బ్రేకప్.. బేఫికర్!

Updated By ManamSun, 07/22/2018 - 01:08
breakup
  • పగిలిన గుండెలకు అతుకు.. బయటకు రాకపోతే నరకం

  • తీవ్ర కుంగుబాటు.. నిద్రలేమి.. కాలం మాన్పించలేని గాయం

  • శాస్త్రీయ పద్ధతులైతేనే మేలు.. 20-37 ఏండ్ల వారిపై ప్రయోగాలు

  • బయటపడే మార్గాల అన్వేషణ.. పద్ధతులు సూచించిన శాస్త్రవేత్తలు

breakupప్రేమలో పడటం ఎంత సహజమో అందు లో విఫలం కావడం... అంటే బ్రేకప్ చెప్పేసుకోవడం కూడా అంతే సాధారణం. అయితే అలా గుండె పగిలినప్పుడు తిరిగి అతుక్కోడానికే చాలా సమయం పట్టేస్తుంది. అటు అబ్బాయిలు.. ఇటు అమ్మాయిలు ఇద్దరికీ ఆ పరిస్థితి నరకం చూపిస్తుంది. దాన్నుంచి బయటకు రావడం ఎలాగో తెలుసుకోవడం చాలా ముఖ్యం కదూ.. మరి ఇంకెందుకు ఆలస్యం.. చూడండి!! ప్రేమలో విఫలం అయినప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉం టుంది. రకరకాల సమస్యలన్నీ ఒక్కసారిగా ముంచుకొస్తాయి. ప్రధానంగా కుంగుబాటు, ఆందోళన, నిద్రలేమి లాంటివి బాగా కనిపిస్తాయి. సాధారణంగా ఎవరి దగ్గరకు వెళ్లినా ఇలాంటి గాయాలను కాలమే మాన్పిస్తుందని చెబుతారు. కానీ అదంతా ఒట్టి ట్రాష్. అస్సలు నమ్మకండి. అలా కొంతకాలం పాటు వేచి ఉండటం వల్ల గాయం మానకపోగా, మరింత ఇబ్బంది పెట్టే ప్రమాదముంది. మరి ఏం చేయాలని అనుకుంటున్నారా.. మీలాంటి వాళ్ల కోసమే శాస్త్రవేత్తలు ఈ అంశంపై సరికొత్త పరిశోధనలు చేశారు. బ్రేకప్ తర్వాత పాటించాల్సిన కొన్ని వ్యూహాలను సిద్ధం చేశారు. దానివల్ల మా మాజీ ప్రేమికులు/ ప్రేమికురాళ్ల ఆలోచనల నుంచి త్వరగా బయట పడచ్చు. అంతేకాదు, బ్రేకప్ తర్వాత చాలా ఆనందంగా కూడా ఉండచ్చు. ఈ అంశంపై యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరికి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి.. ఆ వివరాలను ద జర్నల్ ఆఫ్ ఎక్స్‌పరిమెంటల్ సైకాలజీలో ప్రచురించారు. ఇందుకోసం 20 నుంచి 37 సంవత్సరాల మధ్య వయసున్న కొంతమంది యువతీ యువకులను, పురుషులు - మహిళలను తీసుకుని, వారిపై రెండున్నరేళ్ల పాటు పరిశోధనలు సాగించారు. వారంతా గుండెలు ముక్కలైనవాళ్లే. ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన పద్ధతులు చెప్పి వాటిని అవలంబించిన తర్వాత ఎవరు త్వరగా కోలుకున్నారో చూశారు. వాటి ఆధారంగా త్వరగా కోలుకోడానికి వీలైన పద్ధతులన్నింటినీ సిద్ధం చేసి భగ్నప్రేమికుల కోసం అందించారు. ముందుగా... మాజీ ప్రియులు/ప్రియురాళ్ల గురించి నెగెటివ్‌గా ఆలోచించాలి. దానివల్ల వాళ్ల మీద ప్రేమ లేదా ఆకర్షణ పూర్తిగా తగ్గుతుంది. రెండోది తమ మాజీ భాగస్వాముల మీద ప్రేమ ఉందన్న విషయాన్ని ఒప్పుకోవడం. మూడోది పూర్తిగా దూరంగా వెళ్లిపోవడం. నాలుగోదాంట్లో స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. ఇలా కొంతకాలం చేసిన తర్వాత వాళ్ల మాజీ ప్రియులు లేదా ప్రియురాళ్ల ఫొటోలు చూపించి, వారి మనసు ఎలా స్పందిస్తోందన్న విషయాన్ని శాస్త్రీయంగా పరిశీలించారు. మూడు రకాల పద్ధతులు అవలంబించిన వాళ్లు దాదాపుగా తమ భగ్న ప్రేమ గురించి మర్చిపోయే పరిస్థితి కి వచ్చారట. ఆ తర్వాత ఇదే అంశం మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. మరింత సమర్ధంగా ఉండే ఇంకో ఐదు రకాల పద్ధతులను కూడా భగ్న ప్రేమికుల కోసం అందించారు. 

1. సోషల్ మీడియాలో బ్లాక్ చేయడం
ఫేస్‌బుక్‌లో వాళ్ల పోస్టింగులు కనపడకుండా పూర్తిగా అన్‌ఫ్రెండ్ చేయడం, అలాగే వాట్సాప్‌లో కూడా అకౌంట్ బ్లాక్ చేయడం, పాత చాట్‌ల వివరాలన్నింటినీ క్లియర్ చేసేయడం లాంటివి చే యాలి. వాళ్లకు సంబంధించిన ఎలాంటి జ్ఞాపకాలు దగ్గర పెట్టుకోకూడదు. ఫొటోలను కూడా శాశ్వతంగా డిలీట్ చేయాలి. అ లాగే బ్రేకప్ తర్వాత మీరు ఎంత ఆనందంగా గడుపుతున్నారో తెలియజేసేందుకు మీ ఫొటోలు ఎక్కువగా పోస్ట్ చేయండి. 

2. ఎలా నిరాశపరిచారో రాయాలి
మీ మాజీ ప్రియులు లేదా ప్రియురాళ్లు వివిధ అంశాలలో మిమ్మల్ని బాగా నిరాశ పరిచిన సందర్భాలు తప్పక ఉండే ఉంటాయి. వాటన్నింటినీ ఒక డైరీలో రాసి పెట్టుకోండి. ఖాళీ ఉన్నప్పుడల్లా చదువుతుంటే, వాళ్ల మీద ఆరాధనా భావం తగ్గిపోయి.. వాళ్లకు దూరం అవుతారు, అప్పుడు ప్రశాంతంగా ఉంటారు కూడా. ఈ విషయంలో మన మెదడు స్పందనలు కూడా చాలా బాగుంటాయి. 

3. వాళ్ల వస్తువులుంటే పారేయాలి
ఒకవేళ మీ దగ్గర వాళ్లు ఇంతకుముందు ఏదైనా సందర్భాలలో ఇచ్చిన బహుమతులు గానీ, వేరే రకమైన వస్తువులుగానీ ఏమైనా ఉంటే అన్నీ కలిపి కట్టగట్టి వదిలించుకోండి. మీ బర్త్‌డే అప్పుడో, వాలంటైన్స్ డేకో వాళ్లు ఎంత అందమైన బహుమతి ఇచ్చినా.. దాన్ని వెంటనే మీ కనుచూపు మేరలో ఎక్కడా కనపడకుండా పారేయండి. అవి ఉంటే మళ్లీ మళ్లీ వాళ్ల జ్ఞాపకాలు వెంటాడి నిద్రలేకుండా చేస్తాయి.

4. డేటింగ్‌కు వెళ్లడం
వినడానికి, చదవడానికి ఇది ఇబ్బందికరంగా ఉండచ్చేమో గానీ.. నూటికి నూరు శాతం దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. నెలకు కనీసం పదిసార్లు డేటింగ్‌కు వెళ్లడం వల్ల పాత ఆలోచనల నుంచి చాలా త్వరగా బయటకు వచ్చేస్తారట. కొత్త పార్ట్‌నర్ వచ్చిన ప్రతిసారీ సరికొత్త ఉత్తేజం, ఉల్లాసం వస్తాయని, తద్వారా మాజీ భాగస్వాములను సులభంగా మర్చిపోతారని అంటున్నారు.

5. మీకు మీరు సవాలు చేయండి
మీరు ఏదైనా సానుకూలంగా చేయాలని మీకు మీరు సవాలు విసురుకుని.. దాన్ని సాధించి చూసుకోండి. అప్పుడు మీ పాత భాగస్వాములను మిస్ అవుతున్నామన్న భావన నుంచి బయటకొచ్చి, కొత్తగా ఏదో సాధించామన్న సంతోషంలో ఉంటారు. మీ మాజీ ప్రేమికుల వద్దకు వెళ్దామనిపించేలోపే ముందు ఒక సవాలు కనిపించడం, దాన్ని సాధించాలన్న తపన ఉండటంతో మూడ్ పూర్తిగా మారిపోతుందట.

English Title
Brick .. Fulfiller!
Related News