కేవ్‌మ్యాన్ డైట్ 

Updated By ManamThu, 11/01/2018 - 01:34
kutumbam

imageడైటింగ్, డైట్ కంట్రోల్, ఫిట్నెస్, హెల్త్.. వంటి సబ్జెక్టుల్లో తరచూ వినిపించే మాట ‘కేవ్‌మ్యాన్ డైట్’.  దీన్నే‘పాలియో డైట్’, ‘స్టోన్ ఏజ్ డైట్’గా కూడా పిలుస్తారు.  ఫిట్నెస్ ఫ్రీక్‌లంతా ఇప్పుడు మళ్లీ ఆదిమ మానవుడి ఆహారాన్ని తీసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తూ.. ‘గో బ్యాక్ కు నేచర్’ అన్న పిలుపు ఇస్తున్నారు. ఇది మన ఒంటికే కాదు మన చుట్టూ ఉన్న వాతావరణానికి కూడా చాలా మంచిది. 

imageపాలియోలిథిక్ డైట్‌ను వాడుక భాషలో కేవ్‌మ్యాన్ డైట్ అని వ్యవహరిస్తున్నారు. మన శరీరం డీ టాక్స్ కావాలన్నా, చక్కని శరీరాకృతి పొందాలన్నా, శరీరాకృతిని కాపాడుకోవాలన్నా ఈ ఫార్ములాను పాటించాల్సిందేనని కొందరు న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. అంటే పళ్లు, కూరగాయలు, మాంసాన్ని పెద్దగా వండకుండా తినాలి. ముఖ్యంగా నూనెలు వంటివి వేసి.. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేయించడం, అతిగా ఉడి కించడం చేయకుండా ఆరగించాలి.  దీంతో ఈ ఆహారపదార్థాల్లోని పోషకాలు మన శరీరంలోకి పూర్తిగా వచ్చి చేరతాయి. అతిగా ఉడికించడం, ఫ్రై చేయడం వల్ల వాటిలోని సహజమైన పోషకాలు నశిస్తాయి. పీచు పదార్థాలు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, మినరల్సు ఇలా అన్నీ మనకు దక్కాలంటే మనం తినే తిండిని వండే విధానంలో మార్పులు తీసుకురావాలి. ఇందుకు కేవ్‌మ్యాన్ డైట్ తోడ్పడుతుంది.

ప్రొటీన్
అత్యధికంగా ప్రొటీన్, ఫైబర్ ఉన్న ఈ తరహా ఆహారాన్ని తింటే బరువు తగ్గడంతో పాటు ఉత్సాహంగా, నవయవ్వనంగానూ ఉంటారు. యాంటీ-ఏజింగ్‌గా పనిచేసే ఈ డైట్ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతూనే..ఎప్పుడూ చలాకీగా ఉండేలా ఉత్సాహాన్ని నింపుతుంది. 
 

imageనోరూరించేలా..
మన శరీరంలోని జీవక్రియలను సరైన దిశలో నడిపించేలా చేసే ఆదిమ మానవుడి ఆహారం రుచికరంగానూ ఉంటుంది. ఉప్పు, కారం, నూనెలు, మసాలాలు లేకుండా లేదా అతి తక్కువగా వేసుకుని తినచ్చు కానీ నాన్ స్టిక్ పాత్రలు, కుక్కర్లు, మైక్రోవేవ్లు కాకుండా కుదిరితే నిప్పులు లేదా మంటపై చేసుకోవడం అత్యుత్తమ విధానంగా భావిస్తారు. బార్బిక్యూలు వంటివి తయారు చేయాలంటే ఎలెక్ట్రిక్ స్టవ్‌లు కాకుండా అచ్చమైన నిప్పు కణికలపై చేస్తే వచ్చే ఘుమఘుమలు, కమ్మదనం రుచి మొగ్గలను పరవశించేలా చేస్తాయి. ఇలాంటి మెనూ తినేటప్పుడు మీకు కెలరీల లెక్కలు చూసుకోవాల్సిన అవసరం లేదు..పైపెచ్చు కడుపునిండా మీకు నచ్చినవి ఆరగించి తృప్తిగా జీవితం గడపచ్చు. కానీ దీంతో డయేరియా, తలనొప్పి, క్యాల్షియం లేమి వంటి సైడ్ ఎఫెక్టులు ఉంటాయన్న వాదన ఉన్నప్పటికీ ప్రయోగాత్మకంగా మాత్రం ఇవేవీ రుజువు కాలేదు.
 
మెడిటరేనియన్‌లానే..
అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పళ్లు మీరు యథేచ్చగా లాగించవచ్చు. ఇందులో ఆలివ్ ఆయిల్, కొబ్బరి, పామ్ ఆయిల్ వంటి నూనె గింజలు, గుడ్లు, చేపలు, మాంసం, కాయలు, దుంపలు కేవ్‌మ్యాన్ డైట్ మెనూలో ఉంటాయి. అంటే మనకు నచ్చిన వంటలు వండుకునే క్ర మంలో విడి నూనెలు వాడకుండా నూనె గింజలనే వీటితో పాటు వేసి వండుకుని తింటే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. ఈ నూనెల్లో ఎటువంటి కల్తీలు ఉండవు పైగా అప్పటికప్పుడు ఇవి చేసుకుని తినడమే కాబట్టి రుచిలోనూ తాజాదనం కనిపిస్తుంది. ప్రాసెస్డ్, ఇన్‌స్టంట్ ఫుడ్ తినడం వల్లే వచ్చే అనారోగ్యాలు దరిచేరరాదంటే మన ఆహారపు అలవాట్లలో ఇలాంటి మార్పులు తీసుకురా వాల్సిందే. మధ్యదరా ప్రాంతంలో ఇలాంటి ఆహారాన్నే తింటారు కనుక మిడటరేనియన్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిదని ఇటీవలి కాలం లో దీనికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పుట్టుకొచ్చింది.
 

image

సెలబ్రిటీల డైట్
కేవ్‌మ్యాన్ డైట్ ఇప్పుడు సెలబ్రిటీ డైట్‌గా మారింది. ‘పవర్ డైట్’గా దీన్ని భావించేవారి సంఖ్య విపరీతంగా పెరగడంతో దీనిపై పెద్ద ఎత్తున పరిశోధనలు సాగుతున్నాయి. ఈ డైట్‌లో ధాన్యాలు, పాల ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర ఉండవు కనుక వీటిని ఇష్టపడేవారికి కేవ్‌మ్యాన్ డైట్ ఫాలో కావడం పెద్ద చాలెంజ్. ఇక ఈ వంటలు వండే విధానాలు ఇంటర్నెట్‌లో పుంఖాలు పుంఖాలుగా అందుబాటులో ఉన్నాయి. జ్యూసులు కాకుండా పళ్లు-కూరగాయల సలాడ్లు, నట్స్, కాల్చిన దుంపలు, కూరగాయలు ఇందులో ప్రధానంగా ఉంటాయి. సింగర్, యాక్టర్ మిలీ సైరస్, హిప్ హాప్ స్టార్ కెన్యే వె స్ట్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ గ్లామర్ రహస్యం కూడా ఇదే. తెలుగులో విభిన్న పాత్రలు పోషించిన బాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ రాణే కేవలం కేవ్‌మ్యాన్ డైట్‌నే ఆరగిస్తారు. సెలబ్రిటీలు కొందరు కొన్ని రోజులపాటు ఈ డైట్‌ను ఫాలో అవుతున్నారు. దీంతో చాలా ఈజీగా, వేగంగా మేకోవర్‌లో మార్పు తీసుకురావచ్చు. జీవితకాలంపాటు ఆదిమ మానవుడి ఆహారం తినడం సాధ్యం కాకపోయినా తరచూ వారం, పది రోజులపాటు ఇలాంటి మెనూ ఫాలో కావడంతో శారీరకంగా, మానసికంగా మీరు కోరుకున్న మార్పులు సాధించి, జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించే అవకాశం దక్కుతుంది.

English Title
Caveman diet
Related News