దాటింది. తన సహజసిద్ధమైన దూకుడుగా కాకుండా నెమ్మదిగా ఆడమనడంతో పంత్ అసౌకర్యానికి గురయ్యాడు. దీంతో టీ విరామానికి కొద్ది సేపటి ముందు లియాన్ బౌలింగ్‌లో రిషబ్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. మార్నింగ్ సెషన్‌లో హాజిల్‌వుడ్ ఆరంభంలోనే టీమిండియాను దెబ్బతీశాడు. కేఎల్ రాహుల్‌ను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పేసర్లు వరుస విరామ సమయాల్లో వికెట్లు తీయడంతో టీమిండియా 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. టాపార్డర్ కుప్పకూలింది. హనుమ విహారికి బదులుగా ఆరో నంబర్ స్థానంలో రోహిత్ శర్మను బరిలోకి దించారు. ఆస్ట్రేలియా బౌలర్ మార్కస్ హారిస్ ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

స్కోరుబోర్డు
ఇండియా తొలి ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) ఫించ్ (బి) హాజిల్‌వుడ్ 2, మురళీ విజయ్ (సి) పెయిన్ (బి) స్టార్క్ 11, పుజారా రనౌట్ (కమ్మిన్స్) 123, విరాట్ కోహ్లీ (సి) ఖ్వాజా (బి) కమ్మిన్స్ 3, అజింక్య రహానే (సి) హాండ్‌స్కంబ్ (బి) హాజిల్‌వుడ్ 13, రోహిత్ శర్మ (సి) హారిస్ (బి) లియాన్ 37, రిషబ్ పంత్ (సి) పెయిన్ (బి) లియాన్ 25, అశ్విన్ (సి) హాండ్‌స్కంబ్(బి) కమ్మిన్స్ 25, ఇషాంత్ శర్మ (బి) స్టార్క్ 4, మహ్మద్ షమీ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం 87.5 ఓవర్లలో 250/9; వికెట్ల పతనం: 1-3, 2-15, 3-19, 4-41, 5-86, 6-127, 7-189, 8-210, 9-250; బౌలింగ్: స్టార్క్: 19-4-63-2, హాజిల్‌వుడ్: 19.5-3-52-2, కమ్మిన్స్: 19-3-49-2, లియాన్: 28-2-83-2, హెడ్: 2-1-2-0.

కొనసాగుతున్న రాహుల్ వైఫల్యం
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగాడు. ఈ నాలుగు మ్యాచ్‌ల సిరీస్ తొలి రోజు తొలి ఓవర్లో 26 ఏళ్ల రాహుల్ అనవసరమైన డ్రైవ్ షాట్‌కు పోయి స్లిప్స్‌లో ఉన్న ఆరోన్ ఫించ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఫామ్‌లో లేక కొట్టుమిట్టాడుతూ.. జట్టులో స్థిరమైన చోటు కోసం పోరాడుతూ.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పృథ్వీ షా గాయం పాలు కావడంతో తుది జట్టులో చోటు లభించిన రాహుల్ చాలా నిర్లక్ష్యంగా ఆడాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 20 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ ఇలా సింగిల్ డిజిట్‌కు అవుట్ కావడం ఇది తొమ్మిదోసారి. 2017 నవంబర్ 14 నుంచి ఇప్పటి వరకు రాహుల్ 12 టెస్టులు (20 ఇన్నింగ్స్) ఆడి 22.57 సగటుతో 429 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ మాత్రమే ఉన్నాయి. 20 ఇన్నింగ్స్‌లకు గాను 16 ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ ఓపెనర్‌గా దిగాడు. ఈ పీరియడ్‌లో ఓపెనర్‌గా రాహుల్ యావరేజ్ 22.80గా నమోదైంది. ఇది ప్రపంచంలోని ఓపెనర్స్ అందరిలోకి చాలా తక్కువ. ఈ కాలంలో ప్రతి ఒక్క ఓపెనర్ 10 ఇన్నింగ్స్‌ల్లో కనీసం 300 పరుగులు చేశారు. 

Tags

సంబంధిత వార్తలు