మారతారా.. మార్చేయాలా?

Updated By ManamFri, 11/09/2018 - 01:40
N-Chandrababu-Naidu
  • ప్రకాశం ఎమ్మెల్యేలకు బాబు హెచ్చరిక

  • జిల్లా టీడీపీలో గ్రూపు రాజకీయాలు

  • ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి

  • నియోజకవర్గాల్లో మారని నేతల తీరు

  • బాబు హెచ్చరికలతోనైనా చెక్ పడేనా..?

N-Chandrababu-Naiduఒంగోలు: ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. తమలో తామే కలహించుకుంటూ పార్టీని నిలువునా భ్రష్టుపట్టిస్తూ కేడర్ రెండుగా చీలడానికి కారణమైన ఎమ్మెల్యేలకు ‘‘మీరు మారతారా? మీ సీట్లు మార్చేయనా’’ అంటూ సీఎం ఇచ్చిన వార్నింగ్ అధికార టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. గత కొంతకాలంగా టీడీపీలో నేతమ మధ్య సమన్వయం లేక, గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ఇటీవల రెండు రోజుల పాటు ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించారు. పర్చూరు నియోజకవర్గం మార్టూరు బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత ఒంగోలులో జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారిన కొండపి నియోజకవర్గ సమీక్షలో చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాలా వీరాంజనేయస్వామితో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఆయన సోదరుడు దామచర్ల సత్యకు సైతం సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. 

దామచర్లకు కూడా..
అదే సమయంలో నియోజకవర్గంలో మరో గ్రూపునకు నేతృత్వం వహిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ను సైతం అందరినీ కలుపుకొని సమన్వయంతో పని చెయ్యాలని హెచ్చరించినట్లు సమాచారం. గ్రూపు రాజకీయాలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని మండిపడ్డారంటున్నారు. కొండపిలో ఎమ్మెల్యే స్వామి, దామచర్ల సత్య ఓ వర్గంగానూ, దామచర్ల జనార్దన్, జూపూడి ప్రభాకరరావు మరో వర్గంగానూ ఉంటున్నారు. దామచర్ల కుటుంబం ఇలా రెండుగా విడిపోవడంతో బాబు సైతం అసహనం వ్యక్తం చేశారు. నాలుగైదు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించుకుని నాకు నివేదికలు ఇస్తారా ? మిమ్మల్ని కార్యకర్తల స్థానాల్లో కూర్చోపెట్టమంటారా అని కూడా బాబు కాస్త సీరియస్‌గానే వారిని ప్రశ్నించినట్టు సమాచారం.

కందులపై ఫిర్యాదు..
పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డిపై నియోజకవర్గానికి చెందిన కొందరు కీలక నాయకులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యకర్తలను ఆయన ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, కందుల కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువ అవుతోందని ఫిర్యాదు చేశారు. దీంతో.. వ్యవహారశైలి మార్చుకోవాలని కందులను చంద్రబాబు హెచ్చరించారు. యర్రగొండపాలెంలో ఎమ్మెల్యే డేవిడ్‌రాజునూ మార్చేయాల్సి ఉంటుందని చెప్పినట్లు సమాచారం. సంతనూతలపాడు ఇన్‌చార్జి విజయకుమార్‌ను మార్చేయాలని ఇప్పటికే నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ నాయకులు రోడ్డెక్కారు. విజయకుమార్ ఈ నియోజకవర్గ నేతలు చాలాసార్లు ముఖ్యమంత్రికి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదుచేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న బాబు.. ఎంపీపీలు, మండల స్థాయి నేతలు చెప్పినట్లు ఎందుకు వినడం లేదంటూ విజయకుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పర్యటనలో చంద్రబాబు ఇలా చాలామంది నేతలకు తలంటేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గ్రూపు తగాదాలను సహించే పరిస్థితి లేదని ఆయన కుండబద్దలు కొట్టేశారు. చాలామందికి హెచ్చరికలు ఇచ్చినా.. సీనియర్ రాజకీయ నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ప్రాధాన్యం ఇచ్చినట్లు అయ్యిందని టీడీపీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. చంద్రబాబు పర్యటనలో చేసిన హెచ్చరికల నేపథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆ మర్నాడే పార్టీ కార్యాలయంలో కొండెపి టీడీపీ నేతలో భేటీ అయ్యారు.  సమస్యలుంటే తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే నియోజకవర్గ టీడీపీ నాయకులు ఎమ్మెల్యే స్వామి వ్యవహారశైలిపై అసంతృప్తితోనే ఉండటం గమనార్హం.


రెండు వర్గాలుగా చీలడంతో..
కొండపి నియోజకవర్గ టీడీపీ రెండేళ్లుగా జనార్దన్, స్వామి వర్గాలు గా రెండుగా చీలిపోయింది. ఓ వర్గం స్వామికి మద్దతు పలుకుతుంటే మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రెండేళ్లుగా పార్టీ పరిశీలకుల మ ద్యవర్తిత్వంతో ఎన్నోసార్లు ఈ సమస్యను పరిష్కరించేందుకు సమావేశవైునా ఈ వివాదం ఓ కొలిక్కి రాలేదు. చివరకు చంద్రబాబు వద్దే తాడో పేడో తేల్చుకోవాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి,. ఈ క్రమంలోనే మారతారా.. మార్చేయాలా అని ఈ ముగ్గురికీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే స్వామిని ఉద్దేశించి ‘నియోజకవర్గంలో కార్యకర్తలు, ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపిస్తేనే తమరు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు తమరు ఒంటెద్దు పోకడలతో వారిని పక్కన పెడితే వారు మిమ్మల్ని కిందకు దింపేస్తారు’ అని హెచ్చరించడంతో స్వామి ముఖం మాడిపోయినట్టు తెలిసింది.

English Title
Can i change ..
Related News