ఇక ఏసీలలో ఉష్ణోగ్రత డిఫాల్ట్‌గా 24 డిగ్రీలు! 

Updated By ManamSun, 06/24/2018 - 16:32
Centre wants ACs' default setting at 24°C to save power
  • విద్యుత్ ఆదాకు కేంద్రం సూచన.. 

  • ఏసీలలో కూలింగ్ సామర్థ్యంపై పరిమితి విధించక తప్పదు

  • ఏసీ తయారీదారులతో సమావేశంలో వెల్లడి

Centre wants ACs' default setting at 24°C to save powerన్యూఢిల్లీ: ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ఏసీలు అందుబాటులోకి వచ్చాక ఇంటా బయటా విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. దీంతో పెరిగిన డిమాండ్‌ను అందుకోవడానికి విద్యుత్ ఉత్పత్తి పెంచడం ఓ సమస్య కాగా ఏసీలు వదిలే కర్బన ఉద్ఘారాల నిర్వహణ మరో సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తూ, వాతావరణాన్ని కాపాడుకునేందుకు ఏసీలలో కూలింగ్ సామర్థ్యంపై పరిమితి విధించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తొలిదశలో ప్రజా రవాణా, ప్రభుత్వ కార్యాలయాలలోని ఏసీలను 24 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద స్థిరంగా ఉంచేలా చేసి దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించాలని భావించింది. అదే సమయంలో ఏసీల వినియోగదారుల కోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు. ఆరు నెలల పాటు నిర్వహించే ఈ ప్రచారం తర్వాత ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకొని ఏసీలలో ఉష్ణోగ్రతను డిఫాల్ట్‌గా 24 డిగ్రీలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ఒక్క డిగ్రీ పెంచితే..
ఎండ తీవ్రతను తట్టుకోలేక ఇళ్లు ఆఫీసులలో ఏసీలను 18 నుంచి 21 డిగ్రీలకు సెట్ చేయడం సాధారణమే! దీనివల్ల విద్యుత్ వాడకం గణనీయంగా పెరిగిపోతుంది. నెలాఖరున వచ్చే బిల్లు కూడా భారీగానే ఉంటుంది. అంతేకాదండోయ్.. ఇంత చల్లటి వాతావరణంలో ఎక్కువ సమయం ఉండడం వల్ల దీర్ఘకాలంలో రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటు విద్యుత్ వాడకాన్ని తగ్గిస్తూ.. అటు ప్రజారోగ్యాన్ని కాపాడాలని కేంద్రం యోచిస్తోంది. ఒక్క డిగ్రీ మేర ఏసీ ఉష్ణోగ్రతను పెంచితే దాదాపుగా 6 శాతం విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చని ప్రచారం చేస్తోంది. ఈ ఒక్క నిర్ణయంతో ఏటా సుమారుగా 2 వేల కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చన్నమాట! ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఏసీలపై విద్యుత్ వినియోగాన్ని తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే సూచనలు ముద్రించాలంటూ ఏసీ తయారీదారులకు మంత్రి సూచించారు. ఆరు నెలల పాటు ప్రజలకు అవగాహన కల్పించాక ఏసీలలో 24 డిగ్రీల ఉష్ణోగ్రతను తప్పనిసరి చేస్తామని చెప్పారు. ఈమేరకు ఏసీ తయారీదారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

English Title
Centre wants ACs' default setting at 24°C to save power
Related News