సీబీఐ డైరెక్టర్ రెండేళ్లుండాలి!

Supreme Court
  • సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయం

  • సీబీఐ కేసులో ముగిసిన వాదనలు

  • తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం

  • గొడవ రాత్రికి రాత్రే కాలేదు కదా..

  • మరి అప్పటికప్పుడే చర్యలెందుకు?

  • సర్కారు, సీవీసీలకు జడ్జీల ప్రశ్నలు

  • అసాధారణ పరిస్థితుల్లో తప్పదు

  • సీవీసీ తరఫున కోర్టులో వాదనలు

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అనేవాళ్లు ఆ పదవిలో కనీసం రెండు సంవత్సరాల పాటు కొనసాగేలా ఉండాలని సుప్రీంకోర్టు భావిం చింది. సీబీఐ డైరెక్టర్‌గా తనకున్న అధికారాలన్నింటి నీ తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తీర్పును వాయిదా వేసింది. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుని తీవ్రంగా గొడవలకు దిగిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలు కేంద్ర ప్రభుత్వం బలవంతంగా సెలవులో పంపిన విషయం తెలిసిందే. అసలు తనను సెలవులో పంపే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందా అని సవాలు చేస్తూ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తప్పనిసరిగా ఆ పదవిలో రెండేళ్లు ఉంచాలన్న నిబంధనను పాటించలేదని వాదించారు. అయితే, వర్మను ఆ పదవి నుంచి తొలగించలేదని.. కేవలం సెలవుపై పంపామని, ఆస్థానా.. అలోక్‌వర్మ ఇద్దరూ పిల్లుల్లా కొట్టుకోవడం వల్లే అలా చేశామని ప్రభుత్వం వాదించింది. వర్మ ఇప్పటికీ సీబీఐ డైరెక్టరేనని స్పష్టం చేసింది. అయితే, వర్మపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నందున ఆయనపై చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కలగజేసుకోవాలని కేంద్రం కోరింది. నామమాత్రంగా అలోక్‌వర్మను సీబీఐ చీఫ్ అంటే సరిపోదని, ఆయన ఆఫీసులో ఉండాలని వర్మ తరఫు న్యాయవాది వాదించారు. డైరెక్టర్ తన పదవిలో రెండేళ్లు ఉండాలని సుప్రీంకోర్టు కూడా భావించింది. వర్మ-ఆస్థానాల మధ్య గొడవ రాత్రికి రాత్రే వచ్చినది కానప్పుడు ప్రభుత్వం రాత్రికి రాత్రే ఎందుకు స్పందించాల్సి వచ్చిందని ప్రశ్నించింది. జోక్యం చేసుకునే విషయంలో ప్రభుత్వం తన హక్కులు, పరిమితులకు లోబడే వ్యవహరించిందని, వాటిని బట్టే ఇద్దరు అధికారుల అధికారాలన్నింటినీ తప్పించి వారిని సెలవుపై పంపిందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. ప్రభుత్వం తగిన సమయంలో కలగజేసుకుని ఇద్దరిపై తగిన చర్యలు తీసుకోకపోతే అత్యున్నత అధికారుల మధ్య గొడవ ఎప్పుడు ముగుస్తుందో దేవుడికే తెలియాలని ఆయన అన్నారు. ఈ కేసులో వర్మ తరఫున, కేంద్రం, సీవీసీ, మరో ఇద్దరి తరఫున వాదనలు ముగిశాయి. దాంతో కోర్టు తన తీర్పును వాయిదా వేసింది. 

అసాధారణ పరిస్థితులలో అసాధారణ పరిష్కారాలు అవసరం అవుతాయని కేంద్ర విజిలెన్స్ కమిషన్ సుప్రీంకోర్టుకు తెలిపింది. విజిలెన్స్ కమిషన్‌కు సీబీఐని పర్యవేక్షించే అధికారం అసాధారణ పరిస్థితుల్లో ఉంటుందని సీవీసీ తరఫున వాదించిన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అయితే అలాంటి పరిస్థితులు జూలై నెలలోనే వచ్చినట్లు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ చెప్పారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. ప్రభుత్వ చర్యల సారాంశం సంస్థ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని ధర్మాసనం చెప్పింది. రాత్రికి రాత్రే గొడవ జరగనప్పుడు అప్పటికప్పుడే చర్య తీసుకోవాల్సిన అవసరం సీవీసీకి ఏం వచ్చిందని కూడా ప్రశ్నించింది. సీబీఐ ఉన్నతాధికారులు ఇద్దరూ కేసులు దర్యాప్తు చేయడానికి బదులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారని మెహతా కోర్టుకు తెలిపారు. వారిపై దర్యాప్తు చేయాల్సింది సీవీసీయేునని, లేకపోతే అది విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు అవుతుందని అన్నారు. సరిగా స్పందించకపోతే రాష్ట్రపతికి, సుప్రీంకోర్టుకు జవాబుదారీ అవుతుందని చెప్పారు. సీబీఐ డైరెక్టర్ మీద విచారణ చేయాలని ప్రభుత్వమే కోరిందని.. దాంతో సీవీసీ దర్యాప్తు ప్రారంభించినా వర్మ కొన్ని నెలల పాటు పత్రాలు ఇవ్వలేదని తెలిపారు. కాగా, రాకేశ్ ఆస్థానా ఈ కేసులో విజిల్‌బ్లోయర్ అని.. కానీ ప్రభుత్వం మాత్రం అదే బ్రష్‌తో ఆయనకూ పెయింట్ వేసిందని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. వర్మపై సీవీసీ విచారణను తగిన విధంగా ముగించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం వర్మకున్న అధికారాలన్నింటినీ తీసేసిందని వర్మ తరఫు సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్ అన్నారు. జనరల్ క్లాజెస్ చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం.. సీబీఐ డైరెక్టర్ లాంటి అధికారులను ఎవరు తొలగించాలో ఆయన వివరించారు. ఆ అధికారికి డైరెక్టర్ అధికారాలుండాలని, రెండేళ్ల పదవీ కాలం అంటే కేవలం విజిటింగ్ కార్డు ఉంటే చాలదని.. అధికారాలన్నీ ఉండాలని వాదించారు. తాము ఎవరినైనా నియమించవచ్చా అని కోర్టు నారిమన్‌ను అడగ్గా, ఆయన అవునన్నారు. 

సంబంధిత వార్తలు