నలుపు అశుభం కాదు  అజేయం!

Updated By ManamThu, 06/14/2018 - 00:13
buddha

imageతమిళ దర్శకుడు పా.రంజిత్ మహాద్భుతంగా మలచి న, సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ సిని మా వచ్చాక నలుపు తెలుపుల ప్రస్థావనలు ప్రము ఖంగా వినిపిస్తున్నాయి. అనేక వాదోపవాదాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో, టి.విలలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. మూలవాసులు, శ్రామిక ప్రజలు, దళిత శక్తులు, ద్రవిడ జాతులు ఈ చిత్రాన్ని తమ సొంతం చేసుకున్నాయి. ఈ సందర్భం గా ఎవరికైనా మట్టి నుంచి పుట్టిన మహాకవి మద్దూరి నగేష్ బాబు కలం నుంచి పొంగివచ్చిన నల్లని సిరా చుక్కలు అల్లిన...
    ‘‘ఈ దేశం నెత్తిమీద నల్లజెండాని
      జాతీయ జెండాగా మారుస్తాం’’
అనే  ‘నల్లపూస’ కవిత గుర్తుకు రాక మానదు. 
‘నలుపు, తెలుపు’ అనేవి కేవలం రంగులైతే ఈ చర్చ లు జరిగేవే కాదు. అవి నాగరికత నిర్మాణానికి చిహ్నా లుగా, జాతులకు గుర్తులుగా, పీడిత వర్గాలకు సంకే తాలుగా, ఉచ్ఛనీచాలకు ఉపమానాలుగా లెక్కించ బడుతున్నాయి కాబట్టే ఈ వాదోపవాదాలు. మొత్తం ప్రపంచంలో ‘తెలుపు’ దోపిడీదారులకి, ‘నలుపు’ పీడిత ప్రజలకు సంజ్ఞలుగా మారాయి. చివరికి మన సంస్కృతిలో భాగమైపోయాయి. శుభాలకు తెలుపు, అశుభాలకు నలుపు మారురూపాలుగా మారి   పోయాయి. నిజానికి సైన్స్ ప్రకారం చూస్తే తెలుపు, నలు పులు రెండూ రంగులు కాదు. ఏడు రంగుల ఇంద్ర ధనసులో ఈ రెండు రంగులూ ఉండవు. ఒక వస్తువు మీద కాంతి పడినప్పుడు ఆ వస్తువు కాంతిలోని ఏ రంగుని బైటకు నెట్టేస్తే ఆ వస్తువు ఆ రంగులో కన్పి స్తుంది. ఏ రంగునీ బైటకు నెట్టకుండా కాంతి మొత్తా న్ని తనలోనే ఉంచుకుంటే అది నల్లగా కన్పిస్తుంది. ఏ రంగునీ ఉంచుకోకుండా మొత్తం కాంతిని బైటకు నెట్టే స్తే అది తెల్లగా కన్పిస్తుంది. అలాగే మన శరీరంలో మెలనిన్ అనే ఎంజైము వల్ల నల్లని రంగు వస్తుంది. ఇంకా, ఎండలో ఎక్కువగా ఉండటం వల్ల అతినీలి లోహిత కిరణాల తాకిడి వల్ల కూడా నల్లని రంగు కలుగుతుంది 
నిజానికి ...
నలుపు, ఆహ్వానానికి గుర్తు. ఆత్మీయతకి గుర్తు. కలుపుగోలుతనానికి గుర్తు. స్వీకారానికీ, సంస్కారా నికి గుర్తు. అందుకే ... అది కాంతిని లోనికి ఆహ్వాని స్తుంది. ‘నన్నంటుకోకు, నాలోకి రాకు’ అని మడికట్టు కోదు. మరి, తెలుపు తిరస్కారానికి గుర్తు. తన దగ్గరకు ఏ రంగునీ రానీయని అహంభావానికి గుర్తు. అలాగే ... నలుపు తేజస్సుకు సంకేతం. మెలనిన్ వల్ల శరీరంలో నునుపుదనం ఎక్కువ కాలం ఉంటుంది. శరీరం కాంతిమంతంగా, జీవకళ ఉట్టిపడుతుంది. మెలనిన్ లోపంవల్ల శరీరం పాలిపోతుంది. నల్లని వాళ్ళ కంటే తెల్లనివాళ్ళ శరీరం త్వరగా తేజోహీనం అవుతుంది. అందం ముడతలు పడుతుంది. కాబట్టి నలుపు తేజస్సుకి సంకేతం. మరి, అలాగే... శ్రమైక జీవన సౌందర్య సందేశం కూడా.

కానీ, మానవ సమాజాల్లో ఏర్పడ్డ వర్ణ, వర్గ స్వ భావాలు, దోపిడీ మనస్తుత్వాలు చాకిరి చేసే వారిని బానిసలుగా మలచుకున్న వ్యవస్థలు ‘నలుపుని’ చిన్న చూపు చూశాయి. ఇతర ప్రపంచంలో తెల్లజాతి వారు నల్లజాతి ప్రజలపై పెత్తనం ఎలా సాగించారో, మన భారతదేశంలో తెల్లజాతి (నిజానికి ఎర్రజాతి) ఆర్యు లు, నల్లవారైన మూల వాసులపై పెత్తనం అలాగే సాగించారు. భావజాలపరంగా, భౌతికంగా కూడా వారి పెత్తనం కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలో సామ్యవాద భావాలు వెల్లివిరిశాక, నిమ్న జాతులు, దిగువ కులాల మహుజనులు కళ్ళు తెరిచాక ‘నలుపు’ ఉద్యమ పిలుపుగా మారింది. ప్రతిఘటనకి, పిడికిలికి సంకేతం అయ్యింది. ఆత్మ విశ్వాసానికి ఆనవాలు అయ్యింది. వైదిక భారతంలో నలుపు అశుభానికి గుర్తు. అది రాక్షసుల రంగు. సింధూ ప్రజల రంగు. దశ్యుల (ద్రవిడుల) వర్ణం. వైదిక సాహిత్యం నిండా ఇలాంటి వర్ణనలే కనిపిస్తాయి. ఈ రంగు రోగం ఎంత దాకా ముదిరిందంటే ... ఉత్తర భారతీయులది శుక ్లయజుర్వేదం (తెల్లని యజస్సులు), ద్రవిడ దేశం వారి ది కృష్ణ యజుర్వేదం (నల్లని యజస్సులు) అనే దాకా పోయింది. శుక్ల యజుర్వేదీయులు కృష్ణ యజుర్వే దాన్ని అంగీకరించరు. అవలంభించరు. ‘అంటరాని’ దాని లాగానే చూస్తారు. నల్లని రంగుని నీచంగా భావించే వీరిని ‘రక్షించడానికి’ ఇటీవల కొందరు సూడో పండితులు రాముడు, కృష్ణుడు, విష్ణువు నల్లని వారే! అంటూ సమర్ధించుకుంటారు. ఇది పెద్ద దగా! పచ్చి మోసం!

వేదంలో విష్ణువు విశ్వానికి సంకేతం. అంటే అనంత ఆకాశం. ఆకాశం రంగు నీలం. కాబట్టి అనంతాకాశం, లేదా అనంత విశ్వం రంగు నీలంగా భావించి విష్ణువుకి నీలం రంగుని సంకేతంగా ఉంచారు. అంతేగాని నలుపుని కాదు. రాముడు నీలం రంగువాడు.  అయితే ... కృష్ణుడు మూలవాసి, పైగా పశువుల కాపరి. నల్లనివాడే! నిజానికి కృష్ణుడు యజ్ఞవిరోధి. ఇంద్రవైరి. వేదధిక్కారి. ఆర్య దైవాల స్థానంలో తనను తాను దైవంగా నిలుపుకున్న కుశాగ్ర బుద్ధి. ధైర్యశాలి. ఆర్య క్షత్రియులతో కాళ్ళు పట్టించు కున్న ధీశాలి. ఆర్యులు మూలవాసుల్ని రాక్షసులనీ, దాసులనీ, దశ్యులనీ నిందించింది, చులకనగా చూ సిందీ, శత్రువులుగా భావించిందీ... మనకు వైదిక సాహిత్యంలో అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది.

ఈ వర్ణభేదం యజుర్వేద అనంతర కాలానికి బా గా ముదిరిపోయింది కూడా. క్రీ.పూ. ఆరో శతాబ్దానికి తెలుపుని శుభంగా, విజయానికి సంకేతంగా నలుపుని అశుభంగా, అపజయానికి గుర్తుగా భావించే వైదిక భావజాలం బలీయంగా  వేళ్ళూనుకుంది. ఈ భావ జాలాన్ని బద్దలు చేస్తూ, వర్ణ వ్యత్యాసాల్ని కుల అమా నుషాల్నీ కూలదోచిన బౌద్ధంలో.. ఈ వైదిక సంప్ర దాయానికి విరుద్ధమైన అంశాలు కొన్ని ఉన్నాయి. అందులో ...
ఒకటి : నలుపుని శ్రమకి, విశ్వాసానికి ప్రతీకగా చూపించే ‘కణ్ణ జాతకం’ అనే కథ.
రెండు: నలుపు అశుభం కాదు, అజేయం అని చెప్పిన ‘చూళ కాళింగ జాతకం’ అనే కథ. 
వీటిలో మొదటి విషయం చూద్దాం:
ఒక బ్రాహ్మణుడు తన ఆవుకి నల్ల దూడ పుట్టిం దని, ఆ దూడను ఒక ముసలమ్మకు ఇచ్చేస్తాడు. దానిని ముసలమ్మ ప్రేమతో బిడ్డలా పెంచుకుంటుం ది. దానిపేరు కణ్ణ. కణ్ణ అంటే కృష్ణ అని. కణ్ణ, కన్న అనేవి పాళీ పదాలు. నల్లెద్దు. లేదా కర్రెద్దు. అది చాలా విశ్వాసమైంది. చాలా బలమైంది. అంతకు మించి సాధుశీలి. చిన్నపిల్లలు కూడా దానితో ఆట లాడేవారు. ఒకరోజున...ఒక వ్యాపారి వంద బళ్ళపై సరుకులెత్తుకుని వెళ్తూ, నదిలోని రేవు మార్గంలో పో తుంటాడు. అతని ఎడ్లు ఆ ఇసుకలో బండ్లను లాగ లేక మొరాయిస్తాయి. అతనికి దూరంగా పచ్చికలో మేస్తూ ఉన్న ఈ నల్లెద్దు కన్పిస్తుంది. దాన్ని బలవం తంగా లాక్కొచ్చి, బళ్ళకు కట్టి లాగించాలనుకుంటా డు. అది రంకెవేసి, బుసకొట్టి, కుమ్మడానికి సిద్ధపడు తుంది. అలా లాభం లేదని, బళ్ళులాగితే వెయ్యి వర హాలు ఇస్తానని ప్రాధేయపడతాడు. ఆ డబ్బు తనను పెంచే పేదరాలు ముసలమ్మకు ఇవ్వాలని ఆలోచించి, నల్లెద్దు వెళ్ళి బళ్ళన్నింటినీ రేవు దాటిస్తుంది. తీరా పని పూర్తయ్యాక ఆ వ్యాపారి 500 వరహాలు మూట కట్టి దాని మెడలో వేస్తాడు. అది గమనించిన అది తన శ్రమకు తగిన ఫలితం రాలేదని, వ్యాపారి మోసం చేశాడని గ్రహించి, అతని దారికి అడ్డంగా నిలబడుతుంది. ముందుకు కదలనివ్వదు. చేసేది లేక వాడు మిగిలిన 500 వరహాలు కూడా ఇస్తాడు. ఆ సొమ్ము తెచ్చి ముసలమ్మకిస్తుంది నల్లెద్దు.
ఇక్కడ... నల్ల ఎద్దుతో కథను నడిపించడం అంటేనే... అది  కష్టజీవులకు సంకేతం. బలవంతాన, దౌర్జన్యంతో పనిచేయించుకొనే వారికింద ‘బానిసగా’ బతకకూడదనీ, శ్రమకు తగిన ఫలితం రాకపోతే, ఎది రించి, పోరాడి, సాధించుకోవాలనే గొప్ప సందేశం ఉంది. మార్క్సిజాన్ని మొత్తం ఈ ఒక్క కథలో చూడొ చ్చు. కఠోర శ్రమకి, విశ్వాసానికి, దోపిడిపై పోరా టా నికీ ‘నలుపుని’ సంకేతంగా చెప్పిన కథ ఇది.

ఇక మరో కథ చూద్దాం :
కళింగ రాజు కాళింగుడు, అకస్మాత్తుగా అశ్మక రాజ్యం (నేటి బోధన్) పైకి దండయాత్ర కొస్తాడు. అశ్మక రాజు అశ్వకుడు భయపడతాడు. చివరికి తన మంత్రి ప్రోత్సాహంతో యుద్ధానికి సిద్ధమవుతాడు. ఇరు సైన్యాలు రాజ్య పొలిమేరల్లో నిలబడ్డాయి. ఆ ప్రాంతంలో ఒక ముని ఆశ్రమం ఉంది. ఆయన భవిష్యత్తు చెప్పగల నేర్పరి అని విని కాళింగుడు మారువేషంలో ముని దగ్గరకు వెళ్తాడు. ‘ఈ యుద్ధంలో ఎవరు గెలవగలరు?’ అని అడుగుతాడు. ఆ ముని దేవరాజుతో మాట్లాడి ‘కళింగరాజే విజయం సాధిస్తాడు’ అని చెప్తాడు. ఆ మాటవిని ఆనందంతో వెళ్ళి, ఈ విషయం అందరితో చెప్తాడు కాళింగుడు. వేగులద్వారా ఈ వార్త తెలిసిన అశ్వకుడు, అతని మంత్రి... ఇద్దరూ మారువేషాల్లో ముని దగ్గరకు వెళ్ళి విషయం అడుగుతారు.
‘నాయనలారా! కళింగుడే జయిస్తాడు’ అంటాడు. ‘ఎలా చెప్పగలరు?’ అంటాడు మంత్రి. ‘నాయనా! కళింగసేన ముందు ‘శ్వేత దేవత’ ఉంది. ఆమె తెల్లని తేజస్సు విజయానికి చిహ్నం. శుభ సంకేతం. ఆశ్వకుని సేన ముందు ‘కాల దేవత’ ఉంది. ఆమె నల్లని తేజస్సు అశుభానికి, అపజ యానికీ సంకేతం’ అని చెప్తాడు. ఆ మాటలు విని దిగాలు పడిపోతాడు అశ్వకుడు. కానీ, అశ్వకుని మంత్రి ‘‘రాజా! అధైర్యపడకండి. మీరు నిశ్చింతగా యుద్ధం చేయండి. నా ప్రయత్నం నేను చేస్తాను’ అని చెప్పి, ప్రాణాలకు లెక్కచెయ్యని వెయ్యిమంది వీరుల్ని ఎంపిక చేసుకుని, వారికి ఉద్బోధ చేసి ‘మీరు ముందు యుద్ధరంగంలో నావెంట రండి’ అని చెప్పి  ముందుకు ఉరుకుతాడు. వేగంగా వెళ్ళి కాళింగుని ముందు నిలబడిన ‘శ్వేత దేవతను’ కత్తితో ఖండి స్తాడు. మిగిలిన వారంతా శ్వేత దేవతను ముక్కలుగా నరికేస్తారు. ‘విజయ దేవత’గా భావించిన శ్వేత దేవత నేలకరవగానే, కాళింగుడు భయపడతాడు. వెయ్యిమంది వీరులు వీరోచితంగా విరుచుకుపడ గానే, కాళింగుడు జోస్యం చెప్పిన మునిని తిట్టు కుంటూ  పారిపోతాడు. అశ్మక సేన ముందున్న నల్లని కాలదేవత విజయ తాండవం చేస్తుంది. తెలుపుపై నలుపు గెలిచింది. ‘జయాప జయాలు’ రంగులను బట్టి ఉండవని నిరూపించిన బౌద్ధ కథ ఇది.
భారత దేశ చరిత్రలో ‘నలుపు’ను విజయానికి, పరాక్రమానికి, అజేయానికి సంకేతంగా చూపించిన తొలి కథ ఈ బౌద్ధ కథ. అందుకే బౌద్ధం ఈ దేశానికి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి చూపిన మహా సాంస్కృ తిక విప్లవం. సామాజిక తిరుగుబాటు.

 బొర్రా గోవర్ధన్, 
9390600157.

 

English Title
Black is not an injury!
Related News