సీబీఎస్‌ఈ టాపర్‌‌పై గ్యాంగ్‌రేప్

Updated By ManamFri, 09/14/2018 - 11:40
who got President award, allegedly gangraped in Haryana
who got President award, allegedly gangraped in Haryana

న్యూఢిల్లీ :  ఓవైపు కఠిన చట్టాలు అమలు అవుతున్నా, మరోవైపు మృగాళ్ల అకృత్యాలకు అంతు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్‌లో కన్నతండ్రి... రక్తం పంచుకుపుట్టిన కూతురిపై అత్యాచారానికి పాల్పడితే, ఇక హర్యానాలో సీబీఎస్‌ఈ బోర్డ్ పరీక్షలో టాప్ ర్యాంకర్‌పై గ్యాంగ్ రేప్ జరిగింది. 

చిన్నారిపై తండ్రి అత్యాచారం, అరెస్ట్
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేవ్ ముజఫర్ నగర్ జిల్లా బుదానాలో ఓ చిన్నారిపై తండ్రి... గత ఆరునెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. భర్త దుశ్చర్యను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, మందలించింది. అయితే ఈ విషయం బయటకు చెబితే చంపుతానంటూ భార్యతో పాటు కూతుర్ని బెదిరించాడు. అయినప్పటికీ భార్య తన కూతురితో కలిసి న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ఓంవీర్ సింగ్ తెలిపారు.

సీబీఎస్‌ఈ టాపర్‌ కిడ్నాప్, గ్యాంగ్‌రేప్
సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల్లో టాప్ ర్యాంకర్ విద్యార్థినిని (19) కొందరు దుండగులు అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన హర్యానాలో కలకలం రేపుతోంది.  మహేంద్రఘర్ జిల్లాలో గురువారం ఈ దారుణం చోటుచేసుకుంది. తన గ్రామం నుంచి రేవారీకి కోచింగ్‌కు వెళుతున్న విద్యార్థిని ... కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో  అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గమనించిన మరికొందరు అఘాయిత్యానికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆమెను బస్టాండ్ వద్ద పడేసి వెళ్లిపోయారు. 

ఈ దుర్ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. అయితే పోలీసులు తమకు ఎలాంటి సాయం అందించలేదని, ఎఫ్ఐఆర్ కాదుకదా, కనీసం ఫిర్యాదు స్వీకరించడానికి కూడా ముందుకు రాలేదని విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటన తమ పరిధిలో జరగలేదంటూ ఓ పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్ అంటూ తిప్పారని ఆరోపించారు. 

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన తన కుమార్తె ప్రధాని మోదీ చేతుల మీదగా అవార్డు తీసుకుందన్నారు. ప్రధాని చెబుతున్నట్లు ‘బేటీ పడావో, బేటీ బచావో’  ఎక్కడ ఉందని, తమకు న్యాయం జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని తల్లి డిమాండ్ చేశారు.

ఎట్టకేలకు ఈ ఘటనపై రేవారీలో ఓ పోలీసు అధికారి స్పందిస్తూ.. మహిళ ఫిర్యాదు మేరకు ‘జీరో ఎఫ్‌ఐఆర్’ నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే అత్యాచారం జరిగిన సంఘటన ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో కేసును ఆ పీఎస్‌కు బదిలీ చేయనున్నట్లు చెప్పారు. అలాగే విద్యార్థినిపై అత్యాచారానికి తెగబడినవారంతా ... ఆమె గ్రామానికి చెందినవారేనని తెలిపారు.

English Title
CBSE Board Exam Topper Allegedly Gang-Raped In Haryana
Related News