‘జ్ఞానధార’

Updated By ManamFri, 07/13/2018 - 00:26
babu
  • పారిశ్రామికవేత్తలు, మేథావులతో ప్రసంగాలు.. ఇకపై రాష్ట్రంలో రెండంచెల విద్యా వ్యవస్థ  

  • నైపుణ్యాభివృద్ధి, నవ్యావిష్కరణలే లక్ష్యంగా విశ్వవిద్యాలయాల్లో అవగాహన సదస్సులు

  • త్వరలో పాఠశాల విద్యలో ఇంటర్ విలీనం.. ఆంధ్రప్రదేశ్‌ను విజ్ఞాన భూమిగా మార్చాలి 

  • ఉపకులపతుల పూర్తి సహకారం అవసరం.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

babuఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను ‘విజ్ఞాన భూమి’ (నాలెడ్జ్ హబ్)గా తీర్చిదిద్దాలన్న మహత్తర ప్రణాళికకు తక్షణమే కార్యాచరణను ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ‘జ్ఞానధార’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి పోటీని తట్టుకునేలా తయారు చేయాలని భావిస్తున్నామన్నారు. ఇందుకు రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాలకు చెందిన ఉప కులపతులు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విశ్వవిద్యాలయాల వీసీలతో ముఖ్యమంత్రి గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ  ప్రస్తుతం మూడంచెలుగా ఉన్న ఉన్నత, మాధ్యమిక, ప్రాథమిక విద్యావ్యవస్థను త్వరలో రెండంచెల వ్యవస్థగా మారుస్తామన్నారు. ఇంటర్మీడియేట్ విద్యను త్వరలో పాఠశాల విద్యలో మిళితం చేస్తామన్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఇంటర్ విద్య పాఠశాల విద్యలో భాగంగా ఉందని అన్నారు. నాలెడ్జ్ ప్రమోషన్ విశ్వవిద్యాలయాల నుంచే జరగాలని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో ‘జ్ఞానధార’ పేరుతో ఓ స్ఫూర్తివంతమైన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మన వర్సిటీల్లో చదువుతున్న 18 లక్షల మంది విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ పోటీ వాతావరణంలో నిలబడేలా తయారుచేయడమే లక్ష్యం అన్నారు.  ఈనెల మూడో వారం నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ‘జ్ఞానధార’ అనే పేరు పెట్టిందని, అయితే ఇంతకంటే మంచి పేరు సూచిస్తే పరిశీలిస్తామని చెప్పారు. విద్యారంగంలో రానున్న కాలానికి అవసరమయ్యే నిర్దిష్ట కార్య ప్రణాళికను రూపొందించుకోవడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. విద్యా, సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో  యువతరానికి మార్గదర్శిగా నిలిచిన పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానించి వారి నుంచి ప్రేరణ పొందేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయాలని సమావేశంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి సూచించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఇన్నోవేషన్ సొసైటీలతో పాటు రాష్ట్రంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాలను కూడా కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని చెప్పారు. ఒక్కొక్క వర్శిటీలో ఒక్కొక్క రోజున నిర్వహించే ఈ కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొని పదివేల మంది విద్యార్థులతో మాట్లాడతానని ముఖ్యమంత్రి చెప్పారు. పోలవరం, అమరావతి, ఇస్రో ప్రగతి, ఐటీ-ఐవోటీ, స్టార్టప్స్ వంటి అంశాలపై విద్యార్థులకు వర్క్‌షాప్ నిర్వహించాలని చెప్పారు. విద్యార్థుల ఆవిష్కరణలు, అవలంభిస్తున్న వినూత్న అభ్యాస విధానాలపై ఎగ్జిబిషన్ నిర్వహించాలని సూచించారు. సీఐఐ సహా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలన్నారు. ఫ్లిప్‌కార్ట్, వాల్ మార్ట్, అలీబాబా, టాటా, మహీంద్రా, ముఖేశ్ అంబానీ వంటి ప్రముఖులను ఆహ్వానించి వారి ద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తి నింపి వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని కళాశాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలన్నారు. 

నిధుల బాధ్యత వర్సిటీలదే..
ఆయా కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన నిధులను ఉన్నత విద్యామండలి, ఆయా వర్సిటీలే సమకూర్చుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. కాగా, ప్రతిభా పురస్కార గ్రహీతలు, వివిధ అంశాల్లో ప్రావీణ్యం కనబరిచిన వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అంతేకాక ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తామని, దీని ద్వారా ఈవెంట్ రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు.

18న అంబేద్కర్ వర్సిటీలో.. 
ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 18న శ్రీకాకుళంలోని డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుంచి జ్ఞానధార ఈవెంట్ ప్రారంభం అవుతుంది. ఆగస్టు 2న విజయనగరం జేఎన్‌టీయూలో, 17న విశాఖ ఏయూలో, 31న పశ్చిమగోదావరి జిల్లా వైఎస్‌ఆర్ హార్టీకల్చరల్ వర్సిటీలో, సెప్టెంబరు 14న నన్నయ్య విశ్వవిద్యాలయంలో కార్యక్రమాలు జరుగుతాయి. సెప్టెంబరు 30న మచిలీపట్నం కృష్ణా వర్సిటీ, విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలకు కలిపి, అక్టోబరు 12న గుంటూరు నాగార్జున, ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయాలకు కలిపి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మిగిలిన విశ్వవిద్యాలయాల్లో కూడా వరుసగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. వీసీలు చొరవ చూపాలి..

నాలుగేళ్ల కళాశాల చదువు ఆ తరువాత నలభై ఏళ్ల జీవితానికి కెరియర్‌కు ఏవిధంగా ఉపకరిస్తుందో మేధోమధనం చేసి ప్రభుత్వానికి తగు సూచనలివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపకులపతులను కోరారు. మన విశ్వవిద్యాలయాల్లో బోధించే సిద్ధాంతాలకు, వాస్తవ రూపానికి చాలా వ్యత్యాసం ఉంటోందని ముఖ్యమంత్రి ఆవేదన వెలిబుచ్చారు. ఆలోచనలకి, ఆచరణకి దూరంగా మన విద్యావిధానం ఉండడం దురదృష్టమన్నారు.విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై మార్గదర్శనం చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వీసీలను కోరారు. వర్సిటీల్లో సాంకేతికతను, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించే కోర్సులకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. ప్రతి వర్శిటీని నాలుగైదు పరిశ్రమలకు అనుసంధానం చేయడం ఇక నుంచి తప్పనిసరి అన్నారు. చదువుకుంటూ పనిచేసే అవకాశాలు కల్పిస్తూ ప్రతి విద్యార్థిని ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా తర్ఫీదునిచ్చే విధానాలు తీసుకురావాలన్నదే సంకల్పమని చెప్పారు. కాగా, ప్రతి లక్ష మంది జనాభాకు 48 కళాశాలలతో ఏపీ జాతీయస్థాయిలో నాలుగో స్థానంలో నిలిచిందని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ చెప్పారు. 27 యూనివర్సిటీలు, 7 జాతీయ ప్రాథాన్యత గల విద్యా సంస్థలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు, ముఖ్య కార్యదర్శులు ఉదయలక్ష్మి, రావత్, ముఖ్యమంత్రి కార్యదర్శులు రాజమౌళి, గిరిజాశంకర్ పాల్గొన్నారు.

150 ఎకరాల్లో గిడ్డంగులు
ముఖ్యమంత్రి చంద్రబాబుతో వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ గ్రూపు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి సమావేశయ్యారు. 150 ఎకరాల్లో అత్యాధునిక గిడ్డంగులు నిర్మించి, 10 వేలమందికి ఉపాధి కల్పించనున్నామని సంజీవ్ తెలిపారు. స్థానిక రైతులు తమ ఉత్పత్తులను వాల్‌మార్ట్ ద్వారా విక్రయించుకునేందుకు సహకరిస్తామని చెప్పారు. తాము ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో వ్యాపారావకాశాల కల్పనలో రోల్‌మోడల్‌గా ఉన్నామని వివరించారు. వాల్‌మార్ట్ 50 వేల కోట్ల టర్నోవర్ కలిగి ఉందని, ఏడాదికి 60 శాతం వృద్ధి సాధిస్తున్నామని ముఖ్యమంత్రికి సంజీవ్ వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ఉత్పత్తులను సేకరించి, వాటిని సరఫరా చేసేందుకు తమకు సమర్థ రవాణా వ్యవస్థ ఉందని తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ.. వాల్‌మార్ట్ సంస్థ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడానికి, సెంటర్లు నెలకొల్పడానికి అనంతపురం జిల్లా అత్యంత అనుకూల ప్రాంతమని అన్నారు. అక్కడ వాల్‌మార్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తే చెన్నై, బెంగుళూరు వంటి ప్రాంతాలకు సరఫరా చేసేందుకు మరింత వీలుగా ఉంటుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు ప్రారంభించడానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. 

English Title
chandrababu
Related News